close

తాజా వార్తలు

పంత్‌పై త్రిశూల వ్యూహం.. విజేత ఎవరో?

ధోనీ వారసుడిగా నిలిచేదెవరో..!

ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలో ఆసక్తికరమైన అంశం.. ‘ధోనీ వారసుడిగా నిలిచేదెవరు?’ అని. గతంలో యువకెరటం రిషభ్‌ పంత్‌ ‘మిస్టర్‌ కూల్‌’ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావించారంతా. కానీ ఎగసిపడిన కెరటంలా పంత్‌ ఆదిలో మెరిపించి తర్వాత నిలకడలేమితో నిరాశపరుస్తున్నాడు. ఈ తరుణంలో పంత్‌ స్థానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ సైతం పంత్‌కు ప్రత్యామ్నాయాలను చూస్తున్నామని బహిరంగంగానే వెల్లడించాడు. అదే సమయంలో నీలిరంగు జెర్సీ ధరించి వికెట్ల వెనుక నిలబడాలని యువ వికెట్‌ కీపర్లు ఉవ్విళ్లూరుతున్నారు. కేఎస్‌ భరత్, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ ఎంతో ఆశగా ఆ స్థానం భర్తీ చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. దీంతో వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరి ఈ పోటీలో నిలిచేదెవరు?

భరత్‌కు ఎమ్మెస్కే ప్రోత్సాహం

మొన్నటి వరకు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేని పేరు కేఎస్ భరత్. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టీ అతడిపై మళ్లింది. దీనికి కారణం సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. ‘కొన్ని కనిష్ఠ పాయింట్ల తేడాతో భరత్‌ వెస్టిండీస్‌ పర్యటన జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. భవిష్యత్‌లో అతడికి అవకాశం దక్కుతుంది’ అని ఎమ్మెస్కే ముందు భరత్ ఎంపిక గురించి చెప్పాడు. త్వరలో భారత జెర్సీ ధరిస్తాడని అంత కచ్చితంగా ఎమ్మెస్కే చెప్పడానికి కారణం భరత్‌ అద్భుత ప్రదర్శనే. బ్యాటుతో పరుగుల వరద పారిస్తూ గ్లవ్స్‌తో రెప్పపాటు క్షణంలో వికెట్లను గిరాటేయడం భరత్‌ ప్రత్యేకత. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌, భారత్‌-ఎ తరఫున అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 69 మ్యాచుల్లో బ్యాటుతో 3909 పరుగులు బాదిన అతడు.. 232 క్యాచ్‌లు, 27 స్టంప్స్‌ చేశాడు. భారత్‌-ఎ తరఫున 47 మ్యాచుల్లో 1297 పరుగులతో పాటు 52 క్యాచ్‌లు, 11 స్టంప్స్ చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్‌శర్మ డకౌటైనా.. భరత్‌ 71 పరుగులు బాది జట్టును ఆదుకున్న సంగతి తెలిసిందే. వికెట్ల వెనుక పంత్‌ కంటే వేగంగా కదలడం, నిలకడగా పరుగులు బాదడం భరత్‌కు అదనపు బలాలు. అతడి ప్రదర్శన ఇదే విధంగా కొనసాగితే అతి త్వరలోనే టీమ్‌ఇండియా గడప తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది!!

ఒక్క ఛాన్స్‌.. నా తడాఖా చూపిస్తా! 

ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించే సంజు శాంసన్ దేశవాళీ క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. 2015లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నీలిరంగు జెర్సీ ధరించిన సంజుకు టీమ్ఇండియాలో మరో అవకాశం రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా అద్భుతంగా రాణిస్తూనే ఉన్నాడు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సెలక్టర్లను ఆకర్షిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ సీజన్‌లో కూడా శతకంతో చెలరేగాడు.  దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరిగిన మ్యాచుల్లో తన వాడిని చూపించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ను అందుకున్నాడు. అంతేకాకుండా హర్భజన్‌ సింగ్‌, గౌతం గంభీర్‌ వంటి ఆటగాళ్ల మద్దతు సంజు శాంసన్‌కు ఉంది. ఈ కేరళ కుర్రాడి అవకాశం ఇచ్చి చూడాలని పలుసార్లు విజ్ఞప్తి చేశారు. టీమ్‌ఇండియాలో ఒక్క ఛాన్స్ ఇస్తే తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి సంజు సిద్ధంగా ఉన్నాడు. 53 ఫస్ట్‌ క్లాస్ మ్యాచుల్లో అతడు 2945 పరుగులతో పాటు 71 క్యాచ్‌లు, 7 స్టంప్స్‌ చేశాడు. భారత్‌-ఎ తరఫున 83 మ్యాచుల్లో 1990 పరుగులు, 12 స్టంప్స్‌ 81 క్యాచ్‌లు అందుకున్నాడు.

నేనెప్పుడూ సిద్ధమే..

అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న మరో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషాన్‌. తనను తాను నిరూపించుకోవడానికి కిషాన్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇటీవల దక్షిణాఫ్రికా-ఎ తో జరిగిన సిరీస్‌లో సంజుతో పాటు కిషాన్‌ కూడా మెరుపులు మెరిపించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 24 బంతుల్లోనే 55 పరుగులు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 42 మ్యాచుల్లో 2,639 పరుగులు బాదడంతో పాటు 85 క్యాచ్‌లు 11 స్టంప్‌లు అందుకున్నాడు. భారత్‌-ఎ తరఫున 61 మ్యాచుల్లో 2,004 పరుగులు, 71 క్యాచ్‌లు, 6 స్టంప్‌లు చేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున రాణించిన కిషాన్‌ రంజీల్లో జార్ఖండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. బరిలోకి దిగాక ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ స్కోరుబోర్డుని పరుగులు పెట్టించడం కిషాన్‌కు వెన్నతో పెట్టిన విద్య.

అయితే, ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకోవాలంటే యువక్రికెటర్లకు అంత సులువేం కాదు. ధోనీ స్థానాన్ని పరిపూర్ణంగా భర్తీ చేయాలంటే.. చిరుతలా పరుగెత్తాలి.. పరిణతితో ఆలోచించాలి.. అద్భుతమైన కంటి-చేతి సమన్వయం ఉండాలి.. మ్యాచ్‌ ‘ఫినిషర్’గా గుర్తింపు తెచ్చుకోవాలి. మరి వన్డే అరంగ్రేటం కోసం పరితపిస్తున్న భరత్, శాంసన్‌, కిషాన్‌లో ఎవరు ధోనీకి అసలైన వారసుడిగా పేరు తెచ్చుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!!

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.