
తాజా వార్తలు
కుల్‌భూషణ్ కేసులో అనుమానాస్పద వాదనలు
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: అంతర్జాతీయ వేదికపై పాక్ మరోసారి పరువు పోగొట్టుకొంది. పాక్ సైనిక న్యాయవ్యవస్థకు ఈ తీర్పు ఒక చెంపపెట్టులాంటింది. కుల్‌భూషణ్ విషయంలో పాక్ వాదనలు చాలా విచిత్రంగా లాజిక్ లేకుండా ఉన్నాయి. పాక్ రహస్య విచారణలు చేపట్టి కుల్‌భూషణ్‌పై అభియోగాలు రుజువయ్యాయని గొంతు చించుకొన్నా ప్రపంచదేశాలు నమ్మే పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో పాక్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో ఆ దేశ పరువు నేల మట్టం అవుతోంది.
కుల్‌భూషణ్ కేసులో..
కుల్‌భూషణ్ జాదవ్ ‘రా’ సంస్థకు గూఢచారి అని పాక్ ఆరోపిస్తోంది. ఆయన్ను పాక్‌లోని బలూచిస్థాన్‌లో సైనికులు అరెస్టు చేశారని పేర్కొంటోంది. బలూచిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాడని ఆరోపించింది. కుల్‌భూషణ్ వద్ద L9630722 నెంబర్‌తో హుస్సేని ముబారక్ పటేల్ పేరుతో మహారాష్ట్ర చిరునామాతో ఉన్న పాస్ పోర్టు కూడా ఉందని ప్రకటించింది.
ఇక్కడే పాక్ లాజిక్ మిస్ అయ్యింది. కుల్‌భూషణ్ నిజంగా రా ఏజెంట్ లేదా రా ఆఫీసర్ అయితే తెలివి తక్కువగా భారత్ చిరునామాతో ఉన్న పాస్‌పోర్టును పెట్టుకొని పాక్‌లోని బలూచిస్థాన్‌కు వెళతాడా..?అనేది పాక్ అధికారులే ఆలోచించుకోవాలి. అసలు గూఢచారులు స్వదేశానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలూ ఉంచుకోరన్న విషయం పాక్ తెలీదా?
ఉగ్రవాదానికి, అక్రమాయుధాలకు స్వర్గధామమైన ఆ దేశంలో పాక్ దొంగ పాస్‌పార్టు పుట్టించుకోవడం మరింత సులువు. అక్కడి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న వ్యక్తే అయితే పాక్ పాస్‌పోర్టు పుట్టించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఆయన ఆ పని చేయలేదు కదా..?
బలూచిస్థాన్ భౌగోళికంగా పాక్, ఇరాన్ మధ్య విస్తరించి ఉండే ఎడారి వంటి ప్రాంతం. దీనిలో కొంత భాగం పాక్‌లో ఉంటే మరికొంత భాగం ఇరాన్లో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య స్వేచ్ఛగా రాకపోకలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు కుల్‌భూషణ్ భారత పాస్‌పోర్టు పెట్టుకొని పాక్‌లోకి వెళ్లడం దేనికి? తాను కలవాలనుకుంటున్న వారిని ఇరాన్‌కే పిలిపించవచ్చు కదా? వాస్తవానికి ఇరాన్ సరిహద్దుల్లో ఐఎస్ఏకు తోక వంటి జైషే ఆదిల్ అనే ఉగ్రసంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థగానీ, తాలిబన్లుగానీ ఇరాన్‌లోని చాబహార్లో కుల్‌భూషణ్‌ను కిడ్నాప్ చేసి పాక్ సైన్యానికి అప్పగించి డబ్బు చేసుకున్నారని భారత నిఘా సంస్థలు నమ్ముతున్నాయి. పాక్‌లో పనిచేసే జర్మనీ దౌత్యవేత్త గుంటర్ ములాక్ ఈ విషయాన్ని పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో మాట్లాడుతూ చెప్పారు. కుల్‌భూషణ్‌ను అడ్డం పెట్టుకొని పాక్ కొత్త నాటకాలకు తెరతీసింది. ఆ తర్వాత కుల్‌భూషణ్ వాంగ్మూలం వీడియోను విడుదల చేసింది. ఇది కూడా పూర్తిగా అతుకుల బొంతలానే ఉంది. చేతికి దొరికిన శత్రుదేశాల వ్యక్తి చేత సైనిక దళాలు తమదైన పద్ధతిలో చేయని పాపాన్ని కూడా ఒప్పించగలవు. ఈ విషయంలో పాక్ దళాలు నాలుగాకులు ఎక్కవే చదివాయి. భారత్ వాయుసేన పైలట్ వింగ్ కమాండర్ అభినందన్‌కు ఒక టీకప్పు చేతిలో ఉంచి.. ‘నన్ను బాగా చూసుకున్నారు’ అన్నట్టు ప్రకటన ఇప్పించడం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. కానీ, భారత్ వచ్చిన తర్వాత అభినందన్ మాట్లాడుతూ.. తనని మానసికంగా తీవ్రంగా హింసించారని పేర్కొన్నాడు. ఇదీ పాక్‌లో జరిగే తీరు.
అంతర్జాతీయంగా భారత్‌ను దెబ్బతీయడానికి..
అంతర్జాతీయంగా భారత్‌ను దెబ్బతీయడానికి కుల్‌భూషణ్‌ను పాక్ ఒక ఆయుధంగా వాడుకొంటోంది. అతడు నిజంగా నిఘా సంస్థకు చెందిన ఏజెంట్ లేదా అధికారి అయితే అతడిని ఉరితీయాలని పాక్ అనుకోదు. గతంలో బ్లాక్ టైగర్ పేరున్న రవీంద్ర కౌసిక్‌ను కూడా పాక్ మరణించేవరకు జైల్లోనే ఉంచింది. అంతేగానీ ఉరితీయలేదు. శత్రు దేశ గూఢచారిని చంపడం కంటే సజీవంగా ఉంచడమే ఏ దేశానికైనా కొంత ప్రయోజనకరం. ఇక్కడ ఐఎస్ఐ వంటి గూఢచర్య సంస్థను నిర్వహించే పాక్‌కు ఈ విషయం తెలియనిదికాదు.
ఇక కుల్‌భూషణ్ విషయానికొస్తే ఆయన 1987లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా నావికాదళంలో చేరారు. ఆయన 2001లో పదవీ విరమణ చేశారు. పాక్ మాత్రం 2016లో పట్టుబడే వరకు ఆయన సర్వీసులో ఉన్నారని వాదిస్తోంది. పోనీ పాక్ చెప్పిందే నిజం అనుకుంటే.. దాదాపు 30ఏళ్ల సర్వీసు ఉన్న కుల్‌భూషణ్ ఈ పాటికే పెద్ద ర్యాంక్‌లో విధులు నిర్వహిస్తుండాలి. అటువంటి వ్యక్తికి దౌత్యపరమైన రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండానే భారత్ పాక్‌లోకి పంపించే అవకాశమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా దౌత్యకార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేసే వారిపైనే ఎక్కువ గూఢచర్యం ఆరోపణలు వస్తుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. వీరు పట్టుబడ్డా దౌత్యపరమైన రక్షణ ఉండటంతో స్వదేశానికి తిరిగి పంపించేస్తారు. ప్రస్తుత ఎన్ఎస్ఏ అజిత్ దోబల్ కూడా పాక్‌లో గూఢచర్యం చేసినట్లు ప్రచారం ఉంది. అప్పట్లో ఆయన భారత దౌత్యకార్యాలయంలో విధులు నిర్వహించేవారు. ఉగ్రవాద స్వర్గధామంగా అన్న చెడ్డపేరు తెచ్చుకొన్న పాక్.. భారత్‌కు కూడా కొంత బురద పూసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, అంతర్జాతీయ న్యాయస్థానం ఈ కేసును మరోసారి లోతుగా సమీక్షించాలని, కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధింపుపై పునరాలోచించాలని పాకిస్థాన్‌ను గట్టిగా ఆదేశించింది. జాదవ్‌కు న్యాయ సాయం అందించే హక్కు భారత్‌కు ఉందని చెప్పింది. ‘‘ఇంకేమాత్రం జాప్యం లేకుండా జాదవ్‌కు ఆయన హక్కుల గురించి పాక్ తెలియజేయాలి. వియన్నా ఒప్పందం ప్రకారం భారత కాన్సులర్ అధికారులను కలుసుకునే అవకాశాన్ని కల్పించాలి’’ అని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు పాక్ పారదర్శకంగా విచారణ చేపట్టాల్సి ఉంటుంది.