close

తాజా వార్తలు

కొన్ని గంటల్లో కొత్త ఛాంపియన్‌ 

పతాక స్థాయికి సమరం!

మెగా టోర్నీ ముగింపు దశకు చేరుకుంది. నెల రోజులకు పైగా సందడి చేసిన క్రికెట్‌ మహా సంగ్రామం ఈ రోజుతో ముగియనుంది. అందరూ అనుకున్నట్లు అసలు పోరు ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య కాకుండా అంచనాలు తప్పి ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ రూపంలో కొత్త ఛాంపియన్‌ను చూసే అవకాశం దక్కింది. మరి కొన్ని గంటల్లో మొదలుకానున్న ఈ ఫైనల్‌ పోరులో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

విజయాల విలియమ్సన్‌..

ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ సారథి ఎవరూ అంటే అందరికంటే ముందు వరుసలో విలియమ్సన్‌ నిలుస్తాడనటంలో అతిశయోక్తి లేదు. న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరిందంటే అతనే కారణం. ఆశల్లేని స్థితి నుంచి అనూహ్యంగా ఫైనల్‌ దాకా జట్టును ముందుండి నడిపించాడు. ఓపెనర్ల వైఫల్యంతో బ్యాటింగ్‌ భారాన్నంతా మోస్తూ మిడిలార్డర్‌లో టేలర్‌, నీషమ్‌ అండతోనే గొప్ప పోరాటమే చేశాడు. టోర్నీలో టాప్‌ బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక సగటు కేన్‌దే కావడం విశేషం. అతను 9 మ్యాచ్‌ల్లో 91.33 సగటుతో 548 పరుగులు సాధించాడు. బౌలర్‌గానూ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లోనూ సారథి మరో స్ఫూర్తిదాయకమైన పోరాటం చేస్తే తొలిసారి కివీస్‌ ఖాతాలో టైటిల్‌ వచ్చి పడినట్లే.

టాలెంటేడ్‌ టేలర్..

న్యూజిలాండ్‌కు బ్యాటింగ్‌ లైనప్‌లో అదనపు బలం రాస్‌ టేలర్‌. ఈ టోర్నీలో విలియమ్సన్‌ తర్వాత కివీస్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌ అతనే‌. 9 మ్యాచ్‌ల్లో 335 పరుగులు చేసిన టేలర్‌ చాలా మ్యాచ్‌ల్లో సారథితో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. లీగ్‌ దశలో బంగ్లాదేశ్‌పై 82 పరుగులు, వెస్టిండీస్‌పై 69 పరుగులు.. సెమీస్‌లో భారత్‌పై 74 పరుగులతో కివీస్‌ బ్యాటింగ్‌లో మరో కీలక ఆటగాడిగా నిలిచాడు. ఫీల్డర్‌గానూ టేలర్‌ జట్టుకు విలువైన ఆటగాడే. 

బౌల్డ్‌ చేసే బౌల్ట్‌..

కివీస్‌ బౌలింగ్‌ ఆయుధం ట్రెంట్‌ బౌల్ట్‌. వెస్టిండీస్‌(4/30), ఆస్ట్రేలియా(4/51)పై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సెమీస్‌లోనూ కీలక విరాట్‌ కోహ్లీను వికెట్ల ముందు దొరికించుకున్న బౌల్ట్‌.. భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్న జడేజాను కూడా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. టోర్నీలో 9 మ్యాచ్‌లాడి 17 వికెట్లు తీశాడు. ఫైనల్లోనూ ఇంగ్లాండ్‌ దూకుడుకు కళ్లెం వేస్తే కివీస్‌కు తిరుగులేనట్లే. ఫెర్గూసన్.. టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 9 మ్యాచ్‌లాడి 18 వికెట్లు పడగొట్టాడు. అఫ్గానిస్థాన్‌(4/37), శ్రీలంక(3/22)పై అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. ఇతనితో పాటు హెన్రీ కూడా కివీస్‌ బౌలింగ్‌ లైనప్‌లో కీలక బౌలరే. 8 మ్యాచ్‌లాడి 13 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌(4/47), భారత్‌(3/37), శ్రీలంక(3/29)పై చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 

ఆల్‌రౌండర్‌ నీషమ్ కివీస్‌కు కీలక ఆటగాడే. పాక్‌తో మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో గొప్ప పోరాటం చేసి 97 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మొత్తంగా ఇప్పటివరకూ 213 పరుగులు సాధించాడు. బౌలర్‌గానూ 12 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. మరో ఆల్‌రౌండర్‌ గ్రాండ్‌హోమ్‌ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శనతో రాణిస్తున్నాడు. అయితే జట్టుకు ఓపెనర్ల నుంచి ఇప్పటివరకూ ఒక్క మెరుపు ఆరంభం దక్కలేదు. లీగ్‌ ఆరంభంలో శ్రీలంకతో మ్యాచ్‌లో మినహా ఓపెనర్లు మిగతా ఏ మ్యాచ్‌లోనూ బ్యాట్‌ ఝళిపించే ప్రయత్నం కూడా చేయలేదు. ఫైనల్‌ మ్యాచ్‌లోనైనా వీరు మంచి ఆరంభం ఇస్తే కివీస్‌కు తిరుగుండదు. 

రాత మార్చిన రాయ్‌..

జట్టు నిండా మ్యాచ్‌ విన్నర్లు ఉండటంతో మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ టైటిల్‌ ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది. కివీస్‌తో పోలిస్తే ఓపెనింగ్‌ విషయంలో ఇంగ్లాండ్‌ జట్టు పటిష్ఠంగా ఉంది. బెయిర్‌స్టో, జేసన్‌ రాయ్‌ మెరుపు ఆరంభాలతో అదరగొట్టారు. ముఖ్యంగా జేసన్‌ రాయ్‌ ఆడిన 7 మ్యాచ్‌ల్లోనే 426 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. లీగ్‌ దశలో గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమవడంతో ఇంగ్లాండ్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. మళ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చెలరేగి ఆడి ఇంగ్లాండ్‌ను సెమీస్‌కు చేర్చాడు. సెమీస్‌లో ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి 85 పరుగులతో రెచ్చిపోయాడు. అంపైర్‌ తప్పిదం కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది కానీ లేకుంటే మరో శతకం నమోదు చేసేవాడేమో. ఫైనల్లోనూ రాయ్‌ రెచ్చిపోతే క్రికెట్‌ పుట్టింటికి కప్పు వచ్చినట్లే. మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో కూడా కీలక ఆటగాడే. 10 మ్యాచ్‌లాడి 496 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించే ఇతను కుదురుకున్నాక భారీ షాట్లతో రెచ్చిపోతుంటాడు. ఫీల్డర్‌గానూ విలువైన ఆటగాడే. 

మిడిలార్డర్‌ ‘రూట్’‌ 

ఇంగ్లాండ్‌ విజయాల్లో రూట్‌ పాత్ర ఎంతో ప్రత్యేకం. మూడో స్థానంలో బరిలోకి దిగే ఇతను 10 మ్యాచ్‌లాడి 549 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలున్నాయి. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే బ్యాటింగ్ భారాన్ని తన భుజాన వేసుకొని బాధ్యతగా ఇన్నింగ్‌ నడిపిస్తాడు. బంతితో మాయ చేస్తాడు, ఫీల్డర్‌గానూ మెరిసే రూట్‌ ఫైనల్‌లోనూ అదే జోరు సాగిస్తే ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. కెప్టెన్‌ మోర్గాన్‌, వికెట్‌ కీపర్‌ బట్లర్‌ కూడా విధ్వంసకర ఆటగాళ్లే. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నారంటే ప్రత్యర్థికి చుక్కలే. ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ కూడా ఇంగ్లాండ్‌ విజయాల్లో కీలక భాగస్వామే. ఆస్ట్రేలియాపై 89 పరుగులు, శ్రీలంకపై 82, దక్షిణాఫ్రికాపై 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అదరగొడుతున్న ‘ఆర్చర్’‌..

బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ ప్రధాన ఆయుధం జోఫ్రా ఆర్చర్‌. 10 మ్యాచ్‌లాడి 19 వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో దిట్ట. చక్కటి వేగంతో వైవిధ్యమైన బంతులు విసురుతూ మెయిడిన్‌ ఓవర్ల వేయడంలో నేర్పరి. మార్క్‌ వుడ్‌(17 వికెట్లు) క్రిస్‌ వోక్స్‌(13 వికెట్లు), స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌(11 వికెట్లు) మరోసారి బంతితో మాయ చేస్తే ఇంగ్లాండ్‌కు తిరుగులేనట్లే. 

 ఈ ప్రపంచకప్‌ లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 
ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో 5సార్లు న్యూజిలాండ్‌ గెలవగా, 4 సార్లు ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. 
1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి. 
గత ప్రపంచకప్‌లో(2015) న్యూజిలాండ్‌ రన్నరప్‌గా నిలిచింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.