close

తాజా వార్తలు

ఉరికొయ్యను ముద్దాడి ఉరి వేసుకున్నాడు..

ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: నూనూగు మీసాల 19 ఏళ్ల యువకుడు.. నిండా ప్రపంచమంటే తెలియదు... కానీ దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించాలన్న లక్ష్యం ముందు అవేమీ అడ్డురాలేదు. తిరుగుబాటు ద్వారా తెల్లవారి నుంచి విముక్తి పొందాలన్నది ఆ యువకుని ఆశయం.. ఈ క్రమంలో బ్రిటిషువారికి చిక్కాడు..అతనికి ఉరిశిక్ష విధించారు.. క్షమాభిక్ష పెట్టుకుంటే పరిశీలిస్తామని న్యాయమూర్తి చెప్పాడు.. ఆ యువకిశోరం అంగీకరించలేదు.. ఉరిశిక్ష త్వరగా విధించాలని కోరాడు. 17 నవంబరు, 1915న ఆ యువకునికి ఉరిశిక్షకు రంగం సిద్ధమైంది.. తలారి ఉరి బిగించకముందే తానే ఆ ఉరిని బిగించుకొని నవ్వుతూ దేశమాత విముక్తి కోసం అమరుడయ్యాడు. ఈ యువ కిశోరమే కర్తార్‌సింగ్‌ సరభా.

దేశమాత స్వేచ్ఛ కోసం..

పంజాబ్‌లోని లూథియానాలో 24 మే, 1896లో సరభా జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తాతయ్య బదన్‌సింగ్‌ దగ్గర పెరిగారు. 1912లో ఉన్నత విద్యాభ్యాసం కోసం  అమెరికా వెళ్లారు. అక్కడ గదర్‌ పార్టీ సభ్యులతో పరిచయమైంది. దేశానికి  విప్లవాత్మక పద్ధతులతో  స్వాతంత్ర్యం తీసుకురావాలన్న ఆశయంతో ఆ సంస్థను ఏర్పాటు చేశారు. భారత్‌లో బ్రిటిషువారు చేస్తున్న అరాచాకాలను ఆయన గ్రహించారు. బ్రిటిషువారిని వెళ్లగొట్టాలన్న తలంపుతో గదర్‌పార్టీలో చేరారు. ఆ సమయంలోనే సంస్థ నుంచి గదర్‌ అనే పత్రిక వెలువడేవి. ఆ పత్రికను భారత్‌లో పంపిణీ చేయాలన్న పథకంలో భాగంగా కర్తార్‌సింగ్‌ కొందరు గదర్‌ పార్టీ కార్యకర్తలతో కలసి తిరిగి భారత్‌కు చేరుకున్నారు.

నిధుల కోసం..

విప్లవాన్ని నడిపించాలంటే నిధులు అవసరం. దీంతో ఐశ్వర్యవంతుల నివాసాలపై దాడులు చేయాలని వారు భావించారు. ఇందులో భాగంగా దోపిడీలు చేసేవారు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దోపిడీ సొమ్మును తిరిగి సొంతదారులకు ఇచ్చివేయాలని వారు నిర్ణయించారు.

సహచరుని నమ్మకద్రోహంతో దొరికిపోయారు..

దేశంలోని దాదాపు 20 వేలమంది విప్లవకారులు 21 ఫిబ్రవరి, 1915న సాయుధ తిరుగుబాటు చేయాలని నిర్ణయించారు. ఫిరోజ్‌పూర్‌లోని కంటోన్మెంట్‌పై దాడికి పథకం సిద్ధమైంది.  వారిలో కృపాల్‌సింగ్‌ అనే వ్యక్తి బ్రిటిషువారికి ఏజెంటుగా పని చేసేవాడు. ఈ పథకం వివరాలను పాలకులకు అందించడంతో వారు దీన్ని భగ్నం చేశారు. గదర్‌పార్టీకి చెందిన పలువురు అరెస్టయ్యారు. కర్తార్‌సింగ్‌ తప్పించుకొని అఫ్గన్‌కు పారిపోయాడు. అయితే తన సహచరులు జైల్లో ఉండగా తాను బయట ఉండటం ఆయనకు నచ్చలేదు. దీంతో తిరిగివస్తుండగా పోలీసులు అరెస్టుచేశారు.

త్వరగా ఉరిఅమలుచేయండి..

సరభాతో పాటు ఏడుగురి ఉద్యమకారులపై లాహోర్‌ కుట్రకేసు నమోదైంది. తనను వెంటనే ఉరి తీయాలని.. జన్మంటూ ఉంటే మళ్లీ ఈ గడ్డపైనే పుట్టి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటానని ఆయన న్యాయమూర్తికి చెప్పారు. క్షమాభిక్ష పెట్టుకుంటే పరిశీలిస్తానని న్యాయమూర్తి చెప్పారు. అయితే కర్తార్‌సింగ్‌ క్షమాభిక్షకు నిరాకరించారు. బ్రిటిషు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఉరిశిక్షను విధించారు.

‘తాతా ఎందుకు ఏడుస్తావు..

కారాగారంలో ఉన్న కర్తార్‌సింగ్‌ను చూసేందుకు ఆయన తాత వచ్చారు. మనవడిని చూసిన ఆయనకు కన్నీళ్లు ఆగలేదు. ‘‘తాతా.. ఎందుకు బాధపడతావు.. మన కుటుంబానికి  కళంకం తెచ్చే పని చేయలేదు. 30 కోట్ల భారతీయులను బానిసత్వం నుంచి బయటకు తెచ్చేందుకు జరుగుతున్న పోరాటంలో బలిదానం చేస్తున్నాను. సగర్వమైన నా ఉరిని చూసి బాధపడకూడదు’’ అని అన్నారు. దీంతో ఆయన తాత దుఃఖం ఆగింది.

ఉరితాడును ముద్దు పెట్టుకొని..

17 నవంబరు, 1915న కర్తార్‌తో పాటు ఆరుగురిని లాహోర్‌ సెంట్రల్‌ జైలులో ఉరితీశారు. చివరి క్షణాల్లోనూ ఆయన ధైర్యం సడలలేదు. తానే ఉరితాడును ముద్దు పెట్టుకొని ఉరి వేసుకున్నాడు. కేవలం 19 ఏళ్లే జీవించిన కర్తార్‌సింగ్‌ సరభా తన బలిదానంతో కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.