close

తాజా వార్తలు

చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

సిద్దిపేట: తన స్వగ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామస్తులపై వరాల జల్లు కురిపించారు. సిద్దిపేటలోని చింతమడకకు చేరుకున్న ఆయన తొలుత గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐక్యంగా కదలాలన్నారు. నెలరోజుల్లో చింతమడక గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరారు.  గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10లక్షల లబ్ధి చేకూరుస్తామన్నారు. జీవనోపాధి కోసం వలసవెళ్లిన వాళ్లను సైతం పిలిపించి సాయం అందించాలన్నారు.  ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలని సూచించారు. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను గ్రామస్థులతో పంచుకున్నారు. గ్రామంలో పాదయాత్ర చేసిన సీఎం.. ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరించారు.

చింతమడక అభివృద్ధికి అదనంగా రూ.50కోట్లు

సిద్దిపేటకు త్వరలో రైలు వస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. సిద్దిపేటకు అందించిన మంచినీటి పథకం స్ఫూర్తితోనే మిషన్‌ భగీరథకు రూపకల్పన చేశామని చెప్పారు. చింతమడక గ్రామానికి 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీకమాసంలో ఇక్కడ గృహప్రవేశాలు జరగాలన్నారు. తాను ప్రవేశపెట్టిన పథకాల్లో రైతు బంధు, రైతుబీమా ఎంతో సంతృప్తినిచ్చాయని, తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.‘‘చింతమడక నన్ను కనిపెంచింది. ఈ గ్రామం కోసం నేను ఎంత చేసినా తక్కువే. చింతమడక కోసం అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తా. అదనపు నిధులను ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు. చింతమడకలో పాడి, కోళ్ల పెంపంక అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఫంక్షన్‌ హాళ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ఈ గ్రామం వాస్తుపరంగా కూడా బాగుంటుంది. చింతమడక ఓ బంగారు తునక కావాలి’’ అని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

‘‘చింతమండక వాస్తు పరంగా కూడా బాగుంటుంది. గ్రామానికి నాలుగు వైపులా చెరువులు ఉన్నాయి. చింతమడకతోపాటు మరో రెండు గ్రామాలు నాకు విద్యాబుద్ధులు నేర్పించాయి. ఈ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తాం. ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయిస్తాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. ప్రభుత్వ ఖర్చుతో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తాం. చింతమడక ఆరోగ్య నివేదిక తయారు చేయాలి. తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌కు ఈ గ్రామమే నాంది కావాలి. సిద్దిపేట నియోజకవర్గం నన్ను రాజకీయంగా పెంచింది. అద్భుతమైన విజయాలు అందించింది. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికీ అభివృద్ధి కోసం రూ.50లక్షలు మంజూరు చేస్తాం. రంగనాయక సాగర్‌ కట్ట అభివృద్ధికి రూ.5కోట్లు కేటాయిస్తాం. సిద్దిపేట పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు, దుబ్బాకకు రూ.10 కోట్లు మంజూరు చేస్తాం’’ అని సీఎం అన్నారు. అనంతరం జై తెలంగాణ.. జై చింతమడక అంటూ కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.  

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.