close

తాజా వార్తలు

మనసు.. సొగసు కలిసినవేళ విరాట్‌ విధ్వంసమేగా!

అందం.. విధ్వంసం.. పొందికలేని పదాలివి. కలిపి వాడటం కష్టం. అదేంటో..! టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికాపై సాధించిన ద్విశతకాన్ని ‘అందమైన విధ్వంసం’గా అభివర్ణించొచ్చు అనిపిస్తోంది. క్రీజులో అతడి పాదాల కదలికలు భరతనాట్యంలో భంగిమలను తలపించాయి. వికెట్ల మధ్యన పరుగులు అతడి శారీరక దృఢత్వాన్ని చెప్పకనే చెప్పాయి. క్రీజులో గడిపిన దాదాపు 8గంటలు జిమ్‌లో అతడి కసరత్తుల ఫలితాలే అనడంలో సందేహం ఏముందీ! సఫారీలతో పోరులో బద్దలుకొట్టిన రికార్డులను చూస్తుంటే ‘అంతటి క్రికెటర్‌ లేడన్నది’ నిజమేనేమో అనిపిస్తోంది!!


ఎప్పటికీ ప్రత్యేకమే!

భారత క్రికెట్‌ చరిత్రలో పరుగుల వరద పారించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరి ఆట వారిదే. ఒకరితో మరొకరికి పోలిక కష్టం. సచిన్‌ శతకాలు, వీరూ విధ్వంసాలు, దాదా దూకుడు, మహీ ప్రశాంతత అభిమానులకు కొత్తేమీ కాదు. తమ తమ శైలిలో వారంతా అలరించారు. కానీ విరాట్‌ కోహ్లీ అందించే ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. మైదానంలో అతడి ఉనికి సహచరుల్లో స్ఫూర్తి రగిలిస్తుంది. పరుగుల వరద పారించేందుకు ప్రేరణనిస్తుంది. క్రీజులో అతడి కదలికలు నృత్య భంగిమలను తలపిస్తాయి. అడుగు ముందుకేసి డిఫెన్స్‌ ఆడినా, దేహం మీదికి వచ్చే బంతుల్ని షార్ట్‌ ఆర్మ్‌ జబ్‌తో సిక్సర్‌గా మలిచినా, ఆఫ్‌సైడ్‌ ఫీల్డర్ల మధ్యలోంచి తన ట్రేడ్‌మార్క్‌ సొగసరి కవర్‌డ్రైవ్‌లతో బంతిని సరిహద్దు దాటించినా అందమే కనిపిస్తుంది. చూపరులకు పరవశాన్ని కలిగిస్తుంది. విధ్వంసాన్నీ ఎంత కళాత్మకంగా సృష్టించగలడో అనిపిస్తుంది. అరె..! భలే ఆడాడు కదా! అనాలనిపిస్తుంది. ప్రత్యర్థికి మాత్రమే ఇంకెప్పుడు ఔటౌతాడ్రా బాబూ! అని అరవాలనిపిస్తుంది!! ఎందుకంటే ప్రతి మ్యాచ్‌ను అతడు ఆఖరిదిగా భావించి మనసు పెట్టి ఆడతాడు.


ద్విశతకం విన్యాసం

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో కోహ్లీ ద్విశతకం ఓ అద్భుత విన్యాసమే. చురకత్తుల్లాంటి బంతులతో సవాల్‌ విసిరిన రబాడను ఎంతో గౌరవించాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో వేసిన బంతుల్ని సమర్థంగా అడ్డుకున్నాడు. వికెట్ల మధ్య చకచకా సింగిల్స్‌, డబుల్స్‌ తీశాడు. అందివచ్చిన బంతుల్ని సొగసైన బౌండరీలుగా మలిచాడు. తనదైన శైలిలో ప్రత్యర్థుల్ని కవ్వించాడు. ఐపీఎల్‌ వంటి మెరుపుల టోర్నీలు ఎన్నొచ్చినప్పటికీ సుదీర్ఘ ఫార్మాటే తనకు అత్యంత ఇష్టమనే కోహ్లీ అందుకే గంటల కొద్దీ క్రీజులో ఓర్పుతో ఉండగలడు. కఠిన బౌలింగ్‌ను ఎదుర్కోగలడు. అందుకే రికార్డులెన్నో బద్దలయ్యాయి. ఫిలాండర్‌ వేసిన 108.4వ బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ టెస్టుల్లో 26వ శతకం బాదేశాడు. పది ఇన్నింగ్సుల తర్వాత అతడు  సాధించిన సెంచరీ ఇది. కెప్టెన్‌గా 19 శతకాలు సాధించిన ఆసీస్‌ మాజీ సారథి పాంటింగ్‌ సరసన నిలిచాడు. సఫారీ మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ (25 శతకాలు) రికార్డును బద్దలు కొట్టేందుకు తహతహలాడుతున్నాడు.


అందమైన విధ్వంసం

సెంచరీ తర్వాత వేగంగా 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు విరాట్‌. కెప్టెన్‌గా తొమ్మిదోసారి 150+ స్కోరుతో బ్రాడ్‌మన్‌ (8 సార్లు) రికార్డు బద్దలు కొట్టేశాడు. వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో ద్విశతకం అందుకున్నాడు. భారత్‌ తరఫున అత్యధిక ద్విశతకాలు సాధించిన సచిన్‌ (6), సెహ్వాగ్‌ (6)ను దాటేశాడు. ద్రవిడ్‌ (5), గావస్కర్‌ (4) వారి వెనక ఉన్నారు. 138వ ఇన్నింగ్స్‌లో 7000 పరుగులు చేసిన గ్యారీ సోబర్స్‌, సంగక్కర సరసన నిలిచాడు. వీరంతా వేగంగా ఆ ఘనత సాధించి మూడో స్థానంలో సమంగా ఉన్నారు. విరాట్‌ 6 దేశాలపై డబుల్‌ సెంచరీలు కొట్టాడు. శ్రీలంకపై రెండు సార్లు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌పై ఒక్కోసారి చేశాడు. పెద్ద జట్లలో ఆస్ట్రేలియాపై మాత్రమే అతడు బాకీ ఉన్నాడు. ద్విశతకం తర్వాత గేరు మార్చిన కోహ్లీ తన అత్యధిక పరుగుల రికార్డు 243ను దాటేశాడు. 254తో అజేయంగా నిలిచాడు. రహానెతో నాలుగో వికెట్‌కు 178 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జడ్డూ (91)తో పోటీపడుతూ 237 బంతుల్లోనే 225 పరుగుల భాగస్వామ్యం అతడి కసికి ఉదాహరణ. అతడో ‘కసి తీరని పరుగుల వీరుడు’. కోహ్లీ సారథ్యంలో టీమిండియా పదోసారి 600+ స్కోరు సాధించడం గమనార్హం. అటు సారథిగా, ఇటు బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డులతో ‘విరాట్‌ శకం’ను అద్వితీయంగా, అప్రతిహతంగా సృష్టించుకుంటున్నాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.