close

తాజా వార్తలు

విశాఖలో విజయం.. మరి పుణె, రాంచీ సంగతేంటీ!

పుణెలో కోహ్లీసేనకు ఘోర పరాభవం

రాంచీలో రవీంద్ర జడేజా కీలకం

ఉపఖండంలో పర్యటన అనగానే ప్రత్యర్థి అన్నిటికన్నా ముందుగా ఆలోచించేది ‘పిచ్‌’ల గురించే! తరాలుగా భారత్‌ స్పిన్‌ పిచ్‌లకు పెట్టింది పేరు. మహామహులను సైతం గింగిరాలు తిరిగే బంతులతో మాయ చేసేస్తారు మన స్పిన్నర్లు. కొన్నాళ్లుగా ధర్మశాల వంటి వేదికలు పేస్‌ వికెట్లకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ అగ్రతాంబూలం మాత్రం స్పిన్‌ పిచ్‌లకే. 2015లో వన్డే, టీ20 సిరీస్‌లు కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికాను సుదీర్ఘ ఫార్మాట్లో 3-0తో బోల్తా కొట్టించింది స్పిన్‌ పిచ్‌లపైనే. మరి ఈ సారి ఆతిథ్యమిస్తున్న వేదికల విశేషాలు తెలుసుకుందామా!!


నంబర్‌ 1కు గర్వభంగం

దక్షిణాఫ్రికాతో క్రికెట్‌ శత్రుత్వం ఈనాటి కాదు. రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 2015 పర్యటన మాత్రం సఫారీలకు ఓ పీడకల. వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకొని టెస్టులకు సిద్ధమైన పర్యాటక జట్టుకు 3-0తో టీమిండియా గర్వభంగం కలిగించింది. ఆ సిరీస్‌లో బీసీసీఐ దాదాపు స్పిన్‌ పిచ్‌లే రూపొందించింది. మొహాలితో మొదలైన ఈ దాడి బెంగళూరు, నాగ్‌పుర్‌ మీదుగా సాగి దిల్లీలో ముగిసింది. అశ్విన్‌, జడేజా అద్భుతాలు చేశారంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికా మిస్టరీ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ సైతం రాణించాడు. యాష్‌ 31 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. జడ్డూ 23తో రెండో స్థానంలో నిలిచాడు. తాహిర్‌ 14, అమిత్‌ మిశ్రా 7, డేన్‌ పీడ్‌ 4 వికెట్లు తీశారు. నాగ్‌పుర్‌, దిల్లీలో సఫారీలు విలవిల్లాడారు. అందుకే ఈ సారీ టీమిండియా స్పిన్‌ పిచ్‌లకే ప్రాధాన్యమిస్తోంది! గతంలో నాగ్‌పుర్‌లో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి. పిచ్‌ ఎగుడు దిగుడుగా ఉండి బీటలు వారడంతో ఐసీసీ చెత్త రేటింగ్‌ ఇచ్చింది. ఇలాంటి విమర్శలు రాకుండా మాత్రం జాగ్రత్తపడాల్సి ఉంటుంది.


విశాఖలో ఓపెనర్ల జోరు స్పిన్నర్ల హోరు

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన మూడు టెస్టుల్లో తలపడనుంది. ఒక్కో మ్యాచ్‌కు 40 పాయింట్లు. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి డబ్ల్యూటీసీలో ఎక్కువ పాయింట్లతో ఆధిక్యంలో ఉండాలన్నది భారత్‌ పట్టుదల. ఈసారి విశాఖపట్నం, పుణె, రాంచీ వేదికలు. 2015లో ఈ మైదానాలకు బీసీసీఐ టెస్టు హోదా కల్పించింది. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం. తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (215) ద్విశతకం, ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ (176, 127) వరుస శతకాలు, డీన్‌ ఎల్గర్‌ (160), డికాక్‌ (111) శతకాలే అందుకు ఉదాహరణ. అయితే స్పిన్నర్లు ఇక్కడ ప్రభావం చూపిస్తున్నారు. అశ్విన్‌ 8, జడ్డూ 6 వికెట్లు పడగొట్టారు. రివర్స్‌స్వింగ్‌తో షమి 5 వికెట్లు సాధించాడు. ఇక మిగతా పిచ్‌ల పరిస్థితి ఏంటో చూద్దాం.


ఘోర పరాభవం పుణెలో అనుభవం

రెండో టెస్టు ఈ నెల 10న మొదలవుతుంది. పుణె వేదిక. 2011లో మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం దీనిని ప్రారంభించింది. ఇక్కడ ఒకే టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మ్యాచ్‌ సాగే కొద్దీ స్పిన్నర్లు కీలకంగా మారతారు. ఎండకు పిచ్‌ బీటలు వారి పొడిగా మారితే అశ్విన్‌, జడేజా దుమ్మురేపే అవకాశం ఉంది. ఈ వికెట్‌ అంటే మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఎంతో ఇష్టం. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ఐసీసీ దీనికి పేలవ రేటింగ్‌ ఇచ్చింది.

అప్పుడేం జరిగింది?

భారత్‌, ఆస్ట్రేలియా 2017 ఫిబ్రవరి 23న ఇక్కడ తలపడ్డాయి. మ్యాచ్ 3 రోజుల్లోనే ముగిసింది. ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుకు ఘోర పరాజయం రుచి చూపింది. కంగారు స్పిన్నర్‌ జాన్‌ ఓకీఫ్‌ రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 12 వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మ్యాట్‌ రెన్షా, మిచెల్‌ స్టార్క్‌ అర్ధశతకాలతో తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసింది. భారత్‌ 105కే కుప్పకూలి షాకిచ్చింది. కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే అర్ధశతకం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ (109) శతకంతో ఆసీస్‌ 285 పరుగులు చేసింది. అదే రోజు కోహ్లీసేనను ఆసీస్‌ కంగారు పెట్టించింది. 107కే కుప్పకూల్చి విజయం సాధించింది. టీమిండియా ఇన్నింగ్స్‌ కేవలం 124 నిమిషాలే సాగడం గమనార్హం.


ధోనీ రాంచీ జడ్డూ అడ్డా

మూడో టెస్టు 19 నుంచి మొదలవుతుంది. ఇక్కడా ఒకే టెస్టు జరిగింది. అదీ భారత్‌, ఆసీస్‌ మధ్యే కావడం గమనార్హం. 2013లో ఇక్కడ మొదటి వన్డే జరిగింది. ఈ స్టేడియాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. శీతాకాలంలో పొడవు నీడలు పడకుండా జాగ్రత్తగా నిర్మించారు. బౌండరీలు పెద్దవి కావడంతో స్పిన్నర్లు కీలకం అవుతారు. బంతిపై పట్టు దొరుకుతుంది. బాగా టర్న్‌ అవుతుంది. ఎడమ చేతివాటం స్పిన్నర్లకు ఈ పిచ్‌ అనుకూలిస్తుంది. జడ్డూ ఇక్కడ విజయవంతం అయ్యాడు. నిలిస్తే బ్యాట్స్‌మెన్‌ సైతం పరుగులు చేయగలరు.

అప్పుడేం జరిగింది?

తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 451 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్‌ (178*), మ్యాక్స్‌వెల్‌ (104) శతకాలు బాదారు. పరుగులు ఇచ్చినప్పటికీ జడేజా 5 వికెట్లు తీయడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా దీటుగా బదులిచ్చింది. ఛెతేశ్వర్‌ పుజారా (202), వృద్ధిమాన్‌ సాహా (117) అద్భుత శతకాలు సాధించారు. మురళీ విజయ్‌ (82), కేఎల్‌ రాహుల్‌ (67), జడేజా (54*) రాణించడంతో 603/9 వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. ఆఖరి రోజు సమయం తక్కువగా ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను త్వరగా ఆలౌట్‌ చేసేందుకు టీమిండియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ షాన్‌ మార్ష్‌ (53), హ్యాండ్స్‌కాంబ్‌ (72*) పోరాడటంతో కుదర్లేదు. ఐదోరోజు ఆట ముగిసే సరికి ఆసీస్‌ 204/6తో నిలవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ 4 వికెట్లు తీశాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.