close

తాజా వార్తలు

ఎమ్మెస్కే ముఖాముఖి 2: మాకు విజన్‌ లేదంటారా?

మరి బుమ్రా, పాండ్య, పంత్‌ టెస్టుల్లో ఎలా ఆడగలుగుతున్నారు?

రిషభ్‌పంత్‌ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం

దిల్లీ: జస్ప్రీత్‌ బుమ్రా విచిత్ర బౌలింగ్‌ శైలి, బక్కపల్చని రూపం చూసి పరిమిత ఓవర్ల క్రికెట్‌కే అతడు పరిమితమని అనుకున్నారు. టెస్టుల్లో అలా అరంగేట్రం చేశాడో లేదో ఇలా నంబర్‌ వన్‌ అయిపోయాడు. ఇక హార్దిక్‌ పాండ్యనైతే ప్రత్యేకించి టీ20 కుర్రాడిగా భావించారు. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో జట్టుకు సమతూకం తెచ్చే ఆటగాడిగా మారిపోయాడు. యువకుడైన రిషభ్‌ పంత్‌ను టెస్టుల్లో ఆడించే సాహసం చేస్తారా ఎవరైనా? ఇప్పుడతను అన్ని ఫార్మాట్లలో ఎంఎస్‌ ధోనీ వారసుడిగా అవతరిస్తున్నాడు. సెలక్షన్‌ కమిటీకి ముందుచూపు, దార్శనికత లేకుండానే ఇవన్నీ జరిగాయా అని ప్రశ్నిస్తున్నారు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. పీటీఐ వార్తాసంస్థకు ఆయనిచ్చిన ముఖాముఖిలో రెండో భాగం మీకోసం.

సెలక్షన్‌ కమిటీ సభ్యుడికి కీలక నైపుణ్యాలు ఏవి ఉండాలంటారు?

ఎన్ని మ్యాచులు ఆడాడు, అంతర్జాతీయ అనుభవం ఏంటన్న సంగతి పక్కన పెడితే నిజాయతీ, అంకితభావం, సమగ్రత, రహస్యాలను దాచగలిగే నాలుగు కీలక నైపుణ్యాలు సెలక్షన్‌ కమిటీ సభ్యులకు అవసరం. మా కమిటీ ఈ నాలుగు ప్రాథమిక అంశాలపై కచ్చితంగా నిలబడిందని 100% చెప్పగలను.

కొందరు మీకు దార్శనికత లోపించిందని ప్రతిసారీ విమర్శిస్తున్నారు కదా. మీరేమంటారు?

ఈ విషయంలో నేను మీకెన్నో ఉదాహరణలు చూపించగలను. సెలక్షన్‌ కమిటీకి నిజంగానే దార్శనికత లోపించివుంటే తెల్లబంతి క్రికెటర్‌గా ముద్రపడిపోయిన జస్ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో నంబర్‌ వన్‌ స్థానానికి ఎలా చేరుకున్నాడు?

యువతపై ఎంత శ్రద్ధపెట్టామో ఆలోచించండి. మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి ఎలా మెరుగయ్యారో పరిశీలించండి. మా కొత్త ఫాస్ట్‌ బౌలింగ్‌ బలం చూడండి. భారత్‌లో అత్యంత వేగంగా బంతులు విసురుతున్న ఇద్దరు బౌలర్లు ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైనీ.

ఇంకా మా దార్శనికత లోపం గురించే మాట్లాడితే.. అసలు సుదీర్ఘ ఫార్మాట్‌కు కలలోనైనా ఎవరూ ఊహించని రిషభ్‌ పంత్‌లో పరిణతి పెంచి టెస్టుల్లో ఆడించాం. ఇంగ్లాండ్‌ ఆస్ట్రేలియాలో అతడు బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌లో ఎలా చెలరేగాడో మనందరం చూశాం కదా?

మాకే గనక దార్శనికత లేకుంటే కేవలం టీ20లకే ప్రత్యేకం అనుకున్న హార్దిక్‌ పాండ్య మూడు ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌ బాధ్యతలు ఎలా మోస్తున్నాడు?

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అప్పటికే స్థిరపడ్డ స్పిన్నర్లు (రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌) ఉన్నప్పటికీ మణికట్టు మాంత్రికులు యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌కు అవకాశాలిచ్చింది ఇదే కమిటీ కదా? మా కమిటీకి దార్శనికత, ప్రణాళిక లేకుంటే టీమిండియా కన్నా ముందే భారత్‌-ఏ జట్టుతో షాడో పర్యటనలు ఎలా చేయిస్తాం? కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్‌ ద్రవిడ్‌ సమన్వయంతో మా సెలక్షన్‌ కమిటీ కృషికి ఫలితాలే కదా ఇవన్నీ.

ఎంఎస్‌ ధోనీకి జట్టులో చోటివ్వడం కోసం మిడిలార్డర్‌ సమతూకం విషయంలో రాజీ పడ్డారని మీరు భావిస్తున్నారా?

ఒకవేళ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సెమీస్‌ గెలిచుంటే.. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలిన తర్వాత రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ ఆడిన ఇన్నింగ్స్‌లను ఎంతగానో కీర్తించేవాళ్లం కదా! ఇప్పటికీ నాది ఒకటే మాట. భారత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపింగ్‌ పరంగా, మ్యాచ్‌లను ముగించడంలో ధోనీయే మేటి. ఇతరులు ఎదుగుతున్నారు. ఒక బ్యాట్స్‌మన్‌, కీపర్‌గానే కాదు, జట్టుకు తన అనుభవాన్ని పంచడంలో, సారథి నిర్ణయాలు తీసుకొనేందుకు సాయం చేయడంలో అతడు మన బలం.

స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు జట్టును ఎంపిక చేసే అవకాశం మీ కమిటీకి ఇస్తే (సమయానికి బీసీసీఐ ఎన్నికలు జరగకుంటే) తనకు ఇష్టమైన మ్యాచ్‌లు ఆడేలా ఎంఎస్‌ ధోనీకి అనుమతి ఇస్తారా?

వెస్టిండీస్‌ పర్యటనకు ఆటగాళ్లను ఎంపిక చేసిన తర్వాత నేను స్పష్టంగా చెప్పాను. ప్రపంచకప్‌ తర్వాత రిషభ్‌ పంత్‌ ఎదిగేందుకు, ఆత్మవిశ్వాసం పెంచుకొని అంచనాల మేరకు రాణించేందుకు అతడికి తగినన్ని అవకాశాలు ఇచ్చేలా ప్రణాళిక రచించాం.

2020, 2021 సీజన్లకు జట్టు పునర్‌ నిర్మాణ దశకు వెస్టిండీస్‌ పర్యటన ఆరంభమా?

పునర్‌ నిర్మాణం, పటిష్టం కావడం నిరంతర ప్రక్రియ. మా టెస్టు జట్టు గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడింది. మేం టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం.

ఇక వన్డేలు, టీ20ల విషయానికి వస్తే భారత్‌-ఏలో నిలకడగా ఆడిన యువకులకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అవకాశాలు ఇచ్చాం. టీమిండియాలో వారు తమ స్థానం పదిలం చేసుకొని ఎక్కువ అవకాశాలు పొందాలని కోరుకుంటున్నాం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.