close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అరెస్టయ్యారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం ఉదయం అరెస్టు చేశారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని ఎంపీడీవో సరళ ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపి కోటంరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. 40 వేలకు పైగా ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు. మరోవైపు పోలీసుల భద్రత నడుమ అధికారులు అద్దె, ఆర్టీసీ బస్సులు నడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ స్వల్ప సంఖ్యలో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడే సద్దుల బతుకమ్మ

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. తొమ్మిదిరోజుల పండుగలో చివరి రోజున వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాలు, గ్రామాల్లో వీటిని నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. దుర్గాదేవిగా కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. దేవతలందరి శక్తులు కలగలసిన మహోన్నతమైన శక్తిరూపం ఈ తల్లి. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. నదుల అనుసంధానానికి ఆశీస్సులివ్వండి

నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థను మలుపుతిప్పే గొప్ప ప్రాజెక్టు అని, దీనికి మద్దతిచ్చేలా కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులకు ఆదేశాలివ్వాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన నవరత్నాలకు చేయూతనివ్వాలనీ కోరారు. దిల్లీలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం కలిశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పోస్టింగ్‌ ఇచ్చారు...రాజీనామా చేయాలన్నారు!

చిత్తూరు జిల్లాలో ఇటీవల వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శుల పోస్టులకు బీకాం డిగ్రీ అర్హతతో నియమితులైన వారిని రాజీనామా చేయాలని అధికారులు సూచించడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శుల పోస్టులకు బీకాం డిగ్రీతో ఎంపికైన అభ్యర్థులు జిల్లాలో 41మంది ఉన్నారు. తాజాగా ఈ పోస్టుకు బీకాం డిగ్రీ ఉన్న అభ్యర్థులు అనర్హులని.. వెంటనే రాజీనామా చేయాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అవే వెలుగులు.. తక్కువ కాలుష్యం

తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే హరిత టపాసులు(బాణసంచా) అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకటి బాణసంచాలాగే శబ్దం, వెలుగు ఇచ్చినప్పటికీ కాలుష్యాన్ని 30 నుంచి 90% వరకు తగ్గించే శక్తి ఈ టపాసులకుంది. హరిత బాణసంచాను కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ శనివారం ప్రదర్శించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘సెంటర్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ సైంటిఫిక్‌ రిసెర్చి’ (సీఐఎస్‌ఆర్‌) వీటిని తయారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అమరులైన సైనికుల కుటుంబాలకు అదనపు సాయం

సైన్యంలో సేవలందిస్తూ అమరులైనవారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని రూ.8 లక్షలకు పెంచడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. సరళీకృత కుటుంబ పింఛను, సైనిక బృంద బీమా పథకం కింద లభించే పరిహారం (రూ.40 లక్షల నుంచి రూ.75 లక్షలు), ఎక్స్‌గ్రేషియా (రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షలు), సైనిక సంక్షేమ నిధి మొత్తాలకు ఇది అదనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆరోగ్య బీమా ఉంటేనే అమెరికాకు

అమెరికాకు వలస రావాలని ప్రయత్నించే వారికి ఆరోగ్య బీమా లేకపోతే తిప్పలే. ఈ బీమా లేనివారు, వైద్య ఖర్చుల్ని సొంతంగా భరించగలమని నిరూపించుకోలేనివారు ‘ఇమ్మిగ్రెంట్‌ వీసా’ ద్వారా రావడాన్ని ఇకపై అనుమతించరు. ఆరోగ్య రక్షణ వ్యవస్థను, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రిలేలో భారత జట్లు విఫలం

ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ రిలేలో సత్తా చాటిన భారత జట్టు.. పురుషుల, మహిళల రిలేలో మాత్రం విఫలమైంది. శనివారం జరిగిన మహిళల 4×400 మీ రిలేలో హీట్‌-1లో పోటీపడిన భారత్‌ బృందం (జిస్నా, పూవమ్మ, విస్మయ, శుభ)   3 నిమిషాల 29.42 సెకన్లలో లక్ష్యాన్ని దాటి ఆరో స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో మహ్మద్‌ అనాస్‌, జీవన్‌, నిర్మల్‌, జాకబ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 03.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.