close

తాజా వార్తలు

‘ఆటో’.. ఈ పయనం ఎటో

విక్రయాలు మళ్లీ నేలచూపులే

దిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుతోంది. వరుసగా పదో నెల కూడా ప్రయాణ వాహనాల విక్రయాలు పడిపోయాయి. ఆగస్టు నెలలో కేవలం 1,96,524 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2018 ఆగస్టులో విక్రయమైన 2,87,198 యూనిట్లతో పోలిస్తే ఇది 31.57శాతం తక్కువ అని సొసైటీ ఆఫ్‌ ఇండియన్ ఆటోమొబైల్‌ మానుఫ్యాక్చరర్స్‌(సియామ్‌) వెల్లడించింది.

దేశీయ కార్ల విక్రయాల్లో 41.09శాతం క్షీణత నమోదైంది. 2018 ఆగస్టు నెలలో 1,96,847 కార్లు అమ్ముడవగా.. గత నెలలో ఇది 1,15,957 యూనిట్లకు పరిమితమైంది. మోటార్‌సైకిల్‌ విక్రయాలు 22.33శాతం తగ్గి 9,37,486 యూనిట్లకు పరిమితమయ్యాయి. ద్విచక్రవాహనాల అమ్మకాలు కూడా 22.24శాతం, కమర్షియల్‌ వాహనాల విక్రయాలు 38.71శాతం తగ్గాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా గత నెలలో 18,21,490 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 ఆగస్టులో విక్రయమైన 23,82,436 యూనిట్ల వాహనాలతో పోలిస్తే ఇది 23.55శాతం తక్కువ అని సియామ్‌ పేర్కొంది. 

గణనీయంగా పడిపోయిన ఉత్పత్తి..

గిరాకీ లేకపోవడంతో ఆటోమొబైల్‌ సంస్థల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ప్రత్యామ్నాయం లేక సంస్థలు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నాయి. సంక్షోభం కారణంగా ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆటోమొబైల్‌ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. గత నెల కేవలం 2,77,432 ప్రయాణికుల వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేశారు. 2018 ఆగస్టులో 3,67,094 ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి చేయగా.. ఈ ఏడాది 24.42శాతం క్షీణత నమోదైంది. ఇక ద్విచక్రవాహనాల ఉత్పత్తి 17.08శాతం తగ్గింది. 1997-98 తర్వాత ఆటోమొబైల్‌ రంగంలో ఇలాంటి సంక్షోభం నెలకొనడం మళ్లీ ఇప్పుడే.

జీఎస్‌టీ తగ్గింపుపై కొరవడిన ఆశ..

ఆటోరంగాన్ని కాపాడాలంటే వాహనాలపై వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ ఉత్పత్తులపై 28శాతం జీఎస్‌టీ ఉంది. దీన్ని 18శాతానికి తగ్గించాలని సంస్థలు కోరుతున్నాయి. వాహనాలపై జీఎస్‌టీ తగ్గితేనైనా విక్రయాలు పెరగొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నెల 20న జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో దీన్ని అజెండాగా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి. 

అయితే ఇందుకు రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్‌టీ తగ్గింపుతో ఆదాయం భారీగా తగ్గే ప్రమాదం ఉన్నందున ఈ ప్రతిపాదనకు రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశాలు కన్పించట్లేదు. జీఎస్‌టీని తగ్గించడం వల్ల అమ్మకాలు పెరిగినా.. పన్ను వసూళ్లు దాదాపు రూ. 20వేల కోట్లకు పైనే తగ్గుతాయని ఇటీవల ఫిట్‌మెంట్‌ కమిటీ కూడా అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలపై జీఎస్‌టీ తగ్గింపుపై ఆశలు దాదాపు కొరవడినట్లే. దీంతో ఆటోమొబైల్‌ సంక్షోభం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. మరి ఈ సంక్షోభం ఇంకెన్నాళ్లో.. ఆటోమొబైల్‌ దారెటో..!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.