close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆర్టీసీ సమ్మె యథాతథం: అశ్వత్థామరెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని కార్మిక సంఘాల ఐకాస స్పష్టం చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఐకాస నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెదేపా, తెజస, సీపీఎం, సీపీఐ సహా పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. సమ్మెకు తమ మద్దతు కొనసాగుతుందని రాజకీయ పార్టీల నేతలు పునరుద్ఘాటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక నిర్ణయం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కృష్ణానది నీటి కేటాయింపులు, వినియోగం, విడుదలపై శుక్రవారం ఉత్తర్వులు వెలువడనున్నాయి. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ జలసౌధలో జరిగిన కృష్ణానది యాజమాన్యబోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు వాడుకున్న నీటి వినియోగం, రబీ పంట కాలానికి అవసరమయ్యే నీటి కేటాయింపులు, పంపకాలు, ఇతర ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బోటు ప్రమాదం మానవతప్పిదమే: కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై తెలుగుదేశం నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వ హయాంలో బోటు ప్రమాదాలు జరిగినప్పుడే నిబంధనలు కఠినతరం చేసి ఉంటే ప్రస్తుత ప్రమాదం జరిగేదా అని ప్రశ్నించారు. గురువారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ... కచ్చులూరు బోటు ప్రమాదం మానవ తప్పిదమని.. ప్రభుత్వ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సమ్మె సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నివేదిక అందజేసింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ నివేదికను గురువారం సమర్పించారు. ప్రజా రవాణా కోసం 8,150 వాహనాలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చైనాకు కష్టకాలం నడుస్తోంది: ట్రంప్‌

ప్రస్తుతం  చైనా కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని, అందుకే అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా నుంచి వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌, ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యూనిచ్‌, చైనా నుంచి వైస్‌ ప్రీమియర్‌ లు హీలు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కార్మికులను తొలగిస్తే చూస్తూ ఊరుకోం: లక్ష్మణ్‌

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన భాజపా నేతలు గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను గవర్నర్‌కు వివరించారు. అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు 40 రోజుల క్రితం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి  సమ్మె నోటీసు ఇచ్చినా స్పందించలేదన్నారు. కార్మికులను తొలగిస్తామంటే ఊరుకోమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రకాశ్‌నగర్‌ మెట్రో గోడపై పగుళ్లు

నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో గోడల మీద ఏర్పడిన పగుళ్లు ప్రయాణికులను భయపెడుతున్నాయి. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడిపడి ఓ మహిళ మృతిచెందిన ఘటన మరువకముందే మరో మెట్రో స్టేషన్‌లో గోడలపై ఏర్పడిన పగుళ్లు నాణ్యతాలోపాలను ఎత్తిచూపుతున్నాయి. తాజాగా.. బేగంపేట సమీపంలోని ప్రకాశ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ గోడపై ఏర్పడిన పగుళ్లను ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఈఎస్‌ఐ పత్రాలు ఇళ్లలోకి ఎలా చేరాయి?

ఈఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితుల రెండ్రోజుల కస్టడీ ముగిసింది. ఈరోజు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగింది. మందుల కొనుగోళ్లు, ఫార్మాకంపెనీల టెండర్లు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరాతీశారు. డైరెక్టరేట్‌లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోకి ఎలా చేరాయని  ప్రశ్నించినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. జేపీ నడ్డాకు జడ్‌ కేటగిరీ భద్రత

భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్రం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించింది. ఇకపై ఆయన చుట్టూ సీఆర్‌పీఎఫ్‌ కమాండోలు భద్రతగా నిలవనున్నారు. దాదాపు గత నాలుగు నెలలుగా అధికార పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందన్న భావనతో  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఎక్కడకు వెళ్లినా ఆయనకు ఇదే రకమైన భద్రత కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మయాంక్‌ ‘మాయ’: తొలిరోజు భారత్‌ 273/3

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లీసేన ఆధిపత్యం దిశగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. ప్రత్యర్థి పేసర్‌ రబాడ (3/48) చురకత్తుల్లాంటి బంతులు సంధించాడు.తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో శతకాలు బాదిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (14) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (108) తన సాధికారిక బ్యాటింగ్‌తో అద్వితీయ శతకం అందుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.