close

తాజా వార్తలు

జాదవ్‌ను కలిసేందుకు అనుమతిస్తామన్న పాక్‌

ఐసీజే మొట్టికాయలతో కళ్లు తెరిచిన దాయాది దేశం

దిల్లీ: భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ విషయంలో పాక్‌ మరోసారి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అతనికి న్యాయ సాయం అందకుండా పాక్‌ తీవ్ర తప్పిదం చేసిందన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) మొట్టికాయల నేపథ్యంలో ఆ దేశం కళ్లు తెరిచింది. ఐసీజే ఆదేశాల మేరకు కుల్‌భూషణ్‌ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అనుమతులు ఇస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్‌ చట్టాలకు లోబడి అందుకు సంబంధించిన అన్ని విధివిధానాలను సిద్ధం చేస్తున్నామన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం లభించే అన్ని హక్కులను ఇప్పటికే జాదవ్‌కు వివరించామని ప్రకటనలో పేర్కొన్నారు.   

పాకిస్థాన్‌ సైనిక న్యాయస్థానం కుల్‌భూషణ్‌కు విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ ఐసీజే బుధవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మరణ దండన విధిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలనీ, అప్పటివరకూ శిక్ష అమలును నిలిపివేయాలని ఆదేశించింది. జాదవ్‌ వ్యవహారంలో పాక్‌ అనుసరించిన తీరును ఐసీజే తీవ్రంగా ఆక్షేపించింది. న్యాయవాదిని నియమించుకునే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పింది. 16 మంది సభ్యుల ధర్మాసనంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న చైనా ప్రతినిధి సహా మొత్తం 15 మంది భారత్‌కు అనుకూలంగా రూలింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

కుల్‌భూషణ్‌ జాదవ్‌(49) తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ పాకిస్థాన్‌ సైనికులు 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అక్కడి సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్‌ గూఢచౌర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొంది. అయితే ఈ వాదనలను భారత్‌ ఖండించింది. భూషణ్‌ అసలు పాకిస్థాన్‌ వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది. ఈ విషయంపై 2016, మే 8న భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.