close

తాజా వార్తలు

ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉపశమనాలు స్టాక్‌మార్కెట్లలో జోష్‌ను నింపాయి. నేడు ప్రీఓపెనింగ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 1090 పాయింట్ల మేరకు ఎగసింది. ఉదయం 9.22 సమయంలో సెన్సెక్స్‌ 301 పాయింట్లు పెరిగి 37,003 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 10,915 వద్ద ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా ఎఫ్‌పీఐలపై విధించిన సర్‌ఛార్జిని తొలగించడంతోపాటు , దీర్ఘకాలిక, స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును ఉపసంహరించుకోవడం మదుపరుల్లో జోష్‌ పెంచింది. దీంతోపాటు బ్యాంకులకు రూ.70వేల కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించడంతో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు వరంగా మారింది. అయితే ఆ తర్వాత సూచీలు నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంటున్నాయి. అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై అదనపు టారీఫ్‌లు విధించడంతో వాణిజ్య యుద్ధభయాలు మార్కెట్లను వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో ఆసియాలోని ఇతర స్టాక్‌ మార్కెట్ల షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

తాయిలాలు ఇవే..

> శ్రీమంతులు, విదేశీ మదుపర్లకు చెందిన దీర్ఘకాలిక మూలధన లాభాలు(ఎల్‌టీసీజీ), స్వల్పకాలిక మూలధన లాభాల(ఎస్‌టీసీజీ)పై అదనంగా విధించిన సర్‌ఛార్జీ ఉపసంహరణ. 
> నమోదిత అంకురాల(స్టార్టప్‌లు)కు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 56-2బి ఇక వర్తించదు. ఏంజెల్‌ పన్నును వారు కట్టక్కర్లేదు. పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) వద్ద నమోదు చేసుకున్న అంకురాలకు ఈ మినహాయింపు ఉంటుంది.
> అంకురాలకు సంబంధించిన పన్ను సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక విభాగాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఏర్పాటు చేయనుంది.
> ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేస్తారు. దీంతో మార్కెట్లో బ్యాంకుల రుణ సామర్థ్యం రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుంది.
> రుణ ఎగవేతల నుంచి కాపాడుకునేలా క్రెడిట్‌ డిఫాల్ట్‌ స్వాప్‌ నిధులను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.
> మౌలిక, గృహ ప్రాజెక్టులకు రుణాలు అందేలా చేస్తారు. గృహ రుణ కంపెనీలకు అదనంగా రూ.20,000 కోట్ల ద్రవ్యలభ్యతను ప్రకటించడంతో మొత్తం మద్దతు రూ.30,000 కోట్లకు చేరతాయి.
ఏమవుతుందంటే..
సర్‌ఛార్జీ ఉపసంహరణ వల్ల ప్రభుత్వానికి రూ.1400 కోట్ల మేర ఆదాయాల్లో కోత పడ్డప్పటికీ.. సెంటిమెంటు మెరుగుకానుంది. ఎఫ్‌పీఐలపై పన్ను రేట్లు 7 శాతం నుంచి 4 శాతానికి చేరనున్నాయి. బడ్జెట్‌ ముందు పరిస్థితి తిరిగి ఏర్పడుతుందని ఆర్థిక మంత్రే చెప్పారు. ఇక అంకురాలకు ప్రకటించిన పలు చర్యలు.. ఆ రంగంలో ఒక మెరుగైన వాతావరణం ఏర్పడడానికి ఉపయోగపడనున్నాయి. పన్ను అధికార్ల నుంచి వారికి ఎదురవుతున్న సమస్యలు తొలగుతాయని విశ్లేషకులు అంటున్నారు. అంకురాలకు ప్రారంభ దశలో మూలధనాన్ని సమీకరించుకోవడానికి కూడా తాజా చర్యలు ఉపయోగపడనున్నాయి. ఇక మౌలిక, గృహ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెరిగితే.. ఆయా రంగాలు రాణించగలవు. అందుకు సంబంధించిన వాటిలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మొత్తం మీద స్టాక్‌ మార్కెట్‌కు సానుకూలతలు కనిపించనున్నాయి.

పన్నుల విషయంలో ఊరట

> విజయ దశమి నుంచి వ్యక్తిగత హాజరు లేని(ఫేస్‌లెస్‌) పన్ను తనిఖీ ఉంటుంది.
> ఆదాయ పన్ను రిటర్నుల్లో ముందస్తుగా సమాచారాన్ని నింపే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తారు.
> జీఎస్‌టీ రిటర్నుల సంఖ్యను తగ్గింపు, సరళీకృత దరఖాస్తులు త్వరలో ఆచరణలోకి వస్తాయి. రిఫండ్‌ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తారు.
> కొన్ని కేసుల్లో మాత్రమే యాదృచ్ఛిక పన్ను మదింపులుంటాయి.
> యాదృచ్ఛికంగా ఎంపిక చేసే కొన్నింటిపైనే భౌతిక పన్ను మదింపులుంటాయి.
> కార్పొరేట్‌ నేరాల విషయంలో 1400కు పైగా కేసులు వెనక్కి తీసుకుంటారు.
ఏమవుతుందంటే..
ఐటీ రిటర్నులు మరింత సులభతరంగా ఫైల్‌ చేయవచ్చు. పన్ను అధికారుల వద్దకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు. కార్పొరేట్‌ నేరాల విషయంలో కేసుల ఉపసంహరణ వల్ల ఆయా వర్గాలకు ఊరట.

వినియోగాన్ని పెంచడానికి

> వినియోగదార్ల కోసం ఆధార్‌ ఆధారిత కేవైసీ(నీ వినియోగదారు గురించి తెలుసుకో)ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఉపయోగించుకోవచ్చు. ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే ముందస్తు చెల్లింపు నోటీసులను ఇకపై బ్యాంకులు పర్యవేక్షిస్తాయి.
> వాహనాలు, గృహాలు, వినియోగదారు వస్తువులు కొనుగోలు చేసే వారికి మరింత రుణ మద్దతు లభిస్తుంది.
> వినియోగదార్లందరినీ చేరడం కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కలిసి పనిచేసేలా చర్యలు తీసుకుంటారు.
> గృహ రుణ సంస్థలకు గృహ రంగ నియంత్రణాధికార సంస్థ ఎన్‌హెచ్‌బీ అదనంగా రూ.20,000 కోట్ల ద్రవ్యలభ్యతను అందించనుంది.
ఏమవుతుందంటే..
ఎన్‌హెచ్‌బీ ఇచ్చే అదనపు ద్రవ్యలభ్యత వల్ల ఇప్పటికే గిరాకీ మందగమనంలో ఉన్న స్థిరాస్తి రంగానికి ఊతం లభిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి సైతం మూలధన రుణాలు చౌకగా మారతాయని సీతారామన్‌ పేర్కొన్నారు.

ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల కోసం..

> సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీల(ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)కు రావాల్సిన అన్ని జీఎస్‌టీ రిఫండ్‌లను 30 రోజుల్లోగా పరిష్కరిస్తారు.
> భవిష్యత్‌లోనూ జీఎస్‌టీ రిఫండ్‌లన్నిటినీ దరఖాస్తు చేసుకున్న 60 రోజుల్లోగా పరిష్కరిస్తారు.
> ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల కోసం ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకాలను బ్యాంకులు జారీ చేయనున్నాయి.
ఏమవుతుందంటే..
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రావాల్సిన రీఫండ్‌లు ‘ఎంచదగ్గరీతి’లోనే ఉన్నాయి. ఈ తరుణంలో తాజా నిర్ణయాల వల్ల ఈ రంగానికి ఉద్దీపన కలగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి పేర్కొన్నారు. ఒకే నిర్వచనం దిశగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ చట్టాన్ని సైతం త్వరలో సవరిస్తామని ఆయన అన్నారు.

వాహన రంగం కోసం..

> మార్చి 31, 2020 వరకు కొనుగోలు చేసే బీఎస్‌-4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ గడువు మొత్తం వరకు కొనసాగించవచ్చు.
> ఒకేసారి కట్టే రిజిస్ట్రేషన్‌ ఫీజు సవరింపును జూన్‌ 2020 వరకు వాయిదా వేశారు.
> విక్రయాలు లేక నిల్వలు పేరుకుపోవడంతో.. మార్చి 2020 వరకు కొనుగోలు చేసే ఏ వాహనానికైనా అదనంగా 15 శాతం తరుగుదలకు అనుమతి ఇచ్చారు. దీంతో మొత్తం మీద ఇది 30 శాతానికి చేరింది.
> విద్యుత్‌ వాహనాలు(ఈవీ), ఇంటర్నల్‌ కంబషన్‌ వాహనాల(ఐసీవీ) రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుంది.
> ప్రభుత్వ శాఖలు, విభాగాలు తమ పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. తద్వారా గిరాకీ పెరగడానికి ఊతమిచ్చారు.
> గిరాకీని మరింత పెంచడం కోసం తుక్కు విధానం(స్క్రాప్‌ పాలసీ)తో పాటు పలు చర్యలను ప్రభుత్వం పరిశీలించనుంది.
> విడిభాగాల అభివృద్ధికి తగిన మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
ఏమవుతుందంటే..
ఈ ఏడాదంతా ప్యాసింజరు వాహనాల విక్రయాలు తగ్గుతూనే వస్తున్నాయి. ఏప్రిల్‌-జూన్‌లో మొత్తం వాహన పరిశ్రమ విక్రయాలు 12.35 శాతం మేర క్షీణించడంతో గత మూడు నెలల్లోనే దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత పడింది. దీనిపై వాహన పరిశ్రమ ప్రతినిధులు పలుసార్లు ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు వాహన రంగానికి భారీ ఊరటను కలిగించనున్నాయి. ఇవి గిరాకీ పెరగడానికి సహకరిస్తాయి. బీఎస్‌-4 వాహనాలపై కంపెనీ వర్గాల్లో గందరగోళం ఉండేది. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో ఈ వాహనాల విక్రయాలపై కొంత నీలినీడలు పడ్డాయి. అయితే దీనిపై తాజాగా స్పష్టతనివ్వడం గొప్ప ఊరట కిందే లెక్క. ఇక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తుక్కు విధానంపైనా స్పష్టత రావడం విశేషం. రుణ లభ్యత వ్యయాలు, వాహనాల కొనుగోలు వ్యయాలు పెరగడంవంటి పలు అంశాల్లో వాహన పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరో వైపు జీఎస్‌టీని కూడా తగ్గించమని వాహన పరిశ్రమ కోరింది. నేటి జీఎస్‌టీ మండలి సమావేశంలో ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

బ్యాంకులకు..

> ఎమ్‌సీఎల్‌ఆర్‌ రేటు కోతలన్నిటిని పూర్తిస్థాయిలో వినియోగదార్లకు బ్యాంకులు బదిలీ చేస్తాయి.
> రెపో అనుసంధానిత రుణ పథకాలను బ్యాంకులు ప్రకటిస్తాయి.
> రుణాల సెటిల్‌మెంట్‌ కోసం మెరుగైన, పారదర్శక ప్రక్రియలను బ్యాంకులు ప్రవేశపెట్టనున్నాయి.
> ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు సైతం ఒకే సారి చేసుకునే రుణ సెటిల్‌మెంట్‌ కోసం చెక్‌బుక్‌ విధానాన్ని బ్యాంకులు తీసుకురానున్నాయి.
> మూలధన రుణాలు మరింత చౌక కానున్నాయి.
> బ్యాంకులకు ఎదురయ్యే నష్టభయ సమస్యలకు ఒక పరిష్కారం చూపుతారు.
> రుణాన్ని తీర్చిన అనంతరం 15 రోజుల్లోనే రుణ పత్రాలను వెనక్కి ఇచ్చేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తారు.(దీని వల్ల తనఖా ఆస్తులున్న రుణ స్వీకర్తలకు ప్రయోజనం కలుగుతుంది.)
ఏమవుతుందంటే..
రేట్ల కోతల ప్రయోజనాలను అందజేయడం ద్వారా అందరు రుణ స్వీకర్తలకు ప్రయోజనాలు అందుతాయి. రెపో రేటును అనుసంధానించడం వల్ల గృహ, వ్యక్తిగత రుణాలకు సంబంధించిన నెల వారీ వాయిదా(ఈఎమ్‌ఐ)లు తగ్గుతాయి. గృహ, వాహన, వినియోగదారు వస్తువులపై తీసుకునే కొత్త రుణాలు కూడా చౌకగా లభ్యమవుతాయి. ఈ ఏడాది ఆర్‌బీఐ నాలుగు దశల్లో 110 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ.. బ్యాంకులు మాత్రం నామమాత్రంగానే వినియోగదార్లకు బదిలీ చేశాయి. ఈ నెలలో 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపును పక్కనపెడితే.. మొత్తం 75 బేసిస్‌పాయింట్ల కోతకు గాను బ్యాంకులు కేవలం 29 బేసిస్‌ పాయింట్ల మేరే ప్రయోజనాల బదిలీ చేశాయి.  తాజా నిర్ణయంతో పరిశ్రమకు సైతం నిర్వహణ మూలధన రుణాలు చౌకగా మారనున్నాయి. బ్యాంకులకు రూ.70,000 కోట్లను ఒకే సారి విడుదల చేయడం వల్ల కార్పొరేట్లు, రిటైల్‌ రుణ స్వీకర్తలు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, చిన్న వర్తకులకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి.

ఇంకా..

> భూ సంస్కరణలు, దివాలా చట్టానికి సవరణలు కూడా చేపట్టి పెట్టుబడులను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
> కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) ఉల్లంఘనలను క్రిమినల్‌ నేరాలుగా పరిగణించరు.
> అక్టోబరు 1, 2019 నుంచి ఐటీ ఆదేశాలు, నోటీసులు, సమన్లు అన్నీ.. ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారా జారీ అవుతాయి. అలా కేంద్ర వ్యవస్థ ద్వారా ఏదైనా వెళ్లకపోతే అది చట్టబద్ధం కాదు.
> అక్టోబరు 1, 2019 కల్లా పాత ఐటీ నోటీసులన్నిటినీ పరిష్కరిస్తారు. అవసరమైతే కేంద్రీకృత వ్యవస్థ ద్వారా తిరిగి జారీ చేస్తారు.
> వ్యక్తిగతంగా ఏ అధికారి కూడా చర్యలు తీసుకోవడానికి ఉండదు. మదింపుదార్లు తమకందిన నోటీసులకు ఒక్కసారి సమాధానం ఇస్తే సరిపోతుంది.
ఏమవుతుందంటే..
కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు వల్ల పన్ను చెల్లింపుదార్లకు అధికారుల నుంచి వేధింపులు తగ్గుతాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.