close

తాజా వార్తలు

దేశచరిత్రలో ఇలాంటి ఘటన చూడలేదు: బాబు

హైదరాబాద్‌: ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి లాంటి ఘటన దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడలేదని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్‌గా పని చేసిన వ్యక్తికి ఇలాంటి మరణం బాధాకరమన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఉన్న కోడెల శివప్రసాద్‌ పార్థివదేహానికి చంద్రబాబునాయుడు ఈ రోజు ఉదయం నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పార్టీలో, కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇన్ని అవమానాలు భరించిన తర్వాత నేను బతకడం నిష్ప్రయోజనం అని, ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఏం చేయలేరని భావించే కోడెల ఈ దురాఘతానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్‌ దగ్గరి నుంచి డీజీపీ వరకు ఆయనపై వేసిన కేసుల విషయంలో నిస్సహాయులైపోయారు’’ అని చంద్రబాబు అన్నారు. కోడెల అంటే పల్నాడు పులి అని.. 40ఏళ్లుగా ఆయనతో కలిసి చాలా సమస్యలపై పోరాడానని గుర్తుచేసుకున్నారు. 

ఈ సందర్భంగా కోడెలపై నమోదైన  కేసుల్ని ప్రస్తావించారు. గతంలో ఏపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన పోసాని వెంకటేశ్వర్లు ద్వారా కేసుల వివరాలన్నీ తెలుసుకున్నానన్నారు. కోడెలపై ఉన్న కేసుల్ని ఆయన డీల్‌ చేస్తున్నారని తెలిపారు. తాను నిర్దోషినని నిరూపించుకోవడం కోసం కోడెల అనేక ప్రయత్నాలు చేశారని దానికి పార్టీ ఆయనకు అండగా నిలిచిందన్నారు. ఐదు కోట్ల మంది ఏపీ ప్రజలకు, తెలుగు జాతికి, భారతదేశం మొత్తానికి వాస్తవాలు తెలియజేయాలనే మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు. 

భారతదేశ చరిత్రలో ఇలాంటి కేసులో ఒక సీనియర్‌ నాయకుడు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి జీవితం ఇలా ముగియడం తనని కలచివేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి గల కారణాలు తెలుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేధించి, అవమానించి, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బాధించడం వల్ల ఓ గొప్ప నాయకుడు మరణించడం క్షమించరాని నేరమన్నారు. తప్పులు చేసి కూడా తప్పించుకుంటున్న ఈ కాలంలో ఓ చిన్న కేసులో ఇరికించి దాని ఆధారంగా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారన్నారు. వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితికి తీసుకువచ్చి ఆయన్ని ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకువెళ్లారన్నారు. 

ఈ సందర్భంగా కోడెలపై ఉన్న ఫర్నీచర్‌ కేసును ప్రస్తావించారు. కేసుకి సంబంధించి పూర్తి వివరాలు మీడియాకు వివరించారు. జూన్‌ 7న కార్యదర్శికి కోడెల లేఖ రాశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ నుంచి ఫర్నీచర్‌ను తన క్యాంప్‌ కార్యాలయానికి తరలించామని.. ప్రభుత్వం మారిన సందర్భంగా పాత ఫర్నీచర్‌ స్థానంలో కొత్తది కొనుగోలు చేయడానికి కావాల్సిన మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నట్లు చదివి వినిపించారు. 20 ఆగస్టు 2019న స్పీకర్‌కి రాసిన లేఖలోనూ ఫర్నీచర్‌ సహా ఎలక్ట్రానిక్స్‌కి అయిన ఖర్చు వివరాలు తెలియజేయాలని సదరు మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాని మరో లేఖ రాసినట్లు గుర్తుచేశారు. దానిపై ప్రస్తుత స్పీకర్‌ అక్‌నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఉందని లేఖను చంద్రబాబు చూపించారు. కార్యదర్శి కనీసం సంతకం కూడా చేయలేదని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దారుణంగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

20న కోడెల లేఖ రాస్తే 22న నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి పోలీసులకు ఫర్నీచర్‌పై ఫిర్యాదు చేశారన్నారు. 23న పోలీసులు కోడెల ఇంటి పరిసరాల్లో తనిఖీలు చేశారన్నారు. అనంతరం ‘మాజీ స్పీకర్‌కి చెందిన కొంత మంది వ్యక్తులు అనధికారికంగా ఫర్నీచర్‌ని తరలించిన’ట్లు 24న పోలీసులకు కార్యదర్శి ఫిర్యాదు చేశారన్నారు. వీటి ఆధారంగా ఐపీసీ 409, 411 కింద తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో అదే రోజు కేసు నమోదు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఇలా రూ.లక్ష లేదా రూ.రెండు లక్షలు ఉండే ఫర్నీచర్‌కు సంబంధించి రూ.వేల కోట్ల అవినీతిలో నిందితుడుగా ఉన్న ఓ ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం కేసు పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. జీవితాంతం కోడెలను జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.