close

తాజా వార్తలు

ఎప్పుడూ నాన్నగారి పేరు వాడలేదు

మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను!

ఓ గాన గంధర్వుడి ఒడిలో పెరిగిన గౌరవం.. ఓ స్వర స్వర్గం నుంచి జారిన ముత్యం.. అందుకేనేమో చిన్నప్పుడే సప్త స్వరాలను  నరనరాల్లో నింపుకొన్నాడు. పాటల ప్రయాణంలో ముందున్నాడు ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌. గాయకుడిగా 2500లకు పైగా పాటలను ఆలపించిన ఆయన, నిర్మాతగానూ తనదైన ముద్రవేశారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

హాయ్‌ చరణ్‌ ఎలా ఉన్నారు?
ఎస్పీ చరణ్‌: చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా నిన్ను(ఆలీ) కలిసినందుకు. (వెంటనే ఆలీ అందుకుని.. బాలూగారికి పాటెంత ప్రాణమో.. పల్లవి.. చరణం కూడా అంతే ప్రాణం. పల్లవి అంటే ఆయన కూతురు. చరణం అంటే కొడుకు చరణ్‌.)

మీరు అమ్మకూచీనా.. లేక నాన్న కూచీనా.?
ఎస్పీ చరణ్‌: కచ్చితంగా అమ్మకూచి. నాన్న ఎప్పుడూ ఇంట్లో ఉండేవారు కాదు కదా! ఆ సమయంలో నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఆయన్ని నెలకు ఒకసారి చూసేవాళ్లం. 

మీరు బాల సుబ్రహ్మణ్యం కొడుకుగా పుట్టడం ప్లెజరా..? ప్రెజరా..?
ఎస్పీ చరణ్‌: నాన్నగారు కచేరీలకు వెళ్తే, ఆయన ప్రదర్శనను మొదటి వరుసలో కూర్చొని చూసే అదృష్టం కలుగుతుంది. ఒకవేళ నేను కూడా ఆయనతో పాడాల్సి వస్తే, బ్యాక్‌ స్టేజ్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో చాలా ప్లెజర్‌గా ఉంటుంది. ఆయన పాట పాడిన వెళ్లిన తర్వాత నేను పాడాల్సి వస్తే చాలా ప్రెజర్‌గా ఉంటుంది. నేను పాట పాడేసిన తర్వాత ‘నువ్వు అక్కడ అది మిస్‌ అయ్యావు.  కొంచెం సరిచేసుకోవాలి’ అంటూ నేను పాడిన పాటను కరెక్ట్‌ చేస్తుంటారు. అప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు ఏం చెబుతారా? అని భయపడుతుంటా. ఆయన చెప్పిన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటా. 

బాల సుబ్రహ్మణ్యం వారసత్వాన్ని మీరు ఎంత వరకూ ఉపయోగించుకున్నారు?
ఎస్పీ చరణ్‌: అస్సలు ఉపయోగించుకోలేదు. నేను పాటలు పాడినా, సినిమాల్లో నటించినా, ప్రొడ్యూసర్‌గా మారినా ఎక్కడా నా తండ్రి నేపథ్యాన్ని నేను వాడుకోలేదు. ఎప్పుడైనా కారు కాస్త స్పీడుగా వెళ్లినప్పుడు పోలీసులు ఆపి, లైసెన్స్‌ అడుగుతారు. దానిపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే పేరు చూసి, ‘మీరు బాలూగారి కొడుకా’ అని అడుగుతారు. ‘అవునంటే’ ‘వాళ్లకు అబ్బాయి ఉన్నాడా’ అని ఆశ్చర్యపోతుంటారు. అలా వాడుకొంటానే తప్ప నా వృత్తి పరంగా ఎప్పుడూ నాన్నగారి పేరు వాడలేదు.

మీరు కోరుకుంటే బాలుగారిని ఒప్పించి కొండమీది కోతిని సైతం మీ అమ్మ తెప్పిస్తారట నిజమేనా?
ఎస్పీ చరణ్‌: (నవ్వులు) అవును అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే, నేను అడగకుండానే నాన్న చాలా ఇచ్చారు. నా చిన్నప్పుడు నాకు సైకిల్‌ తొక్కడం రాని రోజుల్లోనే అమెరికా నుంచి సైకిల్‌ కొని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ విషయం మీకు(ఆలీ) కూడా తెలుసు. (మధ్యలో ఆలీ అందుకుని, ఒకరోజు వీళ్ల ఇంటికి వెళ్తే, అక్కడ సైకిల్‌ కనపడింది. దాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోయా. కొంత దూరం వెళ్లాక చూస్తే, బ్రేకులు లేవు. కిందపడి రెండు మోకాళ్లు కొట్టుకుపోయాయి. సైకిల్‌ ఆగాలంటే వెనక్కి తొక్కాలన్న విషయం నాకు తెలియదు) ఇప్పటికీ ఆ సైకిల్‌ నా దగ్గర ఉంది. కాకపోతే చక్రాలు లేవు. నేను ఆ సైకిల్‌ తొక్కిన దానికంటే ఆలీ వాడుకొన్నది ఎక్కువ.(నవ్వులు)

ఎన్ని భాషల్లో పాడారు?
ఎస్పీ చరణ్‌: తెలుగు, తమిళ్‌, కన్నడ. ఒక హిందీ పాట పాడాను. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు. మొత్తం 2500లకుపైగా పాడి ఉంటా. తమిళంలో ఇళయరాజాగారు సంగీతం అందించిన ‘పుణ్యవతి’ సినిమాకు మొదటిసారి పాడా. అందులోని ఓ డ్యూయెట్‌కు నాతో కోరస్‌ పాడించారు. ఇంకో విషయం ఏంటంటే, సింగర్‌ సునీతకు కూడా అదే మొదటి సినిమా. ఇక తెలుగులో మొదటిసారి స్క్రీన్‌పై నా పేరు చూసుకున్న సినిమా ‘మురారి’. అందులో ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక..’ పాట పాడా. 

మీరు బయటకు వెళ్లినప్పుడు ‘బాలుగారిలా పాడారండీ’ అని ఎవరైనా చెబుతారా?
ఎస్పీ చరణ్‌: చాలా మంది చెబుతారు. ఇది నాపై మరింత ఒత్తిడి పెంచుతుంది. చిన్నప్పటి బాలుగారి గొంతులా ఉందని చెబుతారు. తమిళ్‌లో సూర్య నటించిన ఓ సినిమాకు నేను పాడా. ఆ చిత్రం విడుదలై పెద్ద హిట్టయింది. అదే ఏడాది నాన్నకు ఓ టెలివిజన్‌ ఛానల్‌ వాళ్లు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఇచ్చారు. ఆ ఫంక్షన్‌లో నాన్నగారు పాడిన పాట అనుకుని నా పాట వేశారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు చూశా. అంటే నేను పాడితే, ఆయన పాడినట్లు ఉందని చెప్పడం నిజంగా నాకు గొప్ప విషయం. ఆయన పాడిన దానిలో 40శాతం పాడినా గొప్ప అచీవ్‌మెంట్‌గా భావిస్తా.

ప్రతి తండ్రి నా కొడుకు ఇలా అవ్వాలి అనుకుంటారు? మీ విషయంలో ఏమనుకున్నారు?
ఎస్పీ చరణ్‌: నిజంగా నాకు తెలియదు. ఈ విషయాలను ఎప్పుడూ అమ్మానాన్నలు చెప్పలేదు. నేను సింగర్‌ను కావడం కూడా యాదృచ్ఛికంగా జరిగింది. నేను అమెరికాలో బీబీఏ మార్కెటింగ్‌ చదువుకున్నా. ఆ తర్వాత ఓ యాడ్‌ ఏజెన్సీ పెట్టుకుని క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉండిపోదామనుకున్నా. ఆరోజు డ్రైవర్‌ లేకపోవడంతో నాన్నగారిని తీసుకుని నేను స్టూడియోకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ఇళయరాజాగారు కంపోజ్‌ చేస్తున్నారు. అంతకుముందు ఆయనను పెద్దగా కలిసింది లేదు. దీంతో నేను వెళ్లగానే ‘ఎవరు నువ్వు’ అన్నారు. ‘నేను బాలూగారి అబ్బాయిని’ అంటే ‘నువ్వు అమెరికాలో ఉన్నావు కదా. వచ్చేశావా’ అని అడిగారు. ‘అవును’ అని చెప్పా. ‘పాడతావా’ అని అడిగారు. ‘నా వల్ల కాదని చెప్పా’ ‘ఒక నిమిషం ఉండు’ అని చెప్పి, పాటలోని కొన్ని లైన్లు తీసి నాతో పాడించారు. అలా నేను సింగర్‌ అయ్యా. 

స్కూల్‌కు వెళ్లే రోజుల్లో ఇంట్లో వాళ్లందరూ కలిసి మిమ్మల్ని అమెరికా తరిమేశారట!
ఎస్పీ చరణ్‌: (నవ్వులు) నిజంగా తరిమేశారనే చెప్పాలి. మద్రాసులోని అన్ని స్కూళ్లలో చదివేశా. నేను సరిగా చదవడం లేదని ఏ స్కూల్లోనూ చేర్చుకునేవారు కాదు. అయితే అలా అని అల్లరి చేసేవాడిని కూడా కాదు. కేవలం చదువు ఎక్కేది కాదంతే. నాన్నగారికి అమెరికాలో తెలిసిన వాళ్లు ఉంటే అక్కడికి పంపితే తాము చూసుకుంటామని చెప్పారు. దీంతో అమెరికాలో చదువుకున్నా.

చిన్నప్పుడు కిటికీ వెనకాల దాక్కొని ఎక్కడికో పారిపోయినట్లు సీన్‌ క్రియేట్‌ చేశారట!
ఎస్పీ చరణ్‌: ఈ విషయం మీకెలా తెలుసు. (ఆలీ అందుకుని.. నా చైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్‌ బాలూ చెప్పారు. నవ్వులు) ఈ విషయం నాన్నగారికి కూడా తెలియదు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకూ గుర్తు లేదు. అమ్మ మీద కోపంతో ‘ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నా’ అని అంటే ‘ఎక్కడికి పోతావో పో’అని అన్నది. దాంతో ఆమెకు కనిపించకుండా మెట్ల కిందకు వెళ్లి దాక్కొన్నా. సాయంత్రం నుంచి వెతకడం మొదలు పెట్టారు. అమ్మ అయితే ఏడుస్తూ కూర్చొంది. నెమ్మదిగా బయటకు వచ్చా. సినిమాల్లో చూపించినట్లు ‘బాబూ చిట్టీ.. ఎక్కడికి వెళ్లిపోయావురా’ అని గట్టిగా కౌగలించుకొంటుందనుకున్నా. దొరకగానే లాగి లెంపకాయ కొట్టింది. 

చిన్నప్పుడు లెటర్‌ రాసి,దానిలో రూపాయి కాయిన్‌ పెట్టి ఇంట్లోకి విసిరేసేవారట!
ఎస్పీ చరణ్‌: నేను సరిగా చదవడం లేదని మా అమ్మకు బెంగ. నన్ను కొట్టిన తర్వాత కొట్టినందుకు ఏడ్చేది. స్కూల్‌ డైరీలో అన్నీ రాసేవారు. దానిలో అమ్మ సంతకం పెట్టాలి. దాన్ని కూడా ఫోర్జరీ చేయడం మొదలు పెట్టా. మార్కులు తక్కువ వచ్చినా, ఇంత ఉదాసీనంగా ఎలా ఉంటారా? అని టీచర్లకు అనుమానం వచ్చింది. ఒకరోజు పిలిపించి విషయం చెప్పారు.  అప్పటి నుంచి నాకు చదువు సరిగా రావడం లేదని అమ్మ బాధపడుతుండేది. చదువు మానేద్దామనుకున్నా. అదే పేపర్‌లో రాసి, అందులో రూపాయి కాయిన్‌ పెట్టి బయట నుంచి అమ్మకు విసిరేశా. ఆ దెబ్బతో బడి మాన్పిస్తారనుకున్నా. అలా జరగలేదు. 

మిమ్మల్ని చూస్తే తాత కూడా అయినట్లు కనిపిస్తున్నారు. 
ఎస్పీ చరణ్‌: నాన్నగారికి 73ఏళ్లు. ఇప్పటికీ ఆయనకు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. ఆయన వయసు గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను తలకు రంగు వేసుకోకుండా, ఇలా తెల్ల గడ్డం పెట్టుకుని ఉంటున్నా (నవ్వులు)

మీరు-అజిత్‌ క్లాస్‌మేట్సా?
ఎస్పీ చరణ్‌: నన్ను ఏ స్కూల్లో చేర్చుకోకపోవడంతో ఆంధ్రా మెట్రిక్యులేషన్‌ రాయమని చెప్పి మూర్తి ట్యుటోరియల్స్‌లో చేర్చారు. అందులో అజిత్‌ కూడా చేరారు. ఆయనతో పాటు శివ అనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా ఉన్నాడు. మేం ముగ్గురం బెంచ్‌ మేట్స్‌. ఇప్పుడు అజిత్‌ పెద్దస్టార్‌. కలిసినప్పుడు మాత్రం బాగా మాట్లాడతాడు. ఇంటికి వస్తే బిర్యానీ చేసి పెడతానని చెబుతాడు. 

1979లో ఒకరోజు రాత్రి పూట ఏదో గ్లాస్‌ పగలగొట్టారట!
ఎస్పీ చరణ్‌: అప్పట్లో నాన్న సింగపూర్‌ వెళ్లి వచ్చారు. వస్తూ అందరికీ చాలా గిఫ్ట్‌లు తెచ్చారు. వాటిల్లో ఒక బాక్సులో గ్లాసులు ఉన్నాయి. ‘ఇవేంటి నాన్నా’ అని అడిగితే, ‘ఇవి నేలకేసి కొట్టినా పగలవు’ అని ఒక గ్లాస్‌ తీసి గోడకేసి కొట్టారు. అంతే అది ముక్కలు ముక్కలైంది. ఆ గాజు పెంకులు ఏరుతుంటే చేయి కూడా తెగింది. ఇప్పటికీ ఇంట్లో వాటిల్లో మూడు గ్లాస్‌లు ఇంకా ఉన్నాయి. 

తెలుగులో హిట్టయిన ‘వర్షం’ సినిమాను తమిళంలో తీసి ఎన్నికోట్లు పోగొట్టుకున్నారు?
ఎస్పీ చరణ్‌: బాగానే పోయాయి. క్లైమాక్స్‌ సమయానికి బిజినెస్‌ అయిపోయింది. అడ్వాన్సులతోనే పెట్టిన డబ్బులు వచ్చేశాయి. అడ్వాన్స్‌లే ఈ స్థాయిలో వచ్చాయంటే సినిమా విడుదలయ్యాక ఇంకా బాగా వస్తాయని చెప్పి, తెలుగులో పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కొందరు వద్దని వారించారు కూడా. అయినా వినలేదు. దీంతో నేనే ఏదైతే అదనంగా పెట్టానో అదంతా పోయింది. 

మీరు పోగొట్టిన డబ్బులు మీవా..? మీ నాన్నగారివా?
ఎస్పీ చరణ్‌: మొదటి సినిమా డబ్బు నాన్నగారిదే. రెండో సినిమా బిజినెస్‌ అయింది. పెట్టుబడి పెట్టిన వాళ్లకు మాత్రం బాగా రాలేదు. ఆ మొత్తాన్ని చెల్లించడానికి నాన్నగారి దగ్గరి నుంచి మళ్లీ తీసుకున్నా. మూడో సినిమా పర్వాలేదు. పెట్టిన పెట్టుబడి వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో మూడు సినిమాలు మొదలు పెట్టా. అన్నీ తమిళంలోనే చేశా. అవీ పోయాయి. అలా ఒక్కొక్కటి ఫ్లాప్‌ అవుతూ రావడంతో నష్టం పెద్దదైపోయింది. పేరు మిగిలిందే తప్ప. డబ్బులు రాలేదు. ‘అరణ్యకాండ’కు జాతీయ అవార్డు వచ్చింది. నాన్నగారి డబ్బు పోగొట్టానని ఇప్పటికీ బాధపడుతుంటా. అయితే, ఆయన మాత్రం ‘ఇలాంటి చెత్త సినిమా తీసి ఎందుకు డబ్బులు పోగొడతావ్‌’ అని మాత్రం అనలేదు. ‘మంచి సినిమా తీశావ్‌. అది జనానికి చేరలేదు’ అన్న పేరు మాత్రం కాపాడుకున్నా. ఆయనకు సారీ చెప్పాలి. 

(మధ్యలో బాల సుబ్రహ్మణ్యం ప్రత్యేకంగా మాట్లాడుతూ.. చరణ్‌ చిన్నప్పుడు నాలుగేళ్ల వరకూ అసలు మాట్లాడేవాడు కాదు. గాయకుడి కొడుకు గాయకుడు కావాల్సిన అవసరం లేదు కానీ, కనీసం మాట్లాడాలి కదా. డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే, ‘తప్పకుండా మాట్లాడతాడండీ’ అన్నారు. అలా చెప్పిన ఆర్నెల్లకు ‘అమ్మా.. నాన్న..’ అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు. చిన్నప్పుడు పాటలు పాడమంటే పాడేవాడు కాదు. చాలా సిగ్గు పడేవాడు. తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని చిన్న అసంతృప్తి ఉంది. నేను ఎప్పుడూ సర్ది చెబుతూనే ఉంటాను. చరణ్‌ను ఎవరికీ రికమెండ్‌ చేయలేదని మా ఆవిడకు కోపం. నేను ఎప్పుడూ ఎవరికీ చరణ్‌ మా అబ్బాయి అవకాశాలు ఇవ్వండని చెప్పలేదు. చరణ్‌కు కూడా ఇదే విషయాన్ని చెప్పా. ‘నువ్వు ఆడిషన్‌కు వెళ్లి లైన్‌లో 11వ వాడిగా నిలబడితే, బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి కాబట్టి మొదట నిన్ను పిలిచి ఆడిషన్‌ చేస్తారు. అయితే, అందులో అవకాశాన్ని అందిపుచ్చుకోవడం నీ చేతుల్లో ఉంది’ అని చెబుతా. ఇప్పటివరకూ తను పాడిన పాటల అవకాశాలన్నీ తన సొంతంగా తెచ్చుకున్నవే. చరణ్‌ నువ్వేమీ కోల్పోలేదు. నువ్వేంటో నీకు తెలుసు. నాకు తెలుసు. నువ్వు ఇంకా బాగా ఎదగాలి. ఐ లవ్‌వ్యూ నాన్న. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ముందుకు వెళ్తున్నావు. ఎప్పటికీ ఆ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు.ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న. మీ నాన్నలో నీకు నచ్చనిది ఏమిటి?) 

ఎస్పీ చరణ్‌: నాకు నాన్నే పెద్ద బలం. ఆయన ముందు నాకు చాలా మొహమాటం. ఆయనలో నచ్చనిది ఏంటంటే.. ఏమీ లేదు. కానీ, చెప్పాలంటే ఒక విషయం ఉంది. ఆయన పర్‌ఫెక్షన్‌ నాకు కాస్త చికాకు పెడుతుంది. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం అన్ని సందర్భాల్లో కుదరదు. ఎందుకంటే నేను పర్‌ఫెక్ట్‌ కావచ్చు. కానీ, పక్కన వాళ్ల కూడా అలాగే ఉండాలని ఆశించకూడదు. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన ఎంతో ఓపికగా ఉంటారు. అలా ఎలా ఉండగలుగుతారో అర్థం కాదు. ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు సారీ చెప్పాలనుకుంటున్నా. ఒక కొడుకంటే ఇలా అన్న దానికి నేను సరిపోను. చాలా అల్లరి పెట్టాను. చాలా ఇబ్బందులు కలిగించాను. అన్నింటికీ నేను చెప్పే సారీ సరిపోదు. మీరు లేకుంటే నేను లేను. రోజూ నన్ను నేను మెరుగుపరుచుకుంటా. ఏదో ఒకరోజు మీకన్నా కొంచెమైనా ఎక్కువ సాధించాలని ఉంది. తప్పకుండా సాధిస్తానని అనుకుంటున్నా.

దీన్ని బాలు గారు తప్ప ఎవరూ పాడలేరని మీకు అనిపించిన పాట ఏది?
ఎస్పీ చరణ్‌: చాలా ఉన్నాయి. ‘శంకరాభరణం’లో ‘దొరకునా ఇటువంటి సేవ’ ఎవరూ పాడలేరు. పొగరుగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. అలా పాడటానికి ఎవరూ పుట్టరు కూడా. నేపథ్య గానం అనేది నాన్నగారితో అయిపోయింది. 

ఎస్పీ శైలజతో మీ అనుబంధం ఎలా ఉంటుంది?
ఎస్పీ చరణ్‌: నాకు ఏ సమస్యలున్నా అమ్మ తర్వాత నేను వెళ్లేది, చెప్పేది శైలు అత్తకే. అమ్మకు చెప్పలేని విషయాలను కూడా ఆమెకు చెబుతా. అమ్మలేనప్పుడు ఆమె నాకు అమ్మ. వేదికపై ఆమెతో పాడటానికి చాలా హాయిగా ఉంటుంది.

అమెరికాలో ఎంతమంది గార్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు?
ఎస్పీ చరణ్‌: ఎవరు? ఏయ్‌..! అలాంటివి ఏవీ లేవు. 

భవిష్యత్‌లో చరణ్‌ను ఎలా చూడవచ్చు?
ఎస్పీ చరణ్‌: ఇలా ఉంటే పర్వాలేదా! మీరు చెబితే ఆ స్థాయికి కృషి చేస్తా(నవ్వులు)

మీరు మొదట పాడిన తెలుగు పాట గుర్తుందా?
ఎస్పీ చరణ్‌: కాదంబరి కిరణ్‌ దర్శకత్వం వహించిన ‘కుర్రాళ్ల రాజ్యం’లో పాడా. అందులో నువ్వు (ఆలీ) నటించావు. అదే నా మొదటి పాట. కీరవాణిగారు నాతో చాలా ప్రయోగాలు చేశారు. దేవిశ్రీ, మణిశర్మ ఇలా చాలామంది నాకు మెలోడి సాంగ్స్‌ ఇచ్చారు. కీరవాణిగారు మెలోడితో పాటు ‘సింహాద్రి’లో ‘చీమ.. చీమ..’ లాంటి ఫాస్ట్‌ బీట్‌లు కూడా ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులందరికీ ధన్యవాదాలు.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నాకన్నా వయసులో కాస్త పెద్దవాడివైనా ఇద్దరం(ఆలీ-చరణ్‌) ఫ్రెండ్స్‌ అయ్యాం. మా ఇంటిలో ఒకడిగా ఉన్న నువ్వు ఇంత స్థాయికి రావడం నిజంగా ఆనందంగా ఉంది. ఈ ఇండస్ట్రీలో ఆలీ ఎంత మంచివాడో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, నాకు తెలుసు. ఒక సినిమాకు డేట్స్‌ అడిగితే, వేరే సినిమాకు క్యాన్సిల్‌ చేసి నాకు ఇచ్చావ్‌. నిజంగా నీ సాయం మర్చిపోలేను. 


 

మరికొన్ని ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం
ధైర్యం: నాన్న
వీక్‌నెస్‌: అమ్మ
బలం: ఫ్యామిలీ
నమ్మకం: సెల్ఫ్‌
భయం: సెల్ఫ్‌
సిగ్గు: కొంత వరకూ ఉంది
నిజాయతీ: సినిమా
కోపం: సినిమా
ఎస్పీబీ: వన్‌ అండ్‌ ఓన్లీ
వివాదాలు: నేనే
బెస్ట్‌ఫ్రెండ్‌: అక్క
చదువు:లేదుగా!
వర్షం: మొదటి సినిమా
చెన్నై:ఇల్లు
హైదరాబాద్‌: నేను టూరిస్ట్‌ని ఇక్కడ 
నెల్లూరు: తాత ఊరు
ఆలీ: గర్వం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.