close

తాజా వార్తలు

విశాఖ టెస్టుపై పట్టు బిగించిన కోహ్లీసేన

ద్విశతకంతో అదరగొట్టిన మయాంక్‌ అగర్వాల్‌

టీమిండియా ఇన్నింగ్స్‌ 502/7 వద్ద డిక్లేర్‌

తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 39/3

విశాఖ: అచ్చొచ్చిన విశాఖ గడ్డపై విజయానికి కోహ్లీసేన పటిష్ఠ బాటలు పరుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుపై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను సారథి విరాట్‌ కోహ్లీ 502/7 వద్ద డిక్లేర్‌ చేయగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన మయాంక్‌ తొలి శతకాన్నే అద్వితీయ ‘ద్విశతకం’గా మలిచాడు. టెస్టుల్లో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని రోహిత్‌ త్రుటిలో చేజార్చుకున్నాడు. ఆఖర్లో అశ్విన్‌, జడేజా కలిసి మూడు వికెట్లు పడగొట్టడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి సఫారీలు 39/3తో డీలాపడ్డారు.


ఆహా.. మయాంక్‌

ఓవర్‌నైట్‌ స్కోరు 202/0తో ఆట ఆరంభించిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23×4, 6×6), మయాంక్‌ అగర్వాల్‌ (215; 371 బంతుల్లో 23×4, 6×6) రెండో రోజు దుమ్మురేపారు. 84 పరుగులతో ఉన్న మయాంక్‌ వేగంగా ఆడుతూ కెరీర్‌లో తొలి శతకం అందుకున్నాడు. డ్రింక్స్‌ బ్రేక్‌కు భారత్‌ 264తో నిలిచింది. ఈ క్రమంలో రోహిత్‌ వరుస బౌండరీలు బాదుతూ 150 స్కోరు అందుకోవడంతో జట్టు స్కోరు 300 దాటేసింది. దక్షిణాఫ్రికాపై ఏ వికెట్‌కైనా 300 భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా రోహిత్‌, మయాంక్‌ రికార్డు సృష్టించారు. భోజన విరామానికి ముందు బౌండరీలతో చెలరేగిన హిట్‌మ్యాన్‌ను మహరాజ్‌ బౌలింగ్‌లో డికాక్‌ స్టంపౌట్‌ చేయడంతో టీమ్‌ ఇండియా తొలి వికెట్‌ చేజార్చుకుంది.


వికెట్లు పడుతున్నా..

84 ఓవర్లు పూర్తైన తర్వాత కొత్తబంతి తీసుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడం ఆరంభించారు. ఛెతేశ్వర్‌ పుజారా (6), విరాట్‌ కోహ్లీ (20), అజింక్య రహానె (15)ను స్వల్ప పరుగులకే ఔట్‌ చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మయాంక్‌ సాధికారికంగా ఆడాడు. 294 బంతుల్లో 150 పరుగులు మైలురాయి దాటిన అతడు 358 బంతుల్లో 200 చేసి తొలి శతకాన్నే ద్విశతకంగా మలిచాడు. తన ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నాడు. జట్టు స్కోరు 436 వద్ద అతడిని డీన్‌ఎల్గర్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత వృద్ధిమాన్‌ సాహా (21; 16 బంతుల్లో 4×4), హనుమ విహారి (10; 24 బంతుల్లో 1×4) సహకారంతో రవీంద్ర జడేజా (30*; 46 బంతుల్లో 1×6) టీమ్‌ ఇండియా స్కోరు 500 దాటించాడు. అశ్విన్‌ (1; 17 బంతుల్లో) అజేయంగా నిలిచాడు. సమయం మించిపోతుండటంతో 502/7 వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు.


దెబ్బకొట్టిన అశ్విన్‌

భారీ స్కోరు లక్ష్యంగా తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. 14 పరుగుల వద్దే ఆ జట్టు ఓపెనర్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ (5; 21 బంతుల్లో 1×4) వికెట్‌ చేజార్చుకుంది. అశ్విన్‌ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. డి బ్రూన్‌ (4)ను సైతం అతడే బోల్తా పడేశాడు. అప్పుడు స్కోరు 31. మరికాసేపటికే డేన్‌ పీడ్‌ (0) వికెట్లు ఎగరగొట్టి జడ్డూ సఫారీలను ఒత్తిడిలోకి నెట్టాడు. డీఎన్‌ ఎల్గర్‌ (27 బ్యాటింగ్‌; 63 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడాడు. తెంబా బవుమా (2 బ్యాటింగ్‌; 7 బంతుల్లో) నైట్‌వాచ్‌మన్‌గా ఉన్నాడు. ఓవర్లు ముగియడంతో 39/3 వద్ద ఆటను ముగించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.