close

తాజా వార్తలు

ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న ఆటగాళ్లు

ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఎవరికో?

ఐసీసీ 12వ వన్డే ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. 44 రోజుల పాటు అలరించిన సమరం ఆదివారంతో ముగియనుంది. ఆది నుంచి అనుకుంటున్న ఫేవరెట్‌ జట్టు ఇంగ్లాండ్‌ ఫైనల్‌ చేరింది. కివీస్‌తో ఆదివారం ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో తుదిపోరులో తలపడనుంది. కాగా ఇప్పటివరకు ప్రపంచకప్‌ అందుకోని రెండు జట్లలో ఏదో ఒకటి విశ్వవిజేతగా నిలవనుంది. మరోవైపు ఈ టోర్నీలో ప్రధానంగా ఆకట్టుకున్న ఆటగాళ్లు ఉండగా రికార్డు స్థాయిలో ప్రదర్శన చేసిన వాళ్లు కొందరున్నారు. ఈ నేపథ్యంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ ఎవరికి వచ్చే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం...

డేవిడ్‌వార్నర్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు నిషేధానికి గురై నేరుగా ప్రపంచకప్‌లో ఆడాడు. టోర్నీ ఆసాంతం తన బ్యాటింగ్‌తో అలరించిన వార్నర్‌ కీలక నాకౌట్‌లో చేతులేత్తేశాడు. మొత్తం 10 మ్యాచ్‌ల్లో 71.89 సగటుతో అత్యధిక పరుగులు (647) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

కేన్‌విలియమ్సన్‌: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ జట్టు రెండోసారి ఫైనల్స్‌ చేరిందంటే అందుకు ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌విలియమ్సన్‌. ఒక్క మ్యాచ్‌లోనూ ఓపెనర్లు శుభారంభం చేయకపోయినా బ్యాటింగ్‌ బాధ్యతను ఒంటి చేత్తో మోసుకొచ్చాడు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన అతను అత్యధిక సగటు 91.33 సాధించి 548 పరుగులు చేశాడు. 

రోహిత్‌శర్మ: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ప్రస్తుత ప్రపంచకప్‌లో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగాడు. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో 5 శతకాలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలినాకౌట్‌లో మరో 26 పరుగులు చేసుంటే 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు(673)ను అధిగమించేవాడు.

మిచెల్‌స్టార్క్‌: ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌ వరకూ వచ్చిందంటే ముఖ్యకారణం మిచెల్‌స్టార్క్‌. పదునైన యార్కర్లలో ప్రత్యర్థుల పనిపట్టి ఈ టోర్నీలో మొత్తం 27 వికెట్లు తీశాడు. దీంతో ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు గ్లెన్‌మెక్‌గ్రాత్‌ 2007లో 26 వికెట్లు తీశాడు. దీంతో అతడి పేరిట ఉన్న రికార్డును మిచెల్‌ అధిగమించాడు. ఈ టోర్నీలో రెండుసార్లు 5 వికెట్లు, రెండుసార్లు 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. 

షకిబ్‌అల్‌హసన్‌: ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పోరాట పటిమ చాలా బాగుంది. లీగ్‌దశలోనే ఆ జట్టు నిష్క్రమించినా ఆల్‌రౌండర్‌ షకిబ్‌అల్‌ హసన్‌ ఆట అమోఘం. ప్రపంచకప్‌ చరిత్రలోనే అదిరిపోయే ప్రదర్శన చేశాడు షకిబ్. ఆడిన 8 మ్యాచ్‌ల్లోనే 86.57 సగటుతో 606 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. బంగ్లా గెలుపొందిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

జోరూట్‌: ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా జోరూట్‌(549) నిలిచాడు. పది మ్యాచ్‌ల్లో 92 స్ట్రైక్‌రేట్‌తో రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు సాధించి జట్టుని ముందుండి నడిపించాడు. ఇక ఆదివారం కివీస్‌తో జరగబోయే ఫైనల్స్‌లో శతకం సాధిస్తే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌శర్మ(648)ను అధిగమించే అవకాశం ఉంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.