
తాజా వార్తలు
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఆర్టీజీఎస్ వెల్లడించింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. ఈ నెల 5 వరకు ఈదురు గాలుల తీవ్రత ఉంటుందని వివరించింది. గంటకు 70కి.మీల వేగంతో గాలులువీచే సూచనలు ఉన్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. సముద్రపు అలలు నాలుగు మీటర్ల ఎత్తువరకు ఎగిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని.. ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఆర్టీజీఎస్ హెచ్చరించింది.
అమరావతిలో వర్షం
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో వర్షాలు కురుస్తున్నాయి. తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి సహా పలు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న ఈ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. మరో నాలుగు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేస్తున్నారు.