close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభానికి మోదీ

వచ్చే నెలలో పూర్తి కానున్న కర్తార్‌పూర్‌ నడవాను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ప్రకటించారు. నవంబరు 8న డేరా బాబా నానక్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని ఆమె ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సహా రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అన్నారు. ఈ రోజున సీఎం అమరీందర్‌ సింగ్‌ మొదటి బ్యాచ్‌ యాత్రికులతో సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్లి, గురుద్వారా సాహిబ్‌ను దర్శించుకుంటారని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం:ఖమ్మంలో ఉద్రిక్తత

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ఖమ్మం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి  ఇవాళ మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో చిక్కుకున్న తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన అతని కుమారుడికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డికి 80శాతంపైగా కాలిన గాయాలయ్యాయని, హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ బస్సు అద్దాలు పగులకొట్టడంతో ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రోజుకు లక్ష టన్నుల ఇసుక సరఫరా: పెద్దిరెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ప్రభుత్వం దృష్టిసారించిందని.. వారం రోజుల్లోగా ఇసుక సమస్యను అధిగమిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇసుక సమస్యపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మైనింగ్‌ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లు, స్టాక్ యార్డుల పరిస్థితులను అధికారులు మంత్రికి వివరించారు. ఇసుక సరఫరా రోజుకు లక్ష టన్నులకు పెంచాలని.. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దేశంలో ఆర్థిక మందగమనం ఎక్కడుంది..?

దేశంలో ఆర్థిక మందగమనం లేదని, తాజాగా విడుదలైన మూడు సినిమాలు ఇప్పటిదాకా రూ.120 కోట్లు రాబట్టడమే ఇందుకు నిదర్శనమని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చమత్కరించారు. ముంబయిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో అక్టోబరు 2న విడుదలైన ప్రధానమైన మూడు సినిమాలు ఇప్పటివరకూ రూ.120 కోట్లు వసూలు చేశాయని, దేశంలో ఆర్థిక మందగమనం లేనేలేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబు చర్చకు రావాలి: అవంతి

రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుందంటున్న చంద్రబాబు ఈ అంశంపై చర్చకు రావాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ, పోలీసులను బెదిరించేలా తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఫ్యూజు పోయి కరెంటు పోతే ..దానిపైనా సీఎం జగన్‌ను విమర్శించటం సరికాదన్నారు. మంచి విమర్శలు చేస్తే తమ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జిన్‌పింగ్‌కు మోదీ అపురూప కానుక

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ అపురూప కానుకను బహుకరించారు. పర్యటనలో చివరి రోజైన శనివారం  జిన్‌పింగ్‌ చిత్రంతో కూడిన ఒక పట్టు చేనేత వస్త్రాన్ని మోదీ ఆయనకు అందజేశారు. ఈ వస్త్రాన్ని కోయంబత్తూర్‌లోని శ్రీరామలింగ సౌదాంబిగై చేనేత కళాకారుల సంఘం వారు ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని చైనా జాతీయ పతాకం రంగు ఎరుపు కావడంతో ఈ కానుకను కూడా ప్రధానంగా ఎరుపు రంగు వస్త్రంపై తయారు చేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలో మరో ఉన్మాది పేట్రేగిపోయాడు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో  గుర్తు తెలియని వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు న్యూయార్క్‌ పోలీస్‌ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. నిందితుడ్ని గుర్తించాల్సి ఉందని, ఈ కాల్పులకు ఎందుకు తెగబడ్డాడన్నది విచారణలో వెలికితీస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రూ.1,260 కోట్ల మళ్లింపు..!

రూ.1,260 కోట్ల మేరకు రెలిగేర్ నిధులను మాల్వీందర్‌సింగ్‌ సంస్థ ఆర్‌హెచ్‌ఎస్‌ హోల్డింగ్స్‌లోకి మళ్లించినట్లు ఎకనామిక్‌ అఫెన్స్‌ వింగ్‌ వెల్లడించింది. ఆ సంస్థ ఈ విషయాన్ని దిల్లీ కోర్టులో పేర్కొంది. సెబీ నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపింది. రుణాలను రుణగ్రీహీతలు చేతులు మారుస్తూ నిధులను మళ్లించినట్లు ఈ దర్యాప్తులో తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రపంచ బాక్సింగ్‌: ఫైనల్లో మంజురాణి

భారత బాక్సర్‌ మంజురాణి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్స్‌ 48 కేజీల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో థాయిలాండ్‌ క్రీడాకారిణి రాక్షత్‌ను 4-1 తేడాతో ఆమె మట్టికరిపించింది. దీంతో మంజు పసిడికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. హరియాణాకు చెందిన ఆమె క్వార్టర్స్‌లో ఉత్తరకొరియా బాక్సర్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అశ్విన్‌ జోరు: సఫారీసేన 275 ఆలౌట్‌

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్వింటన్‌ డికాక్‌ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ (64; 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.