close

తాజా వార్తలు

కర్ణాటకీయం.. సుప్రీంకు కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక విధాన సభలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రం 6గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్‌ గడువు విధించిన వేళ కన్నడనాట రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘కర్ణాటకీయం’ మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. విప్‌పై స్పష్టత కోరుతూ కేపీపీసీ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టిన  కొద్దిసేపటికే.. సీఎం కుమారస్వామి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విప్‌పై స్పష్టతతో పాటు శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యంపైనా ముఖ్యమంత్రి పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో బలపరీక్షపై చర్చ జరుగుతోందని.. ఇంతలోనే బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ జోక్యం చేసుకుంటున్నారని.. అది అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు కూడా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల్లో గవర్నర్‌కు పరిమితమైన అధికారాలే ఉంటాయని.. గవర్నర్‌ సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే వీలు లేదంటూ ఆయన వివరించారు. 

కాంగ్రెస్‌, జేడీఎస్‌ వ్యూహాత్మక అడుగులు!
15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో పడిన కర్ణాటక ప్రభుత్వంలో సంకీర్ణ పక్షాలైన కాంగ్రెస్‌, జేడీఎస్‌ వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయితే గానీ బలపరీక్ష నిర్వహించే అవకాశం లేకపోవడంతో కాలయాపన చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇంకా 20 మంది మాట్లాడాల్సి ఉండగా.. కాలయాపన చేస్తూ సమస్యలపై ఎక్కువగా మాట్లాడటం కాకుండా విప్‌ ప్రకారం తమ పార్టీకి జరిగిన నష్టంపైనే అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారు. విశ్వాస పరీక్ష తీర్మానంపై చర్చలో సభ్యులందరికీ స్పీకర్‌మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో ఈ తీర్మానంపై చర్చ ముగియాలంటే మరో 2, 3 రోజులు పట్టే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ఈ రోజు బలపరీక్ష జరుగుతుందా? లేదా? అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.  

గవర్నర్‌ వరుస లేఖాస్త్రాలు
మరోవైపు, గవర్నర్‌ వరుసగా లేఖలు సంధిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30గంటలకే బలపరీక్ష జరపాలని గురువారం లేఖ రాయగా.. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ దాన్ని బేఖాతరు చేయడంతో మరో లేఖను పంపారు. 6గంటల్లోపు బలపరీక్ష నిర్వహించి సీఎం తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో  ఈ సాయంత్రం 6గంటలకు బలపరీక్ష జరుగుతుందా? లేదా?.. గవర్నర్‌ ఆదేశాన్ని స్పీకర్‌ పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, గవర్నర్‌కు సభా వ్యవహారాలకు సంబంధించి కొన్ని పరిమితమైన అధికారాలే ఉంటాయి తప్ప ఏ రోజు బలపరీక్ష  జరపాలి? ఎప్పుడు జరపాలని సమయాన్ని నిర్దేశించే అధికారం ఆయనకు లేదని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

అవిశ్వాసంపై పట్టువదలని భాజపా!
ఇంకోవైపు, అవిశ్వాసంపై భాజపా పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తోంది. ఈ రోజే ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించడం ద్వారా తమకే ఆధిక్యత ఉందని నిరూపించుకొనేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. నిన్న విధానసభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌ సభను వాయిదా వేయడంతో రాత్రంతా భాజపా సభ్యులు అసెంబ్లీలోనే నిద్రించారు. శుక్రవారం సభ వాయిదా పడితే మళ్లీ సోమవారమే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. దీంతో రెండు రోజుల సమయం సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉండటంతో భాజపా ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలిసి ఆయనపై ఒత్తిడి పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.