close

తాజా వార్తలు

టెస్టు క్రికెట్‌ ఇకపై నాలుగు రోజులేనా?

టెస్టు క్రికెట్‌ అనగానే తెల్లని దుస్తులు.. ఎర్రటి బంతులు.. గంటల కొద్ది క్రీజులో పాతుకపోయే స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌.. వందల సంఖ్యలో బంతులు విసిరే భీకర బౌలర్లు.. ఇలా ఎన్నో విశేషాల వేదిక ఈ సుదీర్ఘ ఫార్మాట్‌. ఐదు రోజుల పాటు సాగే ఈ మహా పోరాటంలో ఆటగాళ్లు ఎంత గొప్ప ప్రదర్శన చేసినా ఫలితం రాని సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో ఈ పెద్ద ఫార్మాట్‌ అంటే చాలు ప్రేక్షకులు పెదవి విరిచేవారు! అయితే ఇదంతా ఒకప్పటి మాట. 
కొంతకాలంగా టెస్టు క్రికెట్‌ పంథా పూర్తిగా మారిపోయింది. ఎంతో ఆసక్తికరంగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఏ మాత్రం తీసిపోకుండా అభిమానులను గొప్పగా ఆకట్టుకుంటోంది. సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లకు సరికొత్త చిరునామా అవుతోంది. దీనికితోడు ఫలితం కూడా నాలుగు లేదా అంతకంటే తక్కువ రోజుల్లోనే తేలిపోవడం మొదలైంది. అందుకు సరైన ఉదాహరణే గతవారం ఆసక్తికరంగా సాగిన మూడు టెస్టులు..

* ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మధ్య సాగిన యాషెస్‌ మూడో టెస్టు ఎంత ఉత్కంఠకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సగటు క్రికెట్‌ అభిమానిని ఆద్యంతం అలరించిన ఈ మ్యాచ్‌.. ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ అద్వితీయ పోరాటంతో మరో రోజు ముందుగానే  ఫలితం తేలిపోయింది. ఆఖరి వికెట్‌పై గెలిచిన ఇంగ్లాండ్‌ సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 
*
ఆంటిగ్వా వేదికగా జరిగిన భారత్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు ఫలితం కూడా ఆసక్తికరంగా నాలుగు రోజుల్లోనే తేలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బుమ్రా నిప్పులు చెరిగే బంతులు విసిరి చూడచక్కని స్పెల్‌తో నాటి విండీస్‌ దిగ్గజాల చేత శభాష్‌ అనిపించుకున్నాడు. 
* కొలంబో వేదికగా న్యూజిలాండ్‌-శ్రీలంక రెండో టెస్టు కూడా ఇదే కోవలోకి వస్తుంది. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ ఐదు రోజులు సాగినా.. ఫలితం మాత్రం 275.4 ఓవర్లలోనే తేలడం ఇక్కడ చర్చించాల్సిన విషయం. కివీస్‌ తొలి ఇన్నింగ్‌లోనే భారీ స్కోరు సాధించి లంకను రెండు సార్లు ఆడించి ఇన్నింగ్‌ తేడాతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  

రెండేళ్లుగా ఇదే పంథా..

కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఫలితం నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది. ఆటగాళ్లు ఈ సుదీర్ఘ ఫార్మాట్‌ను సవాలుగా తీసుకుంటూ తమని తాము నిరూపించుకునేందుకు గొప్పగా పోరాడుతున్నారు. దీంతో ఫలితం కూడా ఒక రోజు ముందుగానే వస్తుండటం విశేషం. గణాంకాల పరంగా చూసుకుంటే.. 2018 ఆరంభం నుంచి మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో 40 మ్యాచ్‌ల ఫలితం నాలుగు రోజుల్లోనే తేలింది. అంటే దాదాపు 60శాతం మ్యాచ్‌లు ఒక రోజు ముందుగానే ముగిశాయన్నమాట. ఇక ప్రత్యేకించి 2019 విషయానికొస్తే ఈ ఏడాదిలో ఇప్పటివరకు 19 టెస్టులు జరిగితే వాటిలో 13 మ్యాచ్‌లు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. కేవలం 2018లో 48 టెస్టుల్లో 27 మ్యాచ్‌లు నాలుగు రోజుల్లోనే విజయఢంకా మోగించాయి. అంటే ఈ లెక్కన చూస్తే ప్రతి మూడింట రెండు మ్యాచ్‌లు ఫలితం ఒక రోజు కంటే ముందుగానే తేలిపోయినట్లు కదా. 
90ల్లో మాత్రం ఈ తంతు పూర్తి భిన్నంగా ఉండేది. ఎన్నో మ్యాచ్‌లు ఫలితం లేకుండానే సుదీర్ఘంగా ఐదు రోజులు సాగేవి. 1980-99 మధ్య కాలంలోనే అంతర్జాతీయంగా దాదాపు 613 టెస్టులు ఆడగా అందులో 169 మ్యాచ్‌ల్లోనే ఫలితం నాలుగు రోజుల్లో తేలింది. అంటే సగటున 3.6 మ్యాచ్‌ల ఫలితం మాత్రమే ఒక్కరోజు కన్నా ముందు తేలినట్లు లెక్క. కాలక్రమంలో ఈ టోర్నీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటూ దాని ప్రభావం ఫలితాలపై స్పష్టంగా కనిపించ సాగాయి. 


వాతావరణం పాత్ర కీలకమే.. ఐదు రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఫార్మాట్‌లో వాతావరణానిదీ కీలకపాత్రే. ఒక్కోసారి వెలుతురు లేమి, మరికొన్నిసార్లు వరుణుడి కారణంగా ఎన్నో మ్యాచ్‌ల్లో ఓవర్లు కుదించుకుపోయాయి. దీని ప్రభావమూ ఫలితంపైన ఉండేది. గత ఐదేళ్లుగా ఒక రోజులో సగటున 88 ఓవర్ల మ్యాచ్‌ మాత్రమే సాధ్యపడేది. ఈ లెక్కన ఫలితం నాలుగు రోజుల్లో తేలిందంటే ఆ మ్యాచ్‌లో కేవలం 352 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడిందన్నమాట. కొన్ని సందర్భాల్లో అంతకన్నా తక్కువ ఓవర్ల ఆట సాగిన సందర్భాలూ లేకపోలేదు. 2018 ఆరంభం నుంచి 49 మ్యాచ్‌ల్లో.. 352 ఓవర్ల కంటే ఎక్కువ ఆట సాధ్యపడలేదని గణాంకాలు ద్వారా తెలిసింది. అందులోనూ నాలుగింట మూడు మ్యాచ్‌ల ఫలితం ఒక రోజు ముందుగానే తేలింది.  


* ఈ ఏడాది జరిగిన 19 టెస్టుల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నాలుగు రోజుల కంటే ఎక్కువ సాగాయి. అందులో యాషెస్‌ తొలి టెస్టు ఒకటి కాగా, గాలే టెస్టు(న్యూజిలాండ్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు) మరొకటి.. ఇదిలా ఉండగా యాషెస్‌ రెండో టెస్టు మాత్రం ఐదు రోజులు సాగినా ఫలితం తేలకపోవడంతో డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో కేవలం 300 ఓవర్లు బౌలింగ్‌ మాత్రమే సాధ్యపడింది. మరొక్క సెషన్‌ ఆట సాధ్యపడినట్లయితే ఫలితం కచ్చితంగా వచ్చేదని క్రీడావిశ్లేషకుల అభిప్రాయం.  
ఆస్ట్రేలియాలో తప్ప..
అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా పిచ్‌లపై మినహాయిస్తే మిగతా అన్ని దేశాల్లోనూ టెస్టు క్రికెట్‌ ఫలితం దాదాపు నాలుగు రోజుల్లోనే వస్తున్నట్లు తెలుస్తోంది. ఆసీస్‌ పిచ్‌ల నుంచి సరైన సహకారం లేకపోవడం, అందులోనూ అవి ప్లాట్‌పిచ్‌లు కావడంలో ఫలితం కోసం ఐదో రోజు దాకా పోరాడాల్సిన పరిస్థితి.


ఆసక్తికరంగా టెస్టు ఛాంపియన్‌షిప్‌..
ఐదు రోజుల ఆటను మరింత ఆసక్తికరంగా మార్చడానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)ను మొదలుపెట్టింది ఐసీసీ. ద్వైపాక్షిక సిరీస్‌లు నిస్సారంగా మారి.. సుదీర్ఘ ఫార్మాట్‌ ఆసక్తి కోల్పోతున్న నేపథ్యంలో.. ప్రతి సిరీస్‌కు ఓ విలువ ఉండేందుకు ప్రతి మ్యాచ్‌ను మరింత అర్థవంతంగా, రసవత్తరంగా మార్చాలన్న ప్రణాళికలో భాగమే ఈ ఛాంపియన్‌షిప్‌. అన్ని జట్లకు ప్రతి సిరీస్‌ ముఖ్యమైంది. పాయింట్లపట్టికలో అగ్రస్థానంలో నిలవడానికి కచ్చితంగా ఫలితం కోసం ప్రతి జట్టూ గట్టిగా పోరాడాల్సిందే. దీని ప్రభావం కచ్చితంగా భవిష్యత్‌ టెస్టు ఫార్మాట్‌పైనా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నుంచి రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఫలితం నాలుగు రోజుల్లోనే తేలితే టెస్టు క్రికెట్‌లో మరో సరికొత్త విప్లవం వచ్చినట్లే. తక్కువ కాలంలోనే ఎక్కువ మ్యాచ్‌లకు ఆస్కారం ఉంటుంది. ఇకపై ప్రతి సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఈ పంథా ఇలాగే అప్రతిహతంగా సాగితే సుదీర్ఘ ఫార్మాట్‌కు ఢోకా లేనట్లే. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.