close

తాజా వార్తలు

వ్యాపకమే వ్యాపారమైంది

ఉపాధి, ఉద్యోగం...ఏదైనా చదివిన చదువుకి తగ్గవే ఎంచుకోవాలన్నది పాత మాట... అభిరుచి, సృజన ఉంటే... రంగం ఏదైనా దూసుకుపోవచ్చనేది నేటి యువతరం బాట. ఎంఫార్మసీ చదివినా... మొక్కలంటే ఆసక్తితో గ్రీన్‌ట్విగ్స్‌ పేరుతో అర్బన్‌ గార్డెన్‌ అవసరాలను తీరుస్తోంది విశాఖపట్నానికి చెందిన ఇరవై ఆరేళ్ల రావిపాటి కుముద. పచ్చని కానుకలతో ప్రయాణం మొదలుపెట్టి... బడాబడా కార్పొరేట్‌ సంస్థలకు సైతం సేవలు అందిస్తోంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
ఆసక్తిని అభిరుచిగా మార్చుకోవచ్చు. ఆలోచిస్తే...అదే అద్భుతమైన వ్యాపార మార్గం కావొచ్చు. ఇవన్నీ చేయాలంటే ముందు సవాళ్లను అందిపుచ్చుకోగల ధైర్యం ఉండాలి. నేను చదివిన చదువుకీ ఇప్పుడు చేస్తోన్న వ్యాపారానికీ ఏం సంబంధం లేదు. మరెందుకు ఇలా వచ్చానని అంటారా... మాది విశాఖపట్నం. నాన్న నేవీలో అధికారిగా పనిచేశారు. అమ్మ న్యూట్రిషన్‌ పూర్తి చేసి పండ్ల గుజ్జుని ప్రాసెసింగ్‌ చేసే సంస్థను నిర్వహించేవారు. నేను సొంతంగా జీఆర్‌ఈ, టోఫెల్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పించే విద్యాసంస్థను నడిపేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచీ మొక్కల పెంపకం అంటే ఆసక్తి ఎక్కువ. ఇంట్లోనే సహజంగా ఎరువు తయారు చేసుకుని కూరగాయల్ని పండించేదాన్ని. వాటితో పాటు ఇతర మొక్కలు కలిపి సుమారు ఐదువందల వరకు ఉండేవి. కంటైనర్‌ తోటలు, మినియేచర్‌ గార్డెన్‌, గిఫ్టింగ్‌ ప్లాంట్స్‌ వంటివన్నీ సరదాగా తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మేదాన్ని.
  తుపాను మార్చేసింది...
సముద్ర తీరప్రాంతంలో ఉన్న వైజాగ్‌కి తుపాన్ల తాకిడి ఎక్కువే. హుద్‌హుద్‌ సైక్లోన్‌ తరువాత వైజాగ్‌ పూర్తిగా మారిపోయింది. పచ్చదనం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మా ఇంట్లోని మొక్కలన్నీ పాడైపోయాయి. చాలా రోజులు అవి గుర్తొచ్చి బాధనిపించేది. ఆ సమయంలో నగరంలో మొక్కల పెంపకంపై చాలా స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పనిచేశాయి. నేనూ వాటిల్లో వాలంటీర్‌గా పనిచేశా. అవగాహన కల్పించినా...మొక్కలు అందుబాటులో లేని పరిస్థితి నన్ను ఆలోచింపచేసింది. దాంతో అర్బన్‌ ఫార్మింగ్‌, గార్డెనింగ్‌లపై పనిచేయాలనే నిర్ణయానికి వచ్చా. అమ్మానాన్నలతో నా ఆలోచన చెబితే... నీకు నచ్చింది చేయి అంటూ ప్రోత్సహించారు. అలా 2014లో గ్రీన్‌ట్విగ్స్‌ పేరుతో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించా.
పదివేల పెట్టుబడితో...
అప్పటివరకు సంపాదించుకున్న మొత్తంలో సుమారు పదివేల రూపాయలను పెట్టుబడిగా ఎంచుకుని అడుగులు వేశా. వివిధ రకాల మొక్కల్ని సేకరించి ప్లాంట్‌ బొతిక్‌ని ఏర్పాటు చేశా. గూగుల్‌, క్వికర్‌లలో ప్రకటనలు వచ్చేలా మార్కెటింగ్‌ మెలకువలు పాటించా. నేను క్వికర్‌లో అమ్మకానికి పెట్టిన కలర్‌ కాక్టస్‌ చూసిన ఓ పెద్దాయన నన్ను సంప్రదించారు. వాళ్లు అపార్ట్‌మెంట్‌లో ఉంటారనీ, వాళ్ల బాల్కనీని మొక్కలతో అందంగా తీర్చిదిద్దమని అడిగారు. ఇందుకోసం ఆయన తన బడ్జెట్‌ చెప్పి... యాభైవేల రూపాయల్ని ఇచ్చారు. ఆశ్చర్యపోయా. ఆ అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు. ఎందుకంటే... నా ప్రతిభ, సృజన నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశం అది. పదిరోజుల్లోనే దాన్ని అందంగా మార్చేశా.  

విస్తరించుకున్నా...!
అది మొదలు ఒకరి నుంచి మరొకరికి నోటిమాట ద్వారా తెలిసి ఒక్కొక్కరు సంప్రదించడం మొదలుపెట్టారు. నేనూ క్రమంగా మరింత పెట్టుబడి పెడుతూ మా కార్యక్రమాలను విస్తరించా. వ్యక్తిగత గృహసముదాయాలు, అపార్ట్‌మెంట్‌లు, పాలీహౌస్‌లు, కిచెన్‌, టెర్రస్‌ గార్డెన్‌లు, కార్పొరేట్‌ ల్యాండ్‌స్కేపింగ్‌లు ఇలా ఒకటేమిటి... అర్బన్‌ గార్డెనింగ్‌ అవసరాలన్నీ తీర్చడం ప్రారభించాం. నర్సరీ పరిమాణాన్ని పెంచి మట్టి, ఎరువులు, వాటిని పెంచేందుకు అవసరమైన పరికరాలు, కుండీలు, ఇతర అలంకరణ వస్తువులు...అన్నీ అందుబాటులో ఉంచడం ప్రారంభించా. ఒక్కమాటలో చెప్పాలంటే....పచ్చటి తోటల్ని ప్రేమించే ఎవరికైనా మా గ్రీన్‌ట్విగ్స్‌... వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌.
ప్రాజెక్టుని బట్టే...
వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మా ప్రణాళిక రూపొందిస్తాం. ఆ తరువాత ఎంత ఖర్చవుతుందని చెబుతాం. అందుకున్న ప్రాజెక్ట్‌ని పూర్తి చేయడానికి రెండు నుంచి నెలరోజుల వరకు సమయం తీసుకుంటాం. అది పూర్తయ్యాక...నెల రోజుల వరకు ఆ మొక్కలు, ల్యాండ్‌ స్కేపింగ్‌ స్థితిని గమనిస్తూ అవసరమైన మార్పులు చేస్తాం. మొక్క తీరు తెన్నులను ముందే వారికి తెలిపి... తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించి పర్యవేక్షిస్తుంటాం. పనితీరుని బట్టే...ప్రాజెక్టులు వచ్చేవి. నా వయసు, అనుభవం వంటివి చూడకుండానే... బడా సంస్థలు అవకాశాల్ని కల్పించాయి. అలా వైజాగ్‌లోని పామ్‌బీచ్‌, మంత్రీస్‌ వంటి హోటళ్లు, ర్యాడిసా కాఫీ షాపు వంటివెన్నో ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఆప్టిమస్‌ డ్రగ్స్‌ వంటి సంస్థలు, మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థా నా ఖాతాదారే. ఇవే కాదు... చెన్నై, విజయవాడల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాం. మేం సాధారణంగా సేంద్రియ ఎరువుల్నే వాడతాం.  ఇవి కాస్త ఖరీదు ఎక్కువ. రోజువారీ పనికోసం ప్రాజెక్ట్‌ని బట్టి ఇరవై నుంచి నలభైమంది పనిచేస్తారు. వీరుకాక శాశ్వత ప్రాతిపదికన మరో నలుగురు ఉద్యోగులు ఉన్నారు.

ఇబ్బందులున్నా...
వ్యాపారం అన్నాక ఒడిదొడుకులు సహజం. అలాగని చిన్న చిన్న సమస్యలకే వెనుదిరిగే తత్వం నాది కాదు. బ్యాంకుల నుంచి తగిన ఆర్థిక సాయం అందక మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా. క్రమంగా రొటేషన్‌ చేసుకుంటూ విస్తరించుకోగలిగా. ఈ పని ఎక్కడెక్కడో జరుగుతుంటుంది. ఆ సమయానికి కూలీల అవసరం ఉంటుంది. వారిని వెతుక్కోవడం కాస్త కష్టమైన విషయమే. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం మాటల్లో చెప్పినంత సులువేం కాదు. ఇవికాక కొందరు పనులు చేయించుకుంటారు... తీరా డబ్బులు ఇచ్చే సమయానికి రేపు, ఎల్లుండి అని తిప్పుతుంటారు. వ్యాపారం చేస్తున్నప్పుడు... ఇలాంటివారూ ఉంటారని అర్థంచేసుకున్నా. ఈ బిజినెస్‌లో ఉన్న మరో ఇబ్బంది రవాణా నష్టం. ఒక చోట నుంచి మరో చోటకి మొక్కల్ని మార్చే క్రమంలో, మరికొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పెద్ద ఎత్తున మొక్కలు, వాటికి సంబంధించిన వస్తువులు పాడైపోతుంటాయి. వీటన్నింటినీ క్రమంగా అధిగమిస్తూనే ప్రస్తుతం ఏటా డెబ్భైలక్షల రూపాయల టర్నోవర్‌ అందుకుంటున్నా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.