close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. 2019 బుకర్‌ ప్రైజ్‌ విజేతలు వీరే..

ఆంగ్ల సాహిత్యంలో ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు బుకర్‌ ప్రైజ్‌ 2019 విజేతల పేర్లు సోమవారం ప్రకటించారు. కెనడియన్‌ రచయిత మార్గరెట్‌ ఎట్‌వుడ్‌, ఆంగ్లో-నైజీరియన్‌ రచయిత బెర్నర్‌డైన్‌ ఎవరిస్టోలకు సంయుక్తంగా ఈసారి బుకర్‌ బహుమతి లభించింది. ‘టెస్టమెంట్స్‌’ అనే పుస్తకానికి గానూ మార్గరెట్‌ ఎట్‌వుడ్‌, ‘గర్ల్‌, ఉమన్‌, అదర్‌’ పుస్తక రచనకుగానూ బెర్నర్‌డైన్‌ ఎవరిస్టోకు ఈ అవార్డు దక్కింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రైతుబంధుకు రూ. వెయ్యి కోట్లు

‘రైతుబంధు’ పథకం కింద సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ.500 కోట్లు జమచేసింది. త్వరలో మరో రూ.500 కోట్లు జమ చేయనుంది. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ముగిసిన ఖరీఫ్‌ (వానా కాలం) సీజన్‌కు ఈ పథకం కింద రూ.1700 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా సోమవారం రూ.500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో రూ.500 కోట్లను త్వరలో రైతుల ఖాతాల్లో వేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కొత్తగా 50 పురపాలక, నగర పంచాయతీలు

ఏపీ రాష్ట్రంలో 50 గ్రామ పంచాయతీలను పురపాలకసంఘాలు, నగర పంచాయతీలుగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయాన్ని తీసుకోనుంది. పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ప్రభుత్వం జీవో విడుదల చేశాక పంచాయతీరాజ్‌శాఖ డీ నోటిఫికేషన్‌, పురపాలకశాఖ నోటిఫికేషన్‌ జారీచేసి తదుపరి చర్యలు తీసుకుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. 17న సీఎం కేసీఆర్‌ సభ

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 17వ తేదీన హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తెరాస ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఖాతాలు తేలకుండానే భరోసానా?

రైతు భరోసా పేరుతో అన్నదాతలను మోసం చేసే కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంతవరకు రైతుల ఖాతాల వివరాలే తేలలేదని, ఎమ్మెల్యేలకు, చివరికి ముఖ్యమంత్రికీ లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తారేమోనని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 50 నగరాలకు భూకంప ముప్పు!

దేశవ్యాప్తంగా విజయవాడ సహా 50 నగరాలు, ఒక జిల్లా అధిక భూకంప ముప్పు కలిగిన మండలాల్లో ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. ఈ తీవ్రతను అధిగమించేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(ఎన్‌డీఎంఏ), భారత ప్రభుత్వం సంయుక్తంగా భూకంప ప్రభావిత ప్రాంతాల సూచిక నివేదికను ప్రచురించాయి. అధిక భూకంప మండలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడతో పాటు..దిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె, ముంబై, అహ్మదాబాద్‌, సిలిగురి, డార్జిలింగ్‌, చండీగఢ్‌ తదితర నగరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. థర్డ్‌ డిగ్రీ ప్రయోగం సరికాదు

కేసుల విచారణలో నిందితుల పట్ల పోలీసుల వ్యవహారశైలిని హైకోర్టు తప్పుబట్టింది. నేరాల్లో నిందితుల ప్రమేయాన్ని సూచించేలా మరిన్ని ఆధారాలను సేకరించేందుకు బదులుగా థర్డ్‌డిగ్రీ వంటి ప్రయోగాలతో బలవంతంగా ఒప్పిస్తున్నారని అభిప్రాయపడింది. ఈ తరహా పద్ధతులకు స్వస్తి చెప్పాలని, కిందిస్థాయి పోలీసులకు ఈ మేరకు అవగాహన కల్పించాలని సూచించింది. పోలీసుల చేతుల్లో గాయపడ్డవారు చికిత్స కోసం ప్రభుత్వం నుంచి పరిహారం కోరవచ్చని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విద్యుత్తు ఒప్పందాలకు మాదీ భరోసా

విద్యుత్తు కాంట్రాక్టులపై ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులతో తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదార్లు ఆందోళన చెందొద్దని, అన్ని ఒప్పందాలకు భారతదేశం కట్టుబడి ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఇంధన రంగంలో, ఇంధన భద్రతపై పెట్టుబడి పెట్టిన, పెడుతున్న వారెవరూ కూడా భయపడొద్దు అని ఇండియా ఎనర్జీ ఫోరమ్‌ సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దానశీలి శివ్‌ చక్రవర్తి

దేశంలోని అత్యంత దానశీలుడిగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు. అత్యంత శ్రీమంతుడిగా వెలుగొందుతున్న రిలయన్స్‌ ముకేశ్‌ అంబానీకి జాబితాలో మూడో స్థానం లభించడం గమనార్హం. దాతృత్వ కార్యకలాపాలకు 21 బిలియన్‌ డాలర్లు ప్రకటించిన విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానం పొందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నామినేషన్‌ వేసింది గంగూలీ ఒక్కడే

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోవడం లాంఛనమే. నాటకీయ పరిణామాల మధ్య దేశంలోని అన్ని క్రికెట్‌ సంఘాలకూ ఆమోద యోగ్యమైన అభ్యర్థిగా మారిన గంగూలీ.. సోమవారం బోర్డు అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశాడు. అనుకున్నట్లే అతడికి పోటీ లేకపోయింది. ఇంకెవ్వరూ నామినేషన్‌ వేయలేదు. అధ్యక్షుడిగా దాదా ఎన్నిక లాంఛనమే. అయితే ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికల అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.