close

తాజా వార్తలు

ఎన్టీఆర్‌ ఇంట్లో దోశలు.. చిరంజీవి ఇంట్లో డ్యాన్స్‌.. పవన్‌కు బియ్యం బస్తా

వేణుమాధవ్‌ జీవితంలో ఇలాంటి సరదా సంఘటనలు ఎన్నో...

దేవుడికి నవ్వన్నా.. నవ్వించేవాళ్లన్నా చాలా ఇష్టం. అందుకే బాగా నవ్వించేవారిని తొందరగా తన దగ్గరకు తీసుకెళ్లిపోతుంటాడు. అలా టాలీవుడ్‌లో మరో నవ్వుల రారాజును తన దగ్గరకు పిలిపించుకున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్‌ ఈ రోజు కన్నుమూశారు. రెండున్నరేళ్ల క్రితం తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో అలీతో పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం... 

అలీ: ‘సంప్రదాయం’లో అవకాశం ఎలా వచ్చింది?
వేణుమాధవ్‌: రచయిత దివాకర్‌బాబు సన్మానం రవీంద్రభారతిలో జరిగింది. అప్పుడు నేను అక్కడ ఓ మిమిక్రీ ప్రోగ్రామ్‌ చేశాను. ఆ సందర్భంలోనే  నన్ను కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చూశారు. నా ప్రదర్శన నచ్చి ‘సంప్రదాయం’లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకు నాకు రూ.70 వేలు పారితోషికం ఇచ్చారు.

అలీ: ‘ప్రేమాభిషేకం’ సినిమా ఎందుకు నిర్మించారు.? లాభం వచ్చిందా? 
వేణు మాధవ్‌: ‘ప్రేమాభిషేకం’ చిత్రానికి నిర్మాత 70 శాతం పెడితే... నేను 30 శాతం పెట్టాలి అనుకున్నాను. తీరా సినిమా ప్రారంభమైన కొన్ని రోజులకే నిర్మాత చేతులేత్తెశారు. అందుకే సినిమాని పూర్తిగా నేనే నిర్మించాను. నష్టాలు అయితే రాలేదు.

అలీ: మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మీరు చేసిన తొలి వాయిస్‌ ఎవరిది?
వేణుమాధవ్‌: నేను మిమిక్రీ చేసిన తొలి వాయిస్‌ ఎన్టీఆర్‌ గారిది.  

అలీ: నారా లోకేశ్‌, బ్రహ్మణి, కేటీఆర్‌, హరీశ్‌రావు మిమ్మల్ని ఏమని పిలిచేవారు?
వేణుమాధవ్‌:  తెదేపా కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు కేసీఆర్‌గారు నేను కలసి ఒకే స్కూటర్‌లో వచ్చేవాళ్లం. నాకు నారా లోకేశ్‌, బ్రహ్మణి, కేటీఆర్‌, హరీశ్‌రావు అంటే కోపం. ఎందుకంటే వాళ్లు నన్ను అంకుల్‌ అని పిలిచేవారు. వాళ్లందరూ పిల్లల్ని కని నన్ను తాతను చేశారుగా.. అందుకే కోపం. (నవ్వులు)

అలీ: సినిమాలకు దూరమయ్యారా? లేక దూరం చేశారా?
వేణు: నన్ను ఎవరు సినిమాలకు దూరం చేయలేదు. నేనే దూరం అయ్యాను. ‘రేయ్‌’ షూటింగ్‌ కోసం కొన్ని నెలలపాటు అమెరికాలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా సినిమాలకు డేట్స్‌ ఇవ్వలేకపోయాను. ఆ తర్వాత దూరమయ్యాను.

అలీ: పవన్‌కి మీకు మధ్య ఏదో ఒప్పందం ఉందట?
వేణుమాధవ్‌: నేను సంపాదించిన డబ్బులతో మా ఊరిలో పది ఎకరాల పొలం కొనుకున్నాను. అందులో నేను వ్యవసాయం చేస్తున్నాను. అలా నేను సాగు చేసిన బియ్యంలో ఒక బస్తా తప్పనిసరిగా నాకు ఎంతో ఇష్టమైన పవన్‌ కల్యాణ్‌కు వెళ్తుంది. ఆయన కూడా ప్రతి సంవత్సరం నాకు ఆయన తోటలో పండించిన మామిడి పండ్లు పంపిస్తారు. అదీ మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం. 

అలీ: ఎన్టీఆర్‌గారు నిన్ను తిట్టి.. దోశలు పెట్టారట..  నిజమా?
వేణుమాధవ్‌: ఎన్టీఆర్‌గారి ఇంటిలో పని చేస్తున్న సందర్భంలో ఓసారి ఉదయం ఏడు గంటలు అయినా హాల్‌లో బల్బు ఆపలేదు. దీంతో ఆయనకు నా మీద కోపం వచ్చింది. నన్ను పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆ జరగాల్సిన పత్రికా సమావేశాన్ని కూడా నిలిపివేశారు. అయితే అదే రోజు నన్ను మళ్లీ ఇంటికి పిలిచి నేతి దోశలు పెట్టారు. మళ్లీ అలాంటి తప్పు జరగకుండా చూసుకోండి అని మందలించారు. 

అలీ: చిరంజీవిగారు అడిగి మరీ మీతో డ్యాన్స్‌ వేయించేవారట?
వేణుమాధవ్‌: ‘ఛత్రపతి’ సినిమాలో నేను వేసిన స్టెప్పు అంటే చిరంజీవిగారికి చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఓసారి చెప్పారు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఆయన్ని కలిసినా అడిగి మరి నాతో ఆ డ్యాన్స్‌ చేయించేవారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.