close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌@ 9 PM

1. విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తాం

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో వద్ద టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్థామ రెడ్డి కార్మికులను కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విధులకు హాజరు కాని కార్మికులని తొలగించాలంటే మొదట తనను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన అన్నారు. సరైన ప్రణాళికతో శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు. రేపు బస్సు డిపోల ముందు బతుకమ్మలతో నిరసన తెలియజేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రధానితో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

ప్రధాని మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ ముగిసింది. వీరిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. విభజన హామీలు, కడప ఉక్కుపరిశ్రమ, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఇతర అంశాలపై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ అరెస్టు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అసోసియేటెడ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ లిమిటెడ్‌ నుంచి నిబంధనలకు విరుద్ధంగా  రవిప్రకాష్‌ డబ్బులు తీసుకున్నట్లు అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు..మూడేళ్లలో సుమారు రూ.100కోట్లు  తమ ఖాతా నుంచి తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అలందమీడియా పూర్తి అధారాలను పోలీసులకు సమర్పించింది. రవిప్రకాష్‌, కేబీఎన్‌ మూర్తి కలిసి పలు దఫాలుగా ఏబీసీఎల్‌ నుంచి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కడుపునొప్పితో బాధపడుతున్న చిదంబరం!

తీహార్‌ జైలులో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆయన్ను దిల్లీ ఎయిమ్స్‌కు రెఫర్‌ చేశారని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. శనివారం ఉదయం చిదంబరం తనకు కడుపు నొప్పిగా ఉందని జైలు అధికారుల దృష్టికి తీసుకురావడంతో ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈఎస్‌ఐ కుంభకోణం: మరొకరి అరెస్టు

ఈఎస్‌ఐ కుంభకోణంలో అనిశా అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. ‘లైఫ్‌ కేర్‌ డ్రగ్స్‌’ మెడికల్‌ ఫార్మా కంపెనీ యజమాని సుధాకర్‌ రెడ్డిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఔషదాల కొనుగోళ్ల విషయంలో సుధాకర్‌ రెడ్డికి సంబంధం ఉన్నట్లు గుర్తించిన అనిశా అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో మరో నిందితురాలు దేవికారాణికి సుధాకర్ రెడ్డి సహకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 2 నెలల తర్వాత వారిపై ఆంక్షల సడలింపు

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో ఆందోళనలను నిరోధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా దశలవారీగా నిర్బంధంలో ఉన్నవారిపై ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్ర నేతలైన ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్‌ అబ్దుల్లా వంతు వచ్చింది. దాదాపు రెండు నెలల తర్వాత వారు తమ పార్టీ నాయకులను కలిసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉగ్రనిధుల్లో పాక్‌ దౌత్యకార్యాలయ ప్రమేయం..?

ఉగ్రవాదులకు నిధుల సరఫరాకు సంబంధించిన కేసులో నేషనల్‌ ఇన్వెసిగేషన్‌ ఏజెన్సీ  అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీనిలో కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాద నేతలు యాసిన్‌ మాలిక్‌, షబ్బీర్‌ అహ్మద్‌ షా, మస్రత్‌ ఆలం, అబ్దుల్‌ రషీద్‌ షేక్‌(ఇంజినీర్‌ రషీద్‌)లకు సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు పాక్‌ దౌత్యకార్యాలయం కూడా దీనిలో భాగస్వామిగా మారిందని పేర్కొంది. వేర్పాటువాదులకు, వారి నెట్‌వర్క్‌కు నిధుల బదలాయింపు, కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడానికి సూచనలు సలహాలను ఇచ్చినట్లు దీనిలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 2008 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో..

దేశంలోని వాణిజ్యరంగం 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని ఆర్‌బీఐ సర్వేలో తేలింది. ఆర్బీఐ త్రైమాసిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆర్థిక మందగమనం తీవ్రతను ఈ సర్వే తెలియజేస్తోంది. గత నెల ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం కూడా ఈ కారణంతోనే తీసుకొంది. ప్రధానంగా తయారీ సంస్థల ఆర్డర్లు 23శాతం తగ్గిపోయాయి. 2008 తర్వాత ఇదే అత్యల్పం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘6లోపు 160 మంది విధుల్లో చేరారు’

ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు 160 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినట్లు టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సూపర్‌వైజర్లు, ఆఫీస్ స్టాఫ్‌, మెకానిక్‌లు ఉన్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ సమ్మె కొనసాగుతూనే ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రో‘హిట్‌’ ఇన్నింగ్స్‌

విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్‌ హవా కొనసాగుతోంది. భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మ (127) మరోసారి తన అసాధారణ ప్రతిభతో సత్తాచాటాడు. హిట్‌మ్యాన్‌కు తోడుగా నయావాల్‌ పుజారా (81) అర్ధశతకంతో మెరవడంతో దక్షిణాఫ్రికాకు భారత్‌ 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 11/1 స్కోరుతో నిలిచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.