close

తాజా వార్తలు

విజయవాడ ట్రాఫిక్‌కు విముక్తి!

వాహనాల రద్దీకి సాంకేతికతతో చెక్‌
లైవ్‌ ట్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్‌తో నియంత్రణ
  నగర పోలీసుల వినూత్న ప్రయోగం
ఈనాడు - విజయవాడ

ఇరుకు రోడ్లు, వెల్లువెత్తుతున్న వాహనాల రద్దీతో విజయవాడ ట్రాఫిక్‌ రోజురోజుకూ పద్మవ్యూహంలా మారుతోంది. దీన్ని ఛేదించడానికి నగర పోలీసులు నిత్యం నానా తిప్పలు పడుతున్నారు. ప్రధానమైన జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్‌తో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పోలీసు అధికారులు సాంకేతిక సాయం తీసుకున్నారు. ఉన్నతాధికారులు ట్రాఫిక్‌ను ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ.. రద్దీగా ఉన్నచోట సమస్యను పరిష్కరించడానికి కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు.  ట్రాఫిక్‌ నియంత్రణలో ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆచరణలో పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు తొలి దశ అమలవుతోంది. తర్వాత దీనిని ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌)కు అనుసంధానం చేయనున్నారు. ఐటీఎంఎస్‌ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రస్తుతానికి లైవ్‌ ట్రాఫిక్‌ పద్ధతిని వినియోగిస్తున్నారు.
పనిచేసేది ఇలా..

గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా మ్యాప్‌ను రూపొందించారు. ఇందుకోసం నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, ట్రాఫిక్‌ డీసీపీ రవిశంకర్‌రెడ్డి ఎఫ్‌ట్రానిక్స్‌ సంస్థతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించారు. గూగుల్‌ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని విజయవాడ ట్రాఫిక్‌ నియంత్రణకు తగ్గట్లు దీన్ని మార్చారు. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
ప్రస్తుతం మూడు కూడళ్లల్లోని 27 సిగ్నళ్లు, 5 బ్లింకర్లను అనుసంధానం చేశారు. వీటి తాజా స్థితిని లైవ్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
* ప్రస్తుతం ప్రాథమిక దశలో దీనిని డీసీపీ ఒక్కరే వినియోగిస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ ప్రధాన కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లోని తెరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. అక్కడి నుంచే నగరంలో ఏ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఎలా ఉందో తెలుసుకోగలుగుతున్నారు. ప్రధాన మార్గాలపై రద్దీ ప్రభావం పడకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు వాకీటాకీల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ నియంత్రణ కొంత సులువవుతోంది.
* విజయవాడ నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన పీసీఆర్‌ జంక్షన్‌, బెంజి సర్కిల్‌, నిర్మల, రమేష్‌, రామవరప్పాడు, సీతన్నపేట తదితర 32 కూడళ్లను సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. వాహనాల రద్దీని నియంత్రించడం కష్టంగా ఉన్న చోట్ల సిగ్నళ్లను ఆపేసి కానిస్టేబుళ్లు బ్లింకర్లను ఆన్‌చేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఏ ప్రాంతాల్లోని బ్లింకర్లు, సిగ్నళ్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
* వీవీఐపీల రాకపోకలు ఉన్న సమయంలో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ప్రముఖులు వచ్చే సమయంలో ఆ మార్గంలోని కూడళ్లలో రద్దీ ఎలా ఉంది? కాన్వాయ్‌కు అడ్డంకులు ఎదురవుతాయా? వంటి అంశాలను అంచనా వేసేందుకు ఇది అక్కరకొస్తోంది.
ఆన్‌లైన్‌లో ఎలా తెలుస్తుంది?
ఒక మార్గంలో వెళ్తున్న వారి మొబైల్‌ సిగ్నల్‌ డేటా  ఆధారంగా ఆ రోడ్డులో రద్దీని సాఫ్ట్‌వేర్‌ పసిగడుతుంది.
* రోడ్డుపై అడ్డంకులేవీ లేకపోతే ఆన్‌లైన్‌లో ఆ మార్గం ఆకుపచ్చ రంగును చూపిస్తుంది.
* రద్దీ ఓ మోస్తరుగా ఉంటే కాషాయ రంగు
* రద్దీగా ఉంటే ఎరుపు
* వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతుంటే ముదురు ఎరుపు రంగును చూపిస్తుంది.

ఐటీఎంఎస్‌కు అనుసంధానం

విజయవాడ కమిషనరేట్‌కు ఐటీఎంఎస్‌ ప్రాజెక్టు మంజూరైంది. దీనికి రూ.14.5 కోట్లు వ్యయం చేయనున్నారు. గత ప్రభుత్వం ఓటాన్‌ బడ్జెట్‌లో ఆమోదించి తొలి విడతగా రూ.4.80 కోట్లను మంజూరు చేసింది. ఇది అమలులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి అవసరాల కోసం తాత్కాలికంగా లైవ్‌ ట్రాఫిక్‌ను అభివృద్ధి చేయించారు. ఐటీఎంఎస్‌ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను దానికి అనుసంధానించనున్నారు. అప్పుడు యాప్‌ను రూపొందించి డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు మొబైల్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసి ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. వారి పరిధిలోని ట్రాఫిక్‌ పరిస్థితిని మొబైల్‌లోనే అంచనా వేసుకునే అవకాశం ఉంది. అవసరమైతే సిగ్నళ్లను మార్పుచేర్పులు చేసుకునే వెసులుబాటు కలగనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.