close

తాజా వార్తలు

ఆధునిక క్రికెట్‌ బుర్ర పుట్టింది నేడే

ఐదో.. పదో.. పదిహేనో కాదు ఏకంగా 28 ఏళ్ల కల. శతకోటి భారతావని పదేపదే కన్న కల. రెండో సారి భారత్‌ ప్రపంచకప్‌ గెలవాలని. అంతర్జాతీయ క్రికెట్‌లో మువ్వన్నెల పతాకం రెపరెపలాడాలని టీమిండియా విశ్వవిజేతగా ఆవిర్భవించాలని అందరూ కన్న కల. అరుదైన కల. సారథులెందరో మారారు. ఆటగాళ్లెందరో వెళ్లిపోయారు. దిగ్గజాలు పగ్గాలు వదిలేశారు. మరి ఆ కల నిజమయ్యేది ఎలా? నిజం చేసేదెవరు?2003లో గంగూలీ ఆఖరి మెట్టుపై ఆగిపోయాడు. 2007 గురించి మరిచిపోతే మంచిది! ఆ తర్వాత భారత క్రికెట్‌లో చీకటి రోజులు మొదలు.

ఈ శిశిరపు చీకట్లు చీల్చి వెలుగు నింపేదెవరు?వందకోట్ల మంది కల నిజం చేసిదెవరు?అప్పుడు ఉదయించాడు మహేంద్రసింగ్‌ ధోనీ. అంచనాల్లేని టీ20 ప్రపంచకప్‌ను ముందు అందించాడు. అంచనాలు నెలకొన్న వన్డే ప్రపంచకప్‌ను తర్వాత అందించాడు. ఆ తర్వాత అతనో క్రికెట్‌ రుషిగా మారిపోయాడు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ అదనపు బహుమతి. అరుదైన ఘనతలు అందుకొని చిన్న వయసులోనే అంతులేని సంతృప్తి పొందాడు. జీవితంలో లోటన్నదే లేకుండా చేసుకున్న మేధావి. ఆ క్రికెట్‌ బుర్ర పుట్టింది నేడే. జులై 7 మహేంద్రుడి జన్మదినం. చివరి ప్రపంచకప్‌ ఆడుతున్న తరుణంలో అతడు 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ధోనీ గొప్పదనం గురించి ప్రముఖుల ప్రశంసలను మరోసారి గుర్తుచేసుకుందాం.

 నా క్రికెట్‌ కెరీర్‌లో ధోనీనే అత్యుత్తమ కెప్టెన్‌. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాటిని సహచరులతో పంచుకుంటూ మైదానంలో నిత్యం గొప్పగా కనిపిస్తాడు - సచిన్‌ తెందుల్కర్‌

 భారత క్రికెట్‌లో గొప్ప సారథి అంటే అది ధోనీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. అతను సాధించిన రికార్డులే  అందుకు నిలువెత్తు సాక్ష్యాలు - సౌరవ్‌ గంగూలీ

అత్యుత్తమ నాయకుడు అంటే దానికి గొప్ప ఉదాహరణ ధోనీనే. అతనెప్పటికీ ఆదర్శనీయమే. తన ఆటతో నాయకత్వానికే వన్నె తెచ్చాడు - రాహుల్‌ ద్రవిడ్‌

నేను చనిపోయే ముందు.. నా చివరి కోరిక ఏదైనా ఉంది అంటే 2011 ప్రపంచకప్‌లో ధోనీ బాదిన సిక్సర్‌ చూశాకే - సునీల్‌ గావస్కర్‌

ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొవడం ధోనీకున్న ప్రత్యేకత. ఆ సమయంలో ఎలాంటి ఉద్వేగానికి అవకాశం ఉండదు. అంతటి గొప్ప వ్యక్తి భారత క్రికెట్‌ కు సారథ్యం వహించడం గర్వకారణం - వీవీఎస్‌ లక్ష్మణ్‌

ధోనీనే నా హీరో.  మనం సచిన్‌, సెహ్వాగ్‌ ఆట గురించి ఎన్నో విషయాలు మాట్లాడాం. కానీ ధోనీ మాత్రం అంతకుమించి - కపిల్‌ దేవ్‌

క్రికెట్‌లో దిగ్గజాలను పోల్చాలనుకుంటే.. సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌, సచిన్‌ తెందుల్కర్‌, ఎంఎస్‌ ధోనీ అందరూ ఒకే వరుసలో కనిపిస్తారు - రవిశాస్త్రి

ఇప్పటికీ, ఎప్పటికీ ధోనీనే నా సారథి  - విరాట్‌ కోహ్లీ

గత 30 ఏళ్లలో నేను చూసిన సారథుల్లో ధోనీ అత్యుత్తమం. ఇమ్రాన్‌ ఖాన్‌, మార్క్‌ టేలర్‌, అర్జున్‌ రణతుంగ వంటి దిగ్గజాలకు  అతడు సరిజోడు - ఇయాన్‌ ఛాపెల్‌

ధోనీ చివరి దాకా ఆడితే కచ్చితంగా అతని జట్టు గెలుస్తుంది. ఆట పట్ల అతనికున్న అంకితభావం అలాంటిది - హర్ష భోగ్లే

ధోనీ నా పక్కన ఉంటే యుద్ధం చేయడానికైనా సిద్ధమే - గ్యారీ కిర్‌స్టన్‌

ధోనీ సారథ్యంలో ఆడటం నేను చేసుకున్న అదృష్టం - మైకేల్ హస్సీ

అతని ఆట చూడటానికి నేను అత్యంత శ్రద్ధ వహిస్తాను. గిల్‌క్రిస్ట్‌ తర్వాత ధోనీ కాదు. అతనికి అతడే ముందు - ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌

 

క్రీజులో ధోనీ ఉండి. విజయానికి 6 బంతుల్లో  15 పరుగులు అవసరం అనుకోండి. అప్పుడు ఒత్తిడి బౌలర్‌ పైనే. ధోనీపై  కాదు - ఇయాన్‌ బిషప్‌

ఒకవేళ నేనే జట్టును ఎంపిక చేస్తే  ఓపెనర్‌ సచిన్‌.. కెప్టెన్‌గా మాత్రం ధోనీనే - స్టీవ్‌ వా

- ఇంటర్నెట్‌డెస్క్‌  ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.