close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దురాజ్‌పల్లిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రభాకర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మందిపైగా ప్రయాణికులు  గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

2. జడిపించిన జోరువాన

సెప్టెంబరు నెలాఖరులో ఇంత భారీగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడటం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. గత రెండు రోజులుగా 45 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వానలు పడ్డాయి. హైదరాబాద్‌ నగరంలో 24 గంటల వ్యవధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం సెప్టెంబరు నెలలో కురవడం అరుదు. కానీ ఈ పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయి కుంభవృష్టిలా కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఈనెల 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణలోని పాఠశాలలకు, కళాశాలలకు ఈనెల 28వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు ఈనెల 28 నుంచి అక్టోబరు 13వ తేదీ వరకు మొత్తం 16 రోజులు సెలవులు ఇచ్చారు. డిగ్రీ కళాశాలలకు ఈనెల 28 నుంచి సెలవులు ప్రారంభమైనా పునః ప్రారంభ తేదీలు ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో విధంగా మారాయి. జూనియర్‌ కళాశాలలకు ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సంగారెడ్డి మహిళలకు ఐక్యరాజ్యసమితి అవార్డు

అమెరికాలోని న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని డీడీఎస్‌ మహిళలు ఈక్వేటరి పురస్కారాన్ని అందుకున్నారు. ఆర్థిక ఎదుగుదల, పర్యావరణ పరిరక్షణ, పోషక విలువల పెంపు, చిరుధాన్యాల పంటల సాగు తదితర అంశాలపై రెండున్నర దశాబ్దాలుగా చేసిన కృషికిగాను డక్కన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ(డీడీఎస్‌)ను ఐక్యరాజ్యసమితి ఈక్వేటరి అవార్డుకు ఎంపిక చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తెలంగాణలో కొత్త నీరా విధానం

తెలంగాణలో కొత్త నీరా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. తొలుత ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో త్వరలో రెస్టారెంట్‌ తరహాలో తెలంగాణ వంటకాలతో నీరా దుకాణం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.  భవిష్యత్తులో దీన్నో పెద్ద పరిశ్రమగా మార్చే ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది గౌడ సామాజికవర్గ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ విధానానికి అనుమతిచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. బీటెక్‌ కష్టమైతే బీఎస్సీ ఇంజినీరింగ్‌ పట్టా!

అహర్నిశలు కష్టపడి ఐఐటీల్లో బీటెక్‌ సీటు దక్కించుకున్న విద్యార్థులు తీరా చేరిన తర్వాత చదువులో వెనకబడితే?... అర్ధంతరంగా ఐఐటీలను వదలాల్సిందే. అందుకు భిన్నంగా వారిని బీఎస్సీ ఇంజినీరింగ్‌లో చేర్చాలని కేంద్ర మానవవనరుల శాఖ యోచిస్తోంది. ఆరు సెమిస్టర్ల (మూడు సంవత్సరాలు) తర్వాత, కనీస విద్యా ప్రమాణాల ఆధారంగా  బీఎస్సీ  ఇంజినీరింగ్‌ పట్టా అందజేస్తారు. ఈ ప్రతిపాదనపై ఈనెల 27న జరిగే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆధార్‌ గడువు డిసెంబరు 31

జాతీయ ఆహారభద్రత చట్టం కింద ప్రయోజనాలు పొందాలనుకునేవారు ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన గడువును కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఈ చట్టం కింద సబ్సిడీ ఆహార ధాన్యాలు, నగదు బదిలీ పొందాలనుకుంటే ఆధార్‌ కార్డు లేనివారికి ఈ అవకాశం కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కశ్మీర్‌ విషయంలో మోదీపై నెగ్గలేకపోయాం

కశ్మీర్‌ విషయమై భారత ప్రధాని నరేంద్ర మోదీపై అంతర్జాతీయ సమాజం ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌ సమస్యపై ఇతర దేశాల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యామని ఒప్పుకొన్నారు. ‘‘అంతర్జాతీయ సమాజంపై అసంతృప్తితో ఉన్నా. ఇంతవరకు మోదీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అయినా మేం ఒత్తిడి తెస్తునే ఉంటాం’’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ట్రంప్‌పై అభిశంసనకు దర్యాప్తు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన అభిశంసన దర్యాప్తు తీర్మానాన్ని బుధవారం ప్రతినిధుల సభలో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టారు. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జో బిడెన్‌ వచ్చే ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయనకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశంతో తూర్పు ఐరోపా దేశమైన ఉక్రెయిన్‌ సహాయాన్ని తీసుకున్నారన్నది ట్రంప్‌పై ఉన్న ప్రధాన ఆరోపణ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నింగిలోకి యూఏఈ తొలి వ్యోమగామి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ తొలి వ్యోమగామి హజ్జా అల్‌ మన్సూరీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పయనమయ్యారు. కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్‌ నుంచి మన్సూరీతోపాటు రష్యాకు చెందిన ఒలెగ్‌ స్క్రిపొచ్కా, నాసా వ్యోమగామి జెస్సికా మీర్‌ను సోయజ్‌ రాకెట్‌ బుధవారం నింగిలోకి మోసుకెళ్లింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.