close

తాజా వార్తలు

ప్రతి శనివారం వచ్చి..నదికి ప్రాణం పోశారు

 

నాగ్‌పూర్‌: ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపూ సొలుపే మున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది’ అని నాగేశ్వర్రావు, సావిత్రి తమ ఎదుగుదల కోసం కలిసికట్టుగా పనిచేస్తారు ఓ సినిమాలో. అయితే మహారాష్ట్రలో మాత్రం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 40 వేల మంది తలోచేయి వేసి, ఓ నదికి జీవం పోశారు. తమకు ప్రాణాధారమైన నది వ్యర్థాలతో నిండిపోవడాన్ని తట్టుకోలేని వారు ప్రతినెలా కొంత సమయాన్ని కేటాయించి, నదిని శుభ్రం చేసుకోవడంతో పాటు ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. అలాగే గోల్డెన్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటు పేరు, అటు ప్రయోజనం రెండూ పొందారు. మరిన్ని వివరాలు కావాలంటే మహారాష్ట్రలోని అకోలా జిల్లా వాసుల ప్రయత్నాన్ని తెలుసుకోవాల్సిందే..

నాగ్‌పూర్‌కు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకోలా జిల్లాకు 173 కిలో మీటర్ల పొడవైన మోర్నా నది ప్రాణాధారం. నది కలుషితమవుతుందని ఆలోచించకుండా కొన్ని సంవత్సరాలుగా దానిలో చెత్త వేయడంతో అదొక డంపింగ్ యార్డ్‌గా మారిపోయింది. తమకు గుక్కెడు నీళ్లు ఇచ్చే నది ఇలా మారిపోవడం అక్కడి ప్రజలను ఆలోచనలో పడేసింది. దానికి మళ్లీ పునరుజ్జీవనం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కొందరు వ్యక్తులు అకోలా ప్రజల్లో నది పరిస్థితి గురించి వివరించి పెద్ద ఉద్యమాన్ని తీసుకురాగలిగారు.  దాంతో కొన్ని నెలలుగా ప్రతి శనివారం జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఆ నదిని శుభ్రం చేయడం ప్రారంభించారు. చెత్త మొక్కలు, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలకు తావు లేకుండా గత ఏడాదిన్నర కాలంగా ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఉదయం ఏడింటికి మొదలు పెట్టి, మధ్యాహ్నం భోజనం సమయం వరకు అలుపెరగకుండా ఆ పనికే అంకితమయ్యారు. దానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించి గ్లోవ్స్‌, కొన్ని పరికరాలను అందించింది. అలాగే వెలికి తీసిన చెత్తను తరలించేది. 

గతంలో ఆ నది బ్రిడ్జి మీద నుంచి జనాలు చెత్తను నదిలోకి విసిరేవారు. ఇప్పుడు అక్కడ చెత్తడబ్బాలు ఏర్పాటు చేసి, నదిలోకి వేయొద్దని ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. అలాగే నదిలో బట్టలు ఉతకొద్దని, స్నానం చేయొద్దని స్థానికులకు సూచిస్తున్నారు. నదికి దగ్గర్లో రెండు సీవేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గతంలో బహిరంగ మలవిసర్జనకు ఉపయోగించిన ప్రాంతంలో ఇప్పుడు సోలార్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో అది క్రమంగా జాగింగ్ ప్రాంతంగా మారిపోయింది. 

 వీరు చేస్తోన్న కృషి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లింది. ప్రతినెలా జరిగే మన్‌కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి ప్రస్తావిస్తూ..‘ప్రజలందరూ కలిసికట్టుగా వచ్చి మిషన్‌ క్లీన్ మోర్నా రివర్‌కు పూనుకోవడమన్నది అద్భుతమైన విషయం’ అని వారిని అభినందించారు. అలాగే 2018లో అకోలా ప్రజలు ఈ క్లీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించిన 6 నెలలకే గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. అంతేకాకుండా ఈ 40వేల మందికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించింది. వారు ఇప్పటి వరకు రూ.17లక్షలు విరాళంగా ఇచ్చి సహకరించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.