close

తాజా వార్తలు

మోదీ-జిన్‌పింగ్‌ భేటీకి మహాబలిపురం ముస్తాబు

కట్టుదిట్టమైన భద్రత

చెన్నై విమానాశ్రయ ప్రాంతంలో అరటి చెట్లు, చెరకు గెడలతో స్వాగత
తోరణాలు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

భారత్‌, చైనా సత్సంబంధాల బలోపేతానికి వేదికగా భావిస్తున్న అనధికార శిఖరాగ్ర చర్చలకు తరుణం సమీపించింది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేడు చెన్నై చేరుకోనున్నారు. వారికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరు నేతలు ప్రయాణించనున్న మార్గాల్లో శుక్ర, శనివారాలు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. చర్చలకు వేదిక కానున్న మహాబలిపురం, పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మహాబలిపురంలో జరుగుతున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి పళనిస్వామి గురు వారం సాయంత్రం పరిశీలించారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు, పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.
కాంచీపురం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం మొదలుకొని మహాబలిపురం వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చెన్నై నగరంలో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. జీఎస్టీ రోడ్డు, అన్నాసాలై, పటేల్‌ రోడ్డు, రాజీవ్‌ గాంధీ రోడ్డు, ఈసీఆర్‌లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద వాహనాల రాకపోకలను నిషేధించారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు పెరుంగళూత్తరు నుంచి జీఎస్టీ రోడ్డులో వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. పెరుంగళత్తూరు నుంచి చెన్నై మహా నగరంలోకి ప్రవేశించే వాహనాలన్నింటినీ మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డు మీదుగా మళ్లించారు. రాజీవ్‌ గాంధీ రోడ్డు, ఈస్టు కోస్టు రోడ్డు తదితర మార్గాల్లో ఉన్న వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. 100 అడుగుల రోడ్డులో చైనా అధ్యక్షుడు వెళుతున్న సందర్భంగా తాంబరం, క్రోంపేటై మార్గాల నుంచి వచ్చే వాహనాలు పల్లావరం రేడియల్‌ రోడ్డుపై వెళ్లేలా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 100 అడుగుల రోడ్డు మార్గంలో వాహన రాకపోకలను అనుమతించారు.


మహాబలిపురంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి, తదితరులు

మొదట మోదీ..
ముందుగా మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకోనున్నారు. తర్వాత 1.30 గంటలకు చెన్నై చేరుకొనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విమానాశ్రయంలో గవర్నరు బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి తదితరులు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయంలో రాష్ట్ర పారంపర్య కళలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి జిన్‌పింగ్‌ విశాంత్రి తీసుకోనున్న గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌ వరకు స్వాగత ఏర్పాట్లు చేశారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత జిన్‌పింగ్‌ సాయంత్రం 4 గంటలకు మహాబలిపురం బయలుదేరతారు. ఈ సందర్భంగా గిండీ నుంచి మహాబలిపురం వరకు 34 ప్రాంతాల్లో రాష్ట్రంతోపాటు దేశంలో ప్రాచుర్యం పొందిన 34 సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు, మహిళా స్వయం సహాయ బృందాలు స్వాగతం పలకనున్నాయి. సాయంత్రం 4.55 గంటలకు మహాబలిపురంలో అర్జున తపస్సు వద్దకు చేరుకోగానే ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ఇరువురు నేతలు కోవలంలోని తాజ్‌ ఫిషర్‌మెన్‌ హోటల్‌కు చేరుకొంటారు. శనివారం ఉదయం జిన్‌పింగ్‌ ఉదయం 9.05 గంటలకు గిండి నుంచి బయలుదేరి మోదీ ఉన్న కోవలం హోటల్‌కు చేరుకుని అల్పాహారం తీసుకున్న తరువాత మోదీతో చర్చలు ప్రారంభించనున్నారు. ఇరువురు నేతలు పర్యటిస్తున్న ప్రాంతాలతో పాటు హోటళ్లకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నారు. చెన్నై విమానాశ్రయంలో పరంగిమలై డిప్యూటీ కమిషనర్‌ ప్రభాకర్‌ నేతృత్వంలో ముగ్గురు సహాయ కమిషనర్లు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 21 మంది ఎస్సైలు, 120 మంది కానిస్టేబుళ్లు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు బయటకు వచ్చేదారిలో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఆరుగురు సహాయ కమిషనర్లు, 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 48 మంది ఎస్సైలు, 300 మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. గిండీలో జిన్‌పింగ్‌ బసచేయనున్న ఐటీసీ గ్రాండు చోళా హోటల్‌కు సేలం డీఐజీ నేతృత్వంలో ఏడంచెల భద్రత కల్పించారు. ఆయన నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, నలుగురు సహాయ కమిషనర్లు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 36 మంది ఎస్సైలు, 300 మంది పోలీసులతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి మహాబలిపురం వరకు 52 కిలోమీటర్ల దూరం 8 మంది డిప్యూటీ కమిషనర్లు, ఇద్దరు అదనపు కమిషనర్లు, 90 మంది ఇన్‌స్పెక్టర్లు, 270 మంది ఎస్సైలు, 15వేల మంది పోలీసులతో కనివిని ఎరుగని విధంగా భద్రత కల్పిస్తున్నారు. జిన్‌పింగ్‌ ప్రయాణించే మార్గంలో ఏదైనా సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గంలో తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పోలీసు ఉన్నతాధికారుల పేర్కొన్నారు. మహాబలిపురంలో భద్రతపై గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో డీజీపీ త్రిపాఠి సమీక్షించారు. అదేసమయంలో మహాబలిపురం తీరప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు.


విమానాశ్రయం నుంచి హోటల్‌ వరకు వాహన శ్రేణి ట్రయల్‌ రన్‌

12న చారిత్రక ప్రాంతాల సందర్శన: శిఖరాగ్ర సదస్సు ముగిసిన తరువాత జిన్‌పింగ్‌తో కలిసి శనివారం మహాబలిపురంలోని సీషోర్‌ టెంపుల్‌, అర్జున తపస్సు, ఐదు రథాలు, వెన్న ముద్దరాయి మొదలైన చారిత్రక చిహ్నాలను మోదీ సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి సీషోర్‌ టెంపుల్‌ వద్ద సాంస్కృతిక కార్యాక్రమాల కోసం రెండు ఆడిటోరియాలు, పచ్చిక మైదానాలను సిద్ధం చేశారు.

ప్రత్యేక విమానంలో వచ్చిన కార్లు

జిన్‌పింగ్‌ పర్యటన నేపథ్యంలో చైనా నుంచి నాలుగు అధునాతన కార్లు ప్రత్యేక కార్గో విమానంలో చెన్నై విమానాశయ్రానికి బుధవారం రాత్రి వచ్చాయి. ఈ కార్లను గిండి నుంచి మహాబలిపురం వరకు జిన్‌పింగ్‌ వెళ్లడానికి వాడనున్నారు. ఈ అధునాతన కారు 8 సెకన్‌లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని, 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తు ఉన్న దీని బరువు 3,152 కిలోలుగా అధికారులు తెలిపారు. చిన్నమలై- మీనంబాక్కం మధ్య మెట్రో రైళ్ల నిలిపివేత

ఆర్కేనగర్‌: చైనా అధ్యక్షుడు నగరానికి వచ్చే సమయంలో చిన్నమలై నుంచి మీనంబాక్కం మధ్య మెట్రో రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి రానున్న జిన్‌పింగ్‌ గిండిలోని ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌కు 1.45 గంటలకు చేరుకుంటారు. ఆ సమయంలో విమానాశ్రయానికి సమీపంలోని రైల్వే స్టేషన్‌లలో అన్ని రైళ్లను ఆపేస్తామన్నారు. కొన్ని మార్గాల్లో ఆలస్యంగా నడపనున్నారు. చిన్నమలై నుంచి మీనంబాక్కం వరకు రైల్వే స్టేషన్‌లలో అదనపు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.