close

తాజా వార్తలు

పంత్‌కు తెలుగోడి సెగ

కోహ్లీసేన తలుపులు తడుతున్న విశాఖ కుర్రోడు

సుదీర్ఘ ఫార్మాట్లో పంత్‌కు సరైన ప్రత్యామ్నాయంగా కేఎస్‌ భరత్‌

త్వరలోనే టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తానని ‘భరత్‌ అనే నేను హామీ ఇస్తున్నాను’ అంటూ ఈ విశాఖ కుర్రోడు శపథం చేస్తున్నాడు. ఆటే స్ఫూర్తిగా అత్యుత్తమంగా ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. సాహా అర్ధశతకం చేసినా పంత్‌ శతకం బాదినా ఇబ్బందేమీ లేదంటున్నాడు. 150 పరుగులు చేసి వారికి ఆరోగ్యకరమైన పోటీనిస్తా అంటున్నాడు. చిన్ననాటి కోచ్‌ జే కృష్ణారావు మార్గనిర్దేశంలో ‘ఎమ్మెస్కే అన్న’ పర్యవేక్షణలో ఎదుగుతున్న యువ ఆటగాడే కోన శ్రీకర్‌ భరత్‌. దేశవాళీ, భారత్‌-ఏ మ్యాచుల్లో అలవోకగా శతకాలు బాదేస్తూ వికెట్‌ కీపింగ్‌లో మెరుస్తున్నాడు. కష్టేఫలి అని నమ్మే ఈ తెలుగోడు మరి రిషభ్‌పంత్‌కు పోటీనివ్వగలడా!!


నైపుణ్యాల కలబోత

‘మూడు ఫార్మాట్లలో ఆడుతున్న రిషభ్‌పంత్‌పై పనిభారం పెరుగుతోంది. అతడికి ప్రత్యామ్నాయంగా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ను సిద్ధం చేస్తున్నాం’ అని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఈ మధ్యే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆయన సూచించిన పేరే కేఎస్‌ భరత్‌. ఆంధ్రా రంజీ జట్టుకు వికెట్‌ కీపర్‌. ప్రస్తుతం భారత్‌-ఏ తరఫున రాణిస్తున్నాడు. ‘కష్టేఫలి’ అతడి క్రికెట్‌ మంత్రం. జీవితంలో ఒడుదొడుకులు ఉన్నట్టే ఆటలోనూ ఉంటాయని నమ్ముతాడు. వేగంగా కదలడం, పరిణతితో ఆలోచించడం, ఫస్ట్‌ స్లిప్‌లోకి సైతం డైవ్‌ చేసి బంతిని అందుకోగల ఒడుపు, ఆదిలోనే తొందరపడకుండా వేచి చూసే నేర్పు, అద్భుతమైన కంటి-చేతి సమన్వయం, బ్యాట్స్‌మన్‌ వెనక్కి తిరిగి చూసేలోపే వికెట్లు గిరాటేయడం, బంతి పిచ్‌ అవ్వడానికి ముందే ఊహించి పొజిషన్‌లోకి వెళ్లడం భరత్‌ ప్రత్యేకతలు. ఇవన్నీ చూసే కేఎస్‌ భరత్‌పై ఎమ్మెస్కే ప్రసాద్‌కు అంత నమ్మకం. అందుకు తగ్గటే అతడు భారత్‌-ఏ తరఫున ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లపై అదరగొట్టాడు. ఇప్పుడు పంత్‌కు పోటీగా ఎదిగాడు.


చిన్నప్పట్నుంచే మెరుపులు

నాలుగైదేళ్ల వయసు నుంచే క్రికెట్‌ను చూస్తూ పెరిగాడు భరత్‌. ఆ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు క్రికెట్‌ దిశగా అతడిని ప్రోత్సహించారు. అతడి తండ్రి విశాఖ నావల్‌ డాక్‌లో ఉద్యోగి. అమ్మ గృహిణి. సాధన చేసేందుకు అమ్మ తీసుకెళ్తే నాన్న తిరిగి తీసుకొచ్చేవారు. అద్భుతమైన ప్రతిభావంతుడైన భరత్‌ చాలా త్వరగానే ఆంధ్రా తరఫున అండర్‌-13కు ఆడాడు. చదువులోనూ ముందుండే ఈ కుర్రాడిని అండర్‌-16 జట్టు నుంచి తప్పించే సరికి కొన్నాళ్లు తన ప్రాధామ్యాలు ఏంటో తెలుసుకోలేక ఇబ్బంది పడ్డాడు. నాన్న సైతం అతడిని మందలించాడు. ఇదంతా గమనించిన గురువు కృష్ణారావు తండ్రితో మాట్లాడాడు. ఆ తర్వాత ఆయనెప్పుడూ కొడుకుపై కోపగించుకోలేదు. ఈ మార్పేంటో భరత్‌కు అర్థం కాలేదు. అతడు రంజీల్లో అరంగేట్రం చేసిన తర్వాత అసలు నిజం తెలిసింది. ఆటలో ఒడుదొడుకులు సహజమేనని, పిల్లాడిని స్వేచ్ఛగా వదిలేయాలని, భరత్‌ కచ్చితంగా రంజీలు ఆడతాడని కృష్ణారావు తనకు చెప్పారని తండ్రి వివరించారు. ఇలా అతడి ప్రస్థానం నేడు టీమిండియా తలుపులు తట్టే స్థాయికి చేరుకుంది.


వికెట్‌ కీపర్‌ కాదు

నిజానికి భరత్‌ ముందు నుంచీ వికెట్‌ కీపర్‌ కాడు. విశాఖలో సాయంత్రం ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్లు, అండర్‌-23, అండర్-22, అండర్‌-19 కుర్రాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. భరత్‌ సీనియర్లతో కలిసి ఆడేవాడు. ఫీల్డింగ్‌లో అతడు బంతిని తేలిగ్గా అందుకున్నా గట్టిగా ఒడిసిపట్టేవాడు. కదలికలు వేగంగా ఉండేవి. కంటి-చేతి సమన్వయం బాగుండేది. శరీరంలో సమతూకం కనిపించేది. ఇవన్నీ గమనించిన కృష్ణారావు శిష్యుడు భరత్‌ చేతులకు కీపింగ్‌ గ్లోవ్స్‌ తొడిగించాడు. మొదట్లో కొన్ని గంటలు కీపింగ్‌ చేసేవాడు. ఆ తర్వాత 20 ఓవర్లు, 50, 90 ఇలా కొనసాగించాడు. ఆంధ్రా క్రికెట్‌ జట్టుకు సరైన కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం, సంఘం అతడిని ప్రోత్సహించడంతో సుదీర్ఘ మ్యాచుల్లో కీపింగ్‌ చేసే స్థాయికి చేరుకున్నాడు.


గణాంకాల్లో అదుర్స్‌

పంత్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఊరికే భరత్‌ పేరును ఎమ్మెస్కే ప్రతిపాదించలేదు. 2015, జనవరి నుంచి 2018, సెప్టెంబర్‌ మధ్యలో అతడి గణాంకాలు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అందరి కన్నా ఎంతో బాగున్నాయి. ఈ కాలంలో 40 మ్యాచుల్లో భరత్‌ 141 క్యాచ్‌లు అందుకున్నాడు. 14 స్టంపింగ్స్‌ చేశాడు. బ్యాటింగ్‌ సగటు 32.19గా ఉంది. రిషభ్‌పంత్‌ 25 మ్యాచుల్లో 76 క్యాచ్‌లు అందుకొని 7 స్టంపింగ్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. బ్యాటింగ్‌ సగటు మాత్రం 49.63గా ఉంది. ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌ పరంగానూ భరత్‌ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. 2015లో గోవాపై త్రిశతకం బాదాడు. రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి వికెట్‌కీపర్‌గా ఘనత సాధించాడు. అదే ఏడాది వికెట్లను చూడకుండా వెనకనుంచి స్టంపింగ్‌ చేసి పంజాబ్‌ ఆటగాడు జీవన్‌జ్యోత్‌ను పెవిలియన్‌ పంపించి ఆశ్చర్యపరిచాడు.


ఇంగ్లాండ్‌ పర్యటనతో మలుపు

ఇక పంత్‌ కన్నా భరత్‌ చాలా చురుకు. వేగంగా కదులుతాడు. పొడవు ఎక్కువ. ఇది అతడికి సానుకూలం కానుంది. ఇంగ్లాండ్‌ పర్యటన ఇందుకు ఉదాహరణ. భారత్‌-ఏ తరఫున ఇంగ్లాండ్‌ లయన్స్‌పై గతేడాది జులైలో జరిగిన టెస్టులో భరత్‌ ఒక మ్యాచ్‌లో కేవలం 6 బైస్‌ మాత్రమే ఇచ్చాడు. పంత్‌ మాత్రం రెండు మ్యాచుల్లో 42 బైస్‌ ఇచ్చాడు. ఆలూర్‌ మ్యాచ్‌లో భరత్‌ వరుస ఓవర్లలో రెండు క్యాచ్‌లు నేలపాలు చేసినా 109 ఓవర్లలో ఒక్క బైస్‌ ఇవ్వకపోవడం విశేషం. ఆ క్యాచ్‌లు ఎలా వదిలేశాడో చూద్దామంటే రిప్లే సౌకర్యం లేదని కోచ్‌ చెబుతున్నాడు. ఆస్ట్రేలియా-ఏపై టెస్టు సిరీస్‌లో భరత్‌ ఎవరికీ సాధ్యం కాని రీతిలో అద్భుత శతకం బాదేశాడు. ప్రత్యర్థి జట్టులో 9 మంది ఆసీస్‌ తరఫున టెస్టులు ఆడినవాళ్లే ఉన్నారు. అక్కడి పిచ్‌లపై వారిని ఎదుర్కొని ఆడటమంటే మామూలు విషయం కాదు. టీఎన్‌పీఎల్‌ ద్వారా అతడి సత్తా ఏంటో అందరికీ తెలుస్తోంది.


దిగ్గజాల తర్వాత

తనను తాను మెరుగు పరుచుకొనేందుకు కేఎస్‌ భరత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకోసం తన దేహం దిగువ భాగాన్ని పటిష్ఠం చేసుకున్నాడు. కీపర్‌కు కాళ్లలో ఎంతో బలం ఉండాలని నమ్ముతాడు. స్పిన్‌లో కదలికలను బట్టే కీపర్‌ ఎంత బాగా ఆడుతున్నాడో చెప్పొచ్చంటాడు ఈ కుర్రాడు. సయ్యద్‌ కిర్మాణి, , కిరణ్‌ మోరె, నయన్‌ మోంగియా, ఎమ్మెస్కే తర్వాత అంత బాగా గ్లోవ్స్‌తో పనిచేయగల సత్తా భరత్‌లోనే చూశానంటాడు అతడి గురువు కృష్ణారావు. అతడు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడని నమ్మకంగా ఉన్నారు. కొసమెరుపు ఏంటంటే భారత జట్టు అద్భుతమైన వికెట్‌కీపర్‌ కోసం ఎదురుచూసే రోజులు వస్తాయని తన గురువు చెప్పినప్పుడు కేఎస్ భరత్‌ అస్సలు నమ్మలేదు తెలుసా!! ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తుండటం గమనార్హం. మరి ఈ తెలుగు కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయాలని కోరుకుంటూ...

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.