
తాజా వార్తలు
‘బహుముఖేశుడి’గా ఎదిగిన వైనం..
వ్యూహాత్మకం.. వ్యాపార వైవిధ్యం
ఇంటర్నెట్‌డెస్క్ ప్ర్యతేకం: స్టాక్ మార్కెట్లలో మదుపరుల నమ్మకాన్ని ఇప్పటి వరకు వమ్ముచేయని స్టాక్ ఏదైనా ఉందంటే.. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే చెప్పాలి. 2009-17 మధ్యలో దాదాపు ఏడేళ్లపాటు ఈ స్టాక్ రూ.350-రూ.550 మధ్యే ట్రేడ్ అయింది. అయినా ముఖేశుడిపై నమ్మకంతో చాలా మంది మదుపరులు ఈ షేరును అంటిపెట్టుకొని ఉన్నారు. తనను నమ్మిన ఫలితాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులకు అందజేసింది. ఒక సంస్థ విజయవంతంగా వ్యాపార వైవిధ్యాన్ని సాధించే క్రమంలో ఎలా ఎదుగుతుందనేదానికి రిలయన్స్ నిలువెత్తు ఉదాహరణ. ఫలితంగా ఇప్పుడా షేరు రూ.1254 వద్ద ట్రేడవుతోంది. ఒక ప్రధాన రంగంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న రంగాలను కూడా దున్నేయడం ముఖేశ్ అంబానీ స్టైల్. వాస్తవానికి ఇది ఆయన రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ నుంచి పుణికిపుచ్చుకున్న లక్షణం. ఒక రకంగా కార్పొరేట్ రంగంలో అశ్వమేధయాగం వంటిది ఇది.
జియోకు మూలం..
ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత 2006లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన పెట్రోకెమికల్ వ్యాపారం ముఖేశ్ చేతికి వచ్చింది. కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, ఇన్ఫ్రా, పవర్ సంబంధించిన వ్యాపారాలు అనిల్ చేతికి వెళ్లాయి. ఈ క్రమంలో నియమిత కాల పరిమితి వరకు ఒకరి వ్యాపార రంగాల్లో మరొకరు రాకూడదని కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్ఎన్ఆర్ఎల్కు గ్యాస్ సరఫరా ధరల విషయంలో సోదరుల మధ్య వివాదం చెలరేగింది. ఇది సుప్రీం కోర్టుకు చేరింది. 2010లో ఈ కేసును ముఖేశ్ గెలిచారు. 2010లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ అనే ఒక చిన్న సంస్థ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ వేలంలో సత్తా చాటింది. పలు సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్‌ను సొంతం చేసుకొంది. అదే సమయంలో అంబానీ సోదరులిద్దరు ఒక్క గ్యాస్ ఆధారిత పవర్ రంగం మినహా మిగిలిన వాటిపై ఉన్న కుటుంబ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు టెలికామ్ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభించగా.. అడాగ్‌కు పెట్రో రిఫైనరీలోకి అడుగు పెట్టే అవకాశం లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంటనే ఇన్ఫోటెల్లో 95శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ‘డేటా కొత్తతరం ఇంధనం’ అన్న విషయాన్ని ముఖేశుడు అప్పట్లోనే గుర్తించినట్లు ఈ చర్య చెబుతుంది. 2013 బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ కంపెనీలు వాయిస్ సేవలు కూడా అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది రిలయన్స్‌కు వరంగా మరింది. ఆ తర్వాత 2016లో ప్రారంభించిన జియో భారత డేటా సేవల రంగాన్నే మార్చేసింది.
సుదీర్ఘ ఎదురు చూపులు..
తొలుత విస్తరించు.. తర్వాత లాభాలను ఆస్వాదించు అన్నట్లు సాగింది రిలయన్స్ రిటైల్ ప్రస్థానం. 2006లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ తొలుత విస్తరణపై దృష్టిపెట్టింది. 2013 వరకు ఈ సంస్థ లాభాలను సాధించలేదు. అయినా ఆయనపై ఇన్వెస్టర్లు నమ్మకాన్ని వదులుకోలేదు. లాభాల్లోకి వచ్చాక విస్తరణను రాకెట్ స్పీడ్‌తో చేపట్టింది. ఫలితంగా దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్‌గా ఆవిర్భవించింది. 2015 సంవత్సరంలో 2,621 ఉన్న స్టోర్లు 2019 మార్చినాటికి 10,400 మార్కును దాటేశాయి. ఇక లాభాలు రూ.118 కోట్ల నుంచి రూ.5,500 కోట్లను మించిపోయాయి. రిలయన్స్ ట్రెండ్స్, ఫ్రెష్, ఫుట్ ప్రింట్, డిజిటల్, జ్యువెల్, సూపర్, మార్ట్ , ఆటోజోన్, వెల్నెస్ బ్రాండ్లతో ఈ విభాగం విస్తరించింది.
కాంబినేషన్స్ అదుర్స్..
రిలయన్స్ తన అనుబంధ వ్యాపారాలను అద్భుతంగా వినియోగించుకుంటోంది. రిలయన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. జియో వచ్చిన కొత్తల్లో రిలయన్స్ డిజిటల్ ఊతకర్రలాగా పనిచేసింది. ఇలాంటివి ఒక్క పక్కా ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు అనుకొని చేయడం సాధ్యం కాదు. ఏది ముందు.. ఏది తర్వాత మార్కెట్లోకి రావాలనే అంశాలపై పట్టు ఉండాలి. రిలయన్స్ వ్యాపార శైలిలో ఇది కచ్చితంగా కనిపిస్తుంది. భారత్ రిటైల్ రంగంలో పట్టు బిగించాక.. టెలికామ్ రంగంలోకి వచ్చింది.. డేటా మార్కెట్లో తిరుగు లేని ఆధిపత్యం సంపాదించాక ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. దీంతోపాటు కస్టమర్లు ఆన్లైన్లో సెర్చ్ చేసి ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసే విధంగా వ్యాపార వ్యూహాన్ని సిద్ధం చేసింది. రిలయన్స్ రిటైల్‌తోపాటు స్థానిక విక్రేతలను కూడా భాగస్వాములుగా చేయనుండటంతో మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోయే అవకాశం దీనికి లభించింది. ఈ క్రమంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో తలపడేందుకు సిద్ధమైపోయింది. ఇక ప్రధాన వ్యాపారమైన రిఫైనింగ్, పెట్రో కెమికల్స్‌కు అనుబంధంగా రిటైల్ పెట్రోల్ పంపులను విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకోసం బ్రిటిష్ పెట్రోలియంతో జట్టుకట్టింది.
కొనుగోళ్లకు వెనుకాడని వైనం..
రిలయన్స్ డిజిటల్, మీడియా మార్కెట్లో బలపడటం కోసం భారీగా కంపెనీల కొనుగోళ్లకు తెరతీసింది. ఈ క్రమంలో నెట్వర్క్ 18, కలర్స్, వైకామ్, మనీకంట్రోల్ వంటి ఛానళ్లను సొంతం చేసుకొంది. దీంతోపాటు బాలాజీ టెలిఫిల్మ్ వంటి హిందీ దిగ్గజ నిర్మాణ సంస్థను ఒడిసిపట్టింది. హాత్వే కేబుల్స్, డెన్ నెట్వర్క్స్, డేటాకామ్ వంటి కేబుల్ సంస్థలు రిలయన్స్ గూటికి చేరాయి. ఇవి దేశంలోని మారుమూల ప్రాంతానికి రిలయన్స్‌ను చేర్చాయి. ఈ వ్యాపారం ఇంకా విస్తరణ దశలో ఉండటంతో స్వల్పనష్టాల్లో ఉంది. రిలయన్స్ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు ఇవన్ని మంచి వేదికగా నిలుస్తాయి.
అసలు ఈ వ్యాపార వైవిధ్యం దేనికి..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయాల్లో సింహభాగం ఇప్పటికీ పెట్రోకెమికల్, చమురు శుద్ధి వ్యాపారం నుంచే లభిస్తోంది. కానీ, చమురు మార్కెట్లలో, వినియోగంలో పరిస్థితులు వేగంగా మారుతుండటంతో కంపెనీ ఆదాయ మార్గాలు దెబ్బతినకుండా వివిధ రకాల వ్యాపారాలపై కూడా దృష్టిపెట్టింది. 2019 జూన్ త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయంలో 32శాతం కన్జ్యూమర్ బిజినెస్ నుంచే లభించింది. కొన్నేళ్ల క్రితం ఈ మొత్తం 10శాతం లోపు మాత్రమే ఉండేది. అంటే రిలయన్స్ ఆదాయం కోసం కేవలం చమురు వ్యాపారంపై మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటపడుతోందని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య నిర్మూలన కోసం వాహనాల్లో చమురు వినియోగాన్ని తగ్గించి విద్యుత్తు వినియోగంపై దృష్టిపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే సరికి రిలయన్స్‌కు డేటా, రిటైల్ వంటి ఇతర రంగాల నుంచి ప్రధాన ఆదాయం లభించడం మొదలవుతుంది. ఇటీవల జూన్ త్రైమాసికంలో హైడ్రోకార్బన్ల వ్యాపారం కొంత ఒత్తిడికి లోనైనా.. రిటైల్, ఇతర వ్యాపారాలు దానిని ఆదుకొన్నాయి.
అలాగని ప్రధాన ఆదాయ వనరైన హైడ్రోకార్బన్ల వ్యాపారాన్ని రిలయన్స్ ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తన చమురు, గ్యాస్ శుద్ధి కర్మాగారాలను అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫలితంగా ఇప్పుడు రిలయన్స్ వద్ద ప్రపంచలోనే అతిపెద్ద శుద్ధికర్మాగారాలు ఉన్నాయి. సౌదీ ఆరాం కో వంటి దిగ్గజానికి 20శాతం వాటాలను విక్రయించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇవ్వడంతో ఈ రంగంలో రిలయన్స్ తిరుగులేని శక్తిగా నిలిచింది. తాజాగా ఆరాంకో నుంచి వచ్చే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రిలయన్స్ రుణభారం కూడా తగ్గనుంది. మరో 18నెలల్లో అప్పులేని కంపెనీగా ఎదిగేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాటా మూలధనంపైనే అధికంగా వ్యాపారం చేయాలని.. అప్పులపై ఆధారపడకూడదనే రిలయన్స్ సిద్ధాంతానికి ఈ చర్య ఊతం ఇస్తుంది. గత కొన్నేళ్లుగా వ్యాపార విస్తరణకు రిలయన్స్ దాదాపు రూ.5.4లక్షల కోట్లను వెచ్చించింది. ఒక్క టెలికం రంగంలోనే రూ.3.5లక్షల కోట్లను వెచ్చించింది. ఈ ఫలాలు ఇప్పుడు రిలయన్స్‌కు అందడం మొదలైంది. ముఖేశ్ ముందుచూపుతో రిలయన్స్ భారత కార్పొరేట్ రంగంలో దార్శనికతకు నిలువుటద్దంగా నిలుస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
