close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ -9 AM

1. గురుకులాలకూ 19 వరకు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో గురుకుల పాఠశాలలకూ ఈ నెల 19 వరకు ఆయా సొసైటీలు సెలవులు ప్రకటించాయి. ముందుగా వచ్చిన విద్యార్థులకు ఏర్పాట్లు చేశామని, వారిని తిరిగి ఇళ్లకు పంపించబోమని ఆదివారం స్పష్టం చేశాయి. 

2. కండక్టర్‌ ఆత్మహత్య

ఆర్టీసీ సమ్మె ఉద్ధృతమవుతున్న క్రమంలో ఆదివారం రాత్రి నగరంలో ఓ ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు.  ఉద్యోగం నుంచి తొలగిస్తారనే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన గోషామహల్‌ డివిజన్‌, కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నవబంర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో నవంబరు ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అమల్లోకి తెస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంబంధిత ఆస్తుల క్రయవిక్రయదారులే పత్రాలు తయారు చేసుకుని ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ రుసుములు చెల్లించేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. శ్రీకాళహస్తి ఆలయానికి రూ.15 కోట్ల ఆస్తి విరాళం

తమిళనాడులోని పొన్నేరి సమీప మీంజూరుకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీఆర్‌ భగవాన్‌ రూ.15 కోట్ల విలువైన ఆస్తులను చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ముక్కంటి ఆలయానికి విరాళంగా ఇచ్చారు. మీంజూరులోని తన ఇల్లు, వ్యాపార భవన సముదాయం, దాని వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పొన్నేరి రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ముక్కంటి ఆలయం పేరిట శుక్రవారం రిజిస్టర్‌ చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తమిళనాడులో ‘చిన్న’ శ్రీహరికోట!

రోదసి ప్రయోగాల కోసం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఇందుకు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కులశేఖరపట్నం వేదిక కానుంది. ఇక్కడ చిన్న ఉపగ్రహ ప్రయోగాల కోసం అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 370 మళ్లీ తెస్తామని చెప్పగలరా?

జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు అంశంపై కాంగ్రెస్‌, ఎన్‌సీపీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధైర్యముంటే సదరు నిబంధనను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనాలని ఆ పార్టీలకు సవాల్‌ విసిరారు. అలా చేస్తే విపక్షాలకు భవిష్యత్‌ ఉండదన్నారు. ఆదివారం ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే పాక్‌ ముక్కలే: రాజ్‌నాథ్‌

ఉగ్రవాదుల అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఘాటైన హెచ్చరిక చేశారు. ముష్కర మూకలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఆ దేశం ముక్కలు కాక తప్పదన్నారు. కశ్మీర్‌పై దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు స్పష్టంచేశారు. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చర్యలు తీసుకోవడంలేదని రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. తల్లీబిడ్డల ఆరోగ్యానికి నూతన సూచీలు

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యాచరణను సిద్ధం చేసింది. బాలింత మరణాలను ప్రతి లక్ష ప్రసవాలకు 70కి తగ్గించాలని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. అయిదేళ్లలోపు చిన్నారుల మరణాలను ప్రతి వెయ్యి జననాలకు 23కు తగ్గించే దిశగా కృషిచేయాలని దిశానిర్దేశం చేసింది. 2025 నాటికి సాధించాల్సిన నూతన ఆరోగ్య సూచీలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్‌

అంతర్జాతీయ ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది.. అందుకే 2019-20లో వృద్ధిరేటు అంచనాలను 6.9 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. 2020-21లో వృద్ధిరేటు 6.9 శాతం, 2021-22 నాటికి 7.2 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశాల నేపథ్యంలో, దక్షిణాసియాలోని పలు దేశాల ఆర్థిక పరిస్థితిపై ప్రపంచ బ్యాంక్‌ ఈ నివేదిక రూపొందించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ!

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా   ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. నాటకీయ పరిణామాల మధ్య గంగూలీ అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచినట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా కార్యదర్శిగా,  అరుణ్‌ ధూమల్‌ కోశాధికారిగా ఎన్నికవడం కూడా ఖరారైనట్లే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.