close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కోడెలది ఆత్మహత్యే!

తెదేపా సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మృతిపై పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. మెడ భాగంలో 8 అంగుళాల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మానసిక క్షోభతోనే కోడెల మృతి:చంద్రబాబు

కోడెల శివప్రసాదరావు మృతిని జీర్ణించుకోలేకపోయానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన మృతి వార్త తన మనసు కలిచివేస్తోందని చెప్పారు. కోడెల చాలా మానసిక క్షోభను అనుభవించారని.. వైకాపా ప్రభుత్వం వేధింపులతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కోడెలకు భయమంటే ఏంటో తెలియదని.. వైకాపా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి అవమానాలకు గురిచేస్తుందోననే అనుమానంతోనే ఆయన మృతిచెందారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గాయపడిన వారికి రూ.3లక్షలు: సీఎం

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం కింద రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి లక్ష రూపాయలు చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు కోడెల పార్థివదేహం

తెదేపా సీనియర్‌ నేత, మాజీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పార్థివదేహం ఎన్టీఆర్‌ భవన్‌కు తీసుకొచ్చారు. తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఉదయం వరకు ఆయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు. ఇప్పటికే అక్కడికి భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ తదితరులు ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకుని కోడెలకు నివాళులర్పించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెట్రోల్‌ ధరలకు డ్రోన్‌ దాడి సెగ

సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై ప్రభావం చూపించే అవకాశముంది. డ్రోన్‌ దాడి తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 10శాతానికి పైగా పెరిగాయి. దీంతో భారత రిటైల్‌ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న 15 రోజుల్లో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ. 5-6 చొప్పున పెరిగే అవకాశమున్నట్లు కొటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీ అంచనా వేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పీపీఏలపై ట్రైబ్యునల్‌లో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో పీపీఏల రద్దు అంశంపై విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. పీపీఏలను రద్దును సవాలు చేస్తూ అనంతపురం, కడప సోలార్ ప్లాంట్లలో పెట్టుబడులు పెట్టిన అయన, స్ఫ్రాంగ్, ఎస్బీ ఎనర్జీకి చెందిన ఆరు కంపెనీలు పిటిషన్లు వేశాయి. తమ పీపీఏలను రద్దు చేయకుండా చూడాలని తమ పిటిషన్‌లో కోరాయి. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్‌.. డిస్కమ్‌ల అడాప్షన్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఏపీఈఆర్సీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 5కి ట్రైబ్యునల్‌ వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయ్‌

గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పొదుపు జమలు దాదాపు రూ. 4లక్షల కోట్లు పెరిగాయట. ఈ మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడైంది. 2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కమర్షియల్‌ బ్యాంకుల్లో(విదేశీ బ్యాంకులు కలిపి) మొత్తం సేవింగ్స్‌ డిపాజిట్లు రూ. 36.55లక్షల కోట్లుగా ఉండగా.. మార్చి 31, 2019 నాటికి అవి రూ. 40.31లక్షల కోట్లకు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. స్మిత్‌దే టాప్‌.. కోహ్లీకి నో ఛాన్స్‌!

ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యాషెష్ టెస్టు సిరీస్ ముగిసిన సందర్భంగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద పారించిన స్మిత్‌ 937 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 903 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌×పాక్‌ రికార్డు: 27 కోట్ల వ్యూయర్‌షిప్‌

ఇంగ్లాండ్‌లో నిర్వహించిన 2019 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ వ్యూయర్‌షిప్‌ రికార్డులు బద్దలు కొట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయంగా ప్రత్యక్ష వీక్షకుల సంచిత (క్యుములేటివ్‌) సగటు 160 కోట్లుగా నమోదైంది. హాట్‌స్టార్‌ వంటి డిజిటల్‌ వేదికల్లో భారత్‌లో ఎక్కువగా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. టీవీల్లో భారత్‌×పాక్‌ పోరును 27.3 కోట్ల యునిక్‌ వ్యూయర్స్‌ చూశారని ఐసీసీ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సెలబ్రిటీస్‌ బెడ్‌ టైం స్టోరీస్‌తో మంచు లక్ష్మి

సినీ సెలబ్రిటీస్‌ అంటే ఇష్టపడని వారుండరు. అయితే తమ అభిమాన నటీనటుల లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పగటిపూట వారు ఏం చేస్తుంటారో చాలావరకూ తెలిసిపోతుంటుంది. కానీ వారి నైట్‌ లైఫ్‌ ఎలాంటుందో అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరుస్తారు. సెలబ్రిటీల నైట్‌లైఫ్‌ను చూపించేందుకు త్వరలో తెలుగులో ఓ షో ప్రారంభం కానుంది. వయాకామ్‌18 వాళ్లు నిర్వహిస్తోన్న ఈ షోకి మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.