close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. పీపీఏల పునఃసమీక్ష సరికాదు:కేంద్రం

పీపీఏల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం మరోసారి అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ లేఖ రాశారు. పీపీఏల అంశంలో అక్రమాలు జరిగాయనే ఊహాగానాలతో పునఃసమీక్ష సరికాదని.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాల్సిన అవసరం లేదని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. సమీక్ష చేయాలనుకునే 3 సంస్థల స్థాపిత సామర్థ్యం 2014కి ముందే కేంద్రానికి తెలుసన్నారు. గత ఐదేళ్లలో విద్యుత్‌ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయంటూ సీఎం జగన్‌ జులై 25న ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యం దుకాణాల అనుమతుల గడువు పెంపు

మద్యం దుకాణాల లైసెన్సులను తెలంగాణ ప్రభుత్వం నెలరోజులపాటు పొడిగించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలు నెలరోజులపాటు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు సెప్టెంబర్‌ ఆఖరుతో ముగియాల్సి ఉండగా ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం విధానంలో లైసెన్సుదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే నూతన విధానంపై అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఆయన రెండు పేజీల లేఖ రాశారు. వాక్ స్వాతంత్ర్యం హరిస్తున్నారని చంద్రబాబు లేఖలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అట్టడుగుస్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాల రాస్తోందని.. ప్రజలు, మీడియా ప్రతినిధులపై వరుస దాడులు కొనసాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ సెల్ఫీ వీడియో నేను తీయలేదు:పువ్వాడ

తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించడం ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన వరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తన వాహనం స్పీడ్‌ లిమిట్‌ దాటిందని.. చలాన పడిందని రాయడం సరికాదని పువ్వాడ ఆక్షేపించారు. చలాన జులైలో వచ్చిందని.. ఆయన మంత్రి అయ్యాక ఆ వాహనాన్ని కేటాయించారని స్పష్టం చేశారు. బోటు ప్రమాద బాధితులకు అండగా ఉంటామనే విషయాన్ని చెప్పేందుకే ఏపీ మంత్రి కన్నబాబు సెల్ఫీ వీడియో తీశారని మంత్రి పువ్వాడ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పెట్టుబడులు పెట్టాలంటే భారత్‌ రండి: మోదీ

పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు రావాలని పారిశ్రామిక వేత్తలకు ప్రధాని మోదీ పిలపునిచ్చారు. దేశంలో అందుకు అనుగుణమైన వాతావరణం ఉందని చెప్పారు. ఇటీవల కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం కల్పించిందన్నారు. దీన్ని బంగారం లాంటి అవకాశంగా మోదీ అభివర్ణించారు. న్యూయార్క్‌లో బ్లూమ్‌బెర్గ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం -2019లో మోదీ పెట్టుబడిదారులనుద్దేశించి ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌’

నగరంలో అద్దె ఇళ్లలో నివసించే వారికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ శుభవార్త చెప్పారు. ‘ముఖ్యమంత్రి కిరాయిదార్‌ బిజ్లి మీటర్‌ యోజన’ పథకం కింద అద్ధె ఇళ్లలో ఉండే వారు 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తే వారికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. ఈ పథకం కింద ప్రీపెయిడ్‌ మీటర్లను అద్దె గృహలకు బిగిస్తామన్నారు. 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్ల విద్యుత్‌ వాడకం జరిగితే సొంత గృహలు ఉన్న వారు చెల్లించినట్లే రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పథకం కేవలం నివాస గృహలలో ఉపయోగించే మీటర్లకు మాత్రమే వర్తింస్తుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ వైమానిక స్థావరాల్లో హై అలర్ట్‌!

జమ్ము కశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వైమానిక స్థావరాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ స్థావరాల్లో జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8-10 మంది ఉగ్రవాదులు ముఖ్యంగా శ్రీనగర్‌, అవంతిపుర, జమ్ము, పఠాన్‌కోట్‌, హిందన్‌ వైమానిక స్థావరాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్రెడిట్‌కార్డుతో పెట్రోల్ కొంటే.. నో క్యాష్‌బ్యాక్‌

డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించేందుకు దాదాపు రెండున్నరేళ్ల క్రితం పెట్రోల్‌పై క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించాయి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు. అయితే ఇకపై క్రెడిట్‌ కార్డుదారులకు ఆ డిస్కౌంట్లు ఉండవట. అక్టోబరు 1 నుంచి పెట్రోల్‌ బంక్‌ల వద్ద క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి 0.75శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండదని ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐసీసీ ర్యాంకింగ్స్‌: కోహ్లీ ర్యాంకెంతంటే?

తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో భారత సారథి విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో కోహ్లీ 81 పరుగులు, ధావన్‌ 76 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ 12వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకోగా. ధావన్‌ మూడు స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ 8, 10వ స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా సారథి డికాక్‌ 19 స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘తికిరి’  కన్నుమూత

శ్రీలంకలోని క్యాండీలో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఏనుగు తికిరి మంగళవారం మరణించింది. ఇటీవల ఒక ఊరేగింపులో దాని పట్ల యజమానులు కర్కశత్వంతో వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బౌద్ధులకు చెందిన ఓ ఊరేగింపులో బలవంతంగా 70ఏళ్ల తికిరిని ముసలి తనం కనిపించనీయకుండ రంగుల దుస్తులతో అలంకరించి ఎక్కువ దూరం నడిపించారు. వృద్ధాప్యం కారణంతో పాటు ఎక్కువ సేపు నిలబడి ఉండటంతో ఊరేగింపు ముగిశాక రెండు రోజుల్లోనే తికిరి కుప్పకూలింది. కనీసం నిలబడలేని స్థితికి చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.