close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. పాక్‌ మళ్లీ ఆ తప్పు చేయదనుకుంటున్నా

ఆర్టికల్‌ 370 రద్దుపై 67 శాతం జమ్మూకశ్మీర్‌ ప్రజలు సానుకూలంగా ఉన్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. బిహార్‌ రాజధాని పట్నాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాక్‌ ఎగదోసిన ఏ ఒక్క ఉగ్రవాదినీ విడిచిపెట్టేది లేదని రాజ్‌నాథ్‌ స్పష్టంచేశారు. 1965, 1971లో చేసిన పొరబాట్లను పాక్‌ మళ్లీ చేయదని ఆశిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. రేపు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌, జగన్‌ భేటీ

గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు సహా విభజనాంశాలపై సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమవుతారు. ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ముగిసిన శివప్రసాద్‌ అంత్యక్రియలు

అనారోగ్యంతో మృతిచెందిన తెదేపా నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తిరుపతి ఎన్జీవో కాలనీ నుంచి చంద్రగిరి సమీపంలోని అగరాల వరకు సాగిన అంతిమయాత్రలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ రీతిలో శివప్రసాద్‌ భౌతికకాయాన్ని ఖననం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ పెచ్చులూడిపడి యువతి మృతి

అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ ఆవరణలో ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రోస్టేషన్‌ పెచ్చులూడి పడడంతో మౌనిక కంతాల (24) అనే యువతి మృతిచెందారు. వర్షం కారణంగా మెట్రోస్టేషన్‌ కింద నిరీక్షిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతురాలిని కేబీహెచ్‌బీ వాసిగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బోటు వెలికితీతకు సాయమందిస్తాం:కిషన్‌రెడ్డి

బోటు ప్రమాదాలు జరక్కుండా ఇకపై పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కుచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై రాజమహేంద్రవరంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బోటు వెలికితీతకు కేంద్రం తగిన సాంకేతిక సహకారం అందిస్తుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

పోలీసు కానిస్టేబుల్‌ నియామక పరీక్షల మెరిట్‌ జాబితాను, కటాఫ్‌ మార్కులను తక్షణమే ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ మేరకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షలో ఉత్తీర్ణులైన 90వేల మంది అభ్యర్థులు మెరిట్‌ జాబితా, కటాఫ్‌ మార్కుల కోసం వేచి చూస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. డప్పులు, నృత్యాలతో సందడిగా స్టేడియం

‘హౌడీ మోదీ’ కార్యక్రమం జరగబోయే హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ప్రాంగణం కోలాహలంగా మారింది. మరికొద్ది సేపట్లో కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేడియం బయట భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగితేలారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. ‘భారత్‌ మాతాకీ జై’, ‘జైహింద్‌’, ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కాల్వలోకి కారు: కడుపులో బిడ్డతో సహా నిండు గర్భిణి మృతి

ఖమ్మం జిల్లా గొల్లగూడెం వద్ద ఓ కారు సాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లింది. కారు రివర్స్‌ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిండు గర్భిణితో పాటు మరో మహిళ మృతి చెందారు. గర్భిణి మృతి చెందినప్పటికీ ఆమె కడుపులోని బిడ్డ మాత్రం బతికున్నాడనే విషయం తెలుసుకుని వైద్యులు హుటాహుటిన శస్త్రచికిత్స చేశారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. హెల్మెట్‌ లేకపోతే.. పెట్రోల్ పోసేది లేదు..!

ప్రజలు హెల్మెట్‌ ధరించి వాహనాలు నడిపే విధంగా కర్ణాటకలోని కలబురగి కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘నో హెల్మెట్‌-నో పెట్రోల్‌’ అనే కొత్త నిబంధన అమల్లోకి తేనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక నుంచి హెల్మెట్‌ లేకుండా నడిపితే వాహనదారులకు పెట్రోల్‌ లభించదంటూ హెచ్చరించారు. ఈ మేరకు అన్ని పెట్రోల్‌ బంక్‌లకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ధోనీ అభిమానులకు చేదు వార్త!

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సెలక్షన్‌ కమిటీకి నవంబర్‌ వరకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం పలికిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన అతడు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. సెప్టెంబర్‌ 24 నుంచి జరగనున్న విజయ్‌ హజారే ట్రోఫీ, నవంబర్‌లో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌ సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.