close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. అమితాబ్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. సినీరంగంలో విశేషసేవలు అందించినందుకు గానూ అమితాబ్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్వీట్‌ చేశారు. సినీరంగంలో బిగ్‌బీగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసిన అమితాబ్‌ బచ్చన్‌.. హిందీ సహా అనేక భాషల్లో నటించారు. ఆయన నటనకు గాను 2015లో పద్మవిభూషణ్‌ వరించింది. తన 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో త్రిభాషా సూత్రం: యార్లగడ్డ

హిందీ భాషను గుడ్డిగా వ్యతిరేకించటం సరికాదని ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. హిందీకి వ్యతిరేకంగా తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు ఎప్పటికీ ఫలించవని ఆయన వ్యాఖ్యానించారు. హిందీ రాకపోవటం వల్లే చంద్రబాబు దిల్లీలో విజయం సాధించలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. హిందీ భాషను బలవంతంగా రుద్దటం కంటే సానుకూల ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. త్రిభాషా సూత్రాన్ని ఏపీలో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కోడెల ఆత్మహత్యపై పిటిషన్‌ కొట్టివేత

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోడెలది ఆత్మహత్య కాదని.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు బూరగడ్డ అనిల్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ అత్యవసరంగా విచారణ చేపట్టింది. వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనం ఏముందని పిటిషర్‌ను కోర్టు ప్రశ్నించింది. దేశంలోని అత్యుత్తమ పోలీసు వ్యవస్థల్లో తెలంగాణ ఒకటని.. దర్యాప్తుపై తమకు ఎలాంటి అనుమానం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబసభ్యులు ఇటీవల సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో వేణుమాధవ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వేణు మాధవ్‌ ప్రతినిధులు తెలిపారు. సినీ నటులు జీవిత-రాజశేఖర్‌లు ఆస్పత్రికి వచ్చి వేణు మాధవ్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం దర్యాప్తునకు సంబంధించిన వివరాలను కూడా సీబీఐకి పంపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఇది విన్నారా..రూ.8లక్షల ఉల్లిపాయలు చోరీ!

బంగారం చోరీ చేయడం.. నగదు దోపిడీ ఘటనల్ని మనం వింటుంటాం. నిత్యం ఎక్కడో ఒకచోట ఈ దొంగతనాల వార్తలు చదువుతూనే ఉంటాం. కానీ బిహార్‌లో కొందరు ఉల్లిపాయలు దొంగతనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.8లక్షలు విలువ చేసే ఉల్లిని చోరీ చేశారు. దీనికి కారణం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటడంతో ఈ చోరీ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ పంపకాలు భారత్‌-పాక్‌ విభజన కన్నా కష్టం!

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లను భాజపా-శివసేన పంచుకోవడం అత్యంత క్లిష్టమైన వ్యవహారమని ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. మిత్ర పక్షాలైన భాజపా-శివసేన మధ్య సీట్ల పంపకాలు భారత్‌-పాక్‌ విభజన సమస్య కన్నా కష్టతరమైనదని ఆయన అభివర్ణించారు. మంగళవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ క్లిష్టతరమైన సీట్ల పంపకాలపై త్వరలో రెండు పార్టీలు తుది నిర్ణయానికి వస్తాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘నేనేమీ నీ పెంపుడు చిలుకని కాదు’

కర్ణాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచీ మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తమకు సహకరించలేదంటూ కుమారస్వామి తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారు. ‘‘నేనేమీ సిద్ధరామయ్య పెంపుడు చిలుకను కాదు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి కాగలిగాను. సిద్ధరామయ్య ఆ పార్టీ అధిష్ఠానం మాటను, వారిచ్చిన సూచనలను పాటించకపోవడం వల్లే కర్ణాటకలో ప్రభుత్వం కొనసాగలేకపోయింది’’ అని వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చొక్కా గుండీలు పెట్టుకోలేదని జరిమానా

మోటారు వాహన నూతన చట్టం అమలులోకి వచ్చాక ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి అధికమొత్తంలో జరిమానాలు విధిస్తుండటంపై వాహనదారులు నుండి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కారులో హెల్మెట్‌ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారని వంటి వింత కారణాలకు జరిమానాలు విధించటంపై కూడా పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అటువంటి సంఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. చెప్పులు వేసుకొని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్‌ అనే ట్యాక్సీ డ్రైవర్‌కి చలానా విధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ధోనీకి పంత్‌కు తేడా ఉంది: యువరాజ్‌

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీ వారసుడిగా అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌ తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్య షాట్లతో పెవిలియన్‌కు చేరుతున్నాడు. దీంతో అతడిపై విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తున్నాయి. జట్టులో అతడి స్థానంపై పోటీ తప్పదని ఇప్పటి కోచ్‌ రవిశాస్త్రి, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పంత్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పంత్‌కు ధోనీకి తేడా ఉందని భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ధోనీ జట్టులో కుదురుకోవడానికి సమయం పట్టిందని, ఒక్క రోజులోనే జరిగిపోలేదని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.