close

తాజా వార్తలు

అలాగైతే.. రోహిత్‌కు టీ20 కెప్టెన్సీ ఇవ్వండి

టీమిండియా ప్రపంచకప్‌ ఓటమికి అసలు కారణమిదే అంటున్న యువీ

దిల్లీ: మూడు ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహించడం విరాట్‌ కోహ్లీకి భారంగా అనిపిస్తే రోహిత్‌శర్మకు టీ20 సారథ్యం అప్పగించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. గతంలో రెండు ఫార్మాట్లే కాబట్టి అంతగా ఒత్తిడి ఉండేది కాదని వెల్లడించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రోహిత్‌శర్మ అత్యంత విజయవంతమైన నాయకుడన్న సంగతి తెలిసిందే. ముంబయి ఇండియన్స్‌ను అతడు నాలుగు సార్లు విజేతగా నిలిపాడు.

‘గతంలో రెండు ఫార్మాట్లే ఉండేవి కాబట్టి ఒక సారథికి ఆ పనిభారం ఓకే. ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఉన్నాయి. విరాట్‌పై పనిభారం పెరిగితే టీ20 ఫార్మాట్‌కు మరొక సారథిని ప్రయత్నించొచ్చు. రోహిత్‌ అత్యంత విజయవంతమైన నాయకుడు. కోహ్లీ ఎంత పనిభారం మోయగలడో నాకు తెలీదు. జట్టు యాజమాన్యం దానిని నిర్ణయించాలి. టీ20లకు ఎవరినైనా ప్రయత్నించాలని వారు భావిస్తున్నారా? భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలనుకుంటున్నారో అన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. నిర్ణయం తీసుకోవాల్సింది జట్టు యాజమాన్యమే’ అని యువీ అన్నాడు.

ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ప్రపంచకప్‌లో జట్టు యాజమాన్యం కీలకమైన నాలుగో స్థానంలోని బ్యాట్స్‌మన్‌పై తప్పుడు నిర్ణయం తీసుకోవడంపై యువీ విమర్శించాడు. ‘ఎవరు బాగా ఆడతారో ముందు మీరు గుర్తించాలి. అతడిని ప్రోత్సహించాలి. ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో ఆడిన బ్యాట్స్‌మన్‌ అత్యధిక స్కోరు 48. నాలుగో స్థానం అత్యంత ముఖ్యమైందని సారథి, కోచ్‌, సెలక్టర్లు తెలుసుకోవాలి. బంతులు దూసుకుపోయే ఇంగ్లాండ్‌నైతే మరీనూ’ అని యువీ పేర్కొన్నాడు.

‘నాలుగో స్థానంలోని ఆటగాడు సాంకేతికంగా బలంగా ఉండాలి. విజయ్‌ శంకర్‌కు ఆ అనుభవం లేదు. రిషభ్‌కూ లేదు. అనుభవం ఉన్న దినేశ్‌ కార్తీక్‌ను కూర్చోబెట్టారు. హఠాత్తుగా సెమీఫైనల్లో ఆడించారు. జట్టు యాజమాన్యం ఆలోచనలేంటో నాకు అర్థం అవ్వలేదు. ఒక ఆటగాడి నుంచి అత్యుత్తమ ఆటను వెలికితీయాలంటే అతడికి భద్రత కల్పించాలి. అభద్రతా భావంతో ఉంటే ఏ ఆటగాడూ రాణించలేడు. భారత్‌ ప్రపంచకప్‌ గెలవకపోవడానికి అతిపెద్ద కారణం ఇదే’ అని యువరాజ్‌ కుండబద్దలు కొట్టాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.