close

తాజా వార్తలు

చిరు టెర్మినేటర్.. బాలకృష్ణ ఐరన్‌మ్యాన్‌

‘రామోజీరావుగారి ఆఫీస్‌ డోర్‌ వరకే ఆ అవకాశం ఉపయోగపడుతుంది’

టైటిల్‌ కార్డు నుంచి ఎండ్‌ కార్డు వరకూ మధ్యలో చాలా మంది డైరెక్టర్లు ఎమోషన్స్‌ చూపిస్తారు.. సెంటిమెంట్‌ చూపిస్తారు.. యాక్షన్‌ చూపిస్తారు.. కామెడీ చూపిస్తారు.. కానీ, ఈ డైరెక్టర్‌ వాటితో పాటు వైవిధ్యాన్ని చూపిస్తారు. అందుకే ప్రతి ఫ్రేమూ అతనితో ప్రేమలో పడుతుంది. అంతేకాదు, తెరపై అతని ‘అల్లరి’తో అందరినీ నవ్వేలా చేసి ‘మనసారా’ ‘నచ్చావులే’ అనేలా చేస్తుంది. ప్రయోగాలకు ప్రాణం పోసే వైద్యుడు.. వెండితెరను తన వైవిధ్యంతో ముంచి మెరిపించే దర్శకుడు రవిబాబు.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి రవిబాబు విచ్చేసి ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

మిమ్మల్ని రవి అనాలా? రవిబాబు అనాలా? రవిగారు అనాలా? ఏమని పిలవాలి?
రవిబాబు: జేమ్స్‌ అని పిలవాలి(నవ్వులు) పీజీ చేస్తుండగా అందరూ నన్ను జేమ్స్‌ అని పిలిచేవారు. ఒకసారి క్యాంటీన్‌ మెట్ల దగ్గర ఫ్రెండ్స్‌ అందరం కూర్చొని ఉంటే ఒక వ్యక్తి సూట్‌ వేసుకుని సూట్‌కేస్‌ పట్టుకుని వేగంగా నడుచుకుంటూ క్యాంటీన్‌ లోపలికి వచ్చాడు. అతను బయటకు రాగానే నేను ‘ఏయ్‌ జేమ్స్‌’ అని పిలిచా. వెనక్కి తిరిగి చూశాడు. మేమంతా ఏమీ తెలియనట్టు కూర్చొన్నాం. అదిగో అప్పటి నుంచి జేమ్స్‌ అని పిలవడం ప్రారంభించారు. 

మీ ఇంట్లో కుక్కలకు మనుషులు పేర్లు పెడతారట!
రవిబాబు: నేను పీజీ చేసి వచ్చిన తర్వాత ఒక కుక్క పిల్లను తెచ్చుకున్నా. దానికి జేమ్స్‌ అని పేరు పెట్టా. అది దాదాపు 16ఏళ్లు బతికింది. అది చచ్చిపోయిన తర్వాత వెలితిగా ఉందని మరో కుక్క పిల్లను పెంచడం మొదలు పెట్టా. సాధారణంగా అందరూ పెట్టే పేర్లు కాకుండా దానికి ‘మూర్తి’ అని పెట్టా. అయితే, కొంచెం పెద్దదైన తర్వాత రోడ్డుపై వదిలేసేవాళ్లం. ఒకసారి అది రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి చూసి మొరగడం మొదలు పెట్టింది. రోజూ ఆ వ్యక్తినే చూసి అరుస్తుండటంతో ‘ఏయ్‌ మూర్తి.. స్టుపిడ్‌.. నోర్ముయ్‌’ అని తిడుతూ ఉండేవాడిని. ఒకరోజు ఆ కాలనీలో వాళ్లు వచ్చి, ‘రోజూ మూర్తిని తిడుతున్నారట. ఆయన ఫీలవుతున్నారు’ అని చెప్పారు. అసలు జరిగిందేంటంటే, మా కుక్క చూసి మొరిగే వ్యక్తి పేరు కూడా మూర్తినేనట.(నవ్వులు)

అందరినీ భయపెట్టాలని దెయ్యాల సినిమాలు చేస్తున్నారా?
రవిబాబు: అలా ఏమీలేదు. నేను కేవలం నాలుగు మాత్రమే థ్రిల్లర్‌ మూవీలు చేశా. మిగిలినవి అన్నీ రొమాంటిక్‌ కామెడీ, పూర్తి కామెడీ చిత్రాలే.

మరి ‘అదుగో’ ఎందుకు తీయాల్సి వచ్చింది?
రవిబాబు: ‘అదుగో’ను చాలా చిన్న సినిమాగా తీద్దామని అనుకున్నా. నిజమైన పంది పిల్లను తీసుకొచ్చి, ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను పెట్టుకుని తీద్దామని ప్లాన్‌ చేశా. నిజమైన పందిపిల్లను తీసుకొచ్చి ప్రయత్నించాం కూడా. అది అసలు కదిలేది కాదు. దీంతో త్రీడి యానిమేషన్‌ చేయాల్సిన సినిమా అని దిగి, లాక్‌ అయిపోయాం. త్రీడిలో సమస్యలు ఉంటాయని తెలుసు కానీ, ఇన్ని వస్తాయని అనుకోలేదు. 80రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేస్తే, వాళ్లు సీజీ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఫైనాన్షియల్‌గా బయటపడ్డాం కానీ, అనుకున్న విజయం సాధించలేదు. ఈ రోజుల్లో సినిమాకు సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏరోజు విడుదల చేస్తామన్నది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మా సినిమాను దీపావళి రోజున విడుదల చేశాం. అది బాగా దెబ్బ కొట్టింది. 

‘అల్లరి’ హిట్‌ అవుతుందనే ఉద్దేశంతోనే తీశారా? లేక సరదాగా తీశారా?
రవిబాబు: ఆ సినిమా చేసినప్పుడు హిట్‌ అవుతుందా? ఫ్లాప్‌ అవుతుందా? అన్న ఆలోచన లేదు. కాకపోతే నాకు నమ్మకం ఉండేది. ఎందుకంటే ఇలాంటి పాటలు, ఆర్ట్‌ డైరెక్షన్‌ తెలుగులో ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. చూసి ఉండకపోవడం ఒకెత్తయితే, జనానికి నచ్చడం నచ్చకపోవడం మరో ఎత్తు. నేను అడ్వటైజ్‌మెంట్‌ రంగం నుంచి వచ్చాను కాబట్టి, 45రోజుల్లో సినిమా తీయాలని టార్గెట్‌ పెట్టుకుని ఆ సమయంలో పూర్తి చేశాం. అనుకున్న బడ్జెట్‌లోనే తీశాం. నాతో చేతులు కలిపి సినిమా చేసిన నిర్మాతకు అది నచ్చలేదు. ‘ఈ సినిమా వేస్ట్‌. ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు చాలా బాధపడాలి’ అన్నారు. అప్పుడు నేను కాస్త గందరగోళానికి గురయ్యా. నా సేవింగ్స్‌ అన్నీ దానిలో పెట్టుబడిగా పెట్టా. కానీ, విడుదలైన తర్వాత అందరూ మెచ్చుకున్నారు. అందరికీ మంచి పేరు వచ్చింది. 

‘అల్లరి’  మీ భార్యతో కలిసి సెకండ్‌షోకు వెళ్లారట!
రవిబాబు: సాధారణంగా నా సినిమాలకు నేను మార్నింగ్‌ షోకు వెళ్లను. సినిమా అయిపోయిన తర్వాత నా అసిస్టెంట్‌ డైరెక్టర్లకు ఒక ప్రశ్నపత్రం ఇస్తా. ఎక్కడ ప్రేక్షకులు నవ్వుతున్నారు? ఎక్కడ ఈలలు వేస్తున్నారు? ఏ సన్నివేశాలు వస్తే లేచి వెళ్లిపోతున్నారు? ఇలాంటి దృష్టికోణంలో ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబడతా. 99శాతం నా అంచనాలు తప్పవు. ‘అల్లరి’ సినిమా విడుదలైన తర్వాత అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిసింది. ఉదయం పూట వెళ్తే గుర్తుపడతారని సెకండ్‌షోకు వెళ్లాం. 

‘అల్లరి’ సుభాషిణికి మీరంటే భయమని చెప్పారు?
రవిబాబు: అలా ఏమీలేదు. కథ ప్రకారం ఆ సినిమాలో భార్య పాత్ర కాస్త నల్లగా, భర్త ఫెయిర్‌గా ఉండాలి. అన్ని పాత్రలకూ అందరూ దొరికేశారు. ఒక్క ఆ పాత్రకు తప్ప. అప్పుడు నాన్న సుభాషిణిగారి పేరు చెప్పారు. ఫోన్‌ చేస్తే ఆ మరుసటి రోజు ఆమె ఆటోలో నేరుగా షూటింగ్‌ స్పాట్‌కు వచ్చారు. నైటీతో భుజంపై తువాలుతో ఉన్నారు. కళ్లు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. సరిగ్గా సరిపోతారనుకున్నా. అయితే, కెమెరా ముందుకు వెళ్లే సరికి డైలాగ్‌లు చెప్పమంటే స్టేజ్‌పై చెప్పినట్లు అందరికీ వినపడేలా తల అటూ ఇటూ తిప్పుతూ చెప్పడం మొదలు పెట్టారు. నాలుగైదు టేక్‌లు తీసుకున్నా అదే పరిస్థితి. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ తర్వాత ఎలాగో ఆమె చేశారు. అయితే, చాలా మంచి ఆర్టిస్ట్‌. ‘అమ్మాయిలు.. అబ్బాయిలు’ సహా నా ప్రతి సినిమాలో ఏదో ఒక వేషం వేశారు. (మధ్యలో ఆలీ అందుకుని, ఆమె ఈ షోకు వచ్చినప్పుడు ‘నా గురువు రవిబాబు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. చలపతిరావుగారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే, ఆయన కొడుకు నాకు సినీ జీవితాన్ని ఇచ్చారు’ అని చెప్పారు.)


 

ఇండస్ట్రీలో మీకు సపోర్ట్‌గా నిలిచిందెవరు?
రవిబాబు: నటుడిగా నా కెరీర్‌ను పక్కన పెడితే, నా తొలి సినిమా నుంచి త్వరలో రాబోతున్న ‘ఆవిరి’వరకూ నన్ను ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి సురేష్‌బాబు. ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశా. చాలా నేర్చుకున్నా. ఆయనకు నేను అర్థమవుతాను. ఆయనేంటో నాకు తెలుసు. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాం. భవిష్యత్తులోనూ చేస్తాం. 

‘ఆవిరి’కి కూడా సురేష్‌బాబు సపోర్ట్‌ ఉందా?
రవిబాబు: ఈ సినిమాను దిల్‌రాజుతో కలిసి చేస్తున్నా. ఆ సమయంలో సురేష్‌బాబు వేరే సినిమాలు, వ్యక్తిగత కారణాలతో బిజీగా ఉండటంతో ఆయనను కలవలేదు. 

చలపతిరావు అనే పేరు మీకు ఇండస్ట్రీలో ఎంతవరకూ ఉపయోగపడింది?
రవిబాబు: నేను చలపతిరావుగారి అబ్బాయిని... దాన్ని కాదనడానికి లేదు. ప్రారంభంలో ఎక్కడకు వెళ్లినా ‘చలపతిరావుగారి అబ్బాయి వచ్చాడు’ అనేవారు. అది ఎక్కడ వరకూ ఉపయోగపడుతుందంటే మనం రామోజీరావుగారి ఆఫీస్‌ డోర్‌ తీయడం వరకూ ఉపయోగపడుతుంది. డోర్‌ తీసి లోపలికి వెళ్లిన తర్వాత నేను చలపతిరావుగారి అబ్బాయిని కాదు. ఆయనకు కథ చెప్పడానికి వచ్చిన 100మంది వ్యక్తుల్లో ఒకడిని. ఏది సాధించినా నేను సొంతంగా సంపాదించుకోవాల్సిందే.

రామోజీరావుకు చెప్పిన మొదటి కథ ఏది?
రవిబాబు: ‘నచ్చావులే’, ‘నువ్విలా’ రెండూ చెప్పా. ఆయనతో ప్రయాణం ఒక మర్చిపోలేని అనుభూతి. ఆయనొక అద్భుతమైన వ్యక్తి. అలాంటి మనుషులను మన జీవితంలో చాలా తక్కువమందిని కలుస్తాం. నిజంగా గ్రేట్‌ మ్యాన్‌. 

ఆడియో ఫంక్షన్స్‌కు రమ్మంటే ‘సారీ’ అని ముఖం మీదే చెప్పేస్తారట!
రవిబాబు: ఆడియో ఫంక్షన్లు చాలా బోర్‌. నేను కూర్చోలేను. యాంకర్లు వచ్చి పిచ్చి జోకులు వేస్తారు. వాటికి మనకు నవ్వు కూడా రాదు. పైగా విపరీతమైన సౌండ్‌. వ్యక్తిగతంగా నాకు చాలా బోరింగ్‌ విషయం.

అమెరికాకు ఎందుకు వెళ్లారు?
రవిబాబు: నేను ఎంబీఏ చేశా. నాకు అడ్వటైజింగ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ మీద బాగా ఆసక్తి. తక్కువ సమయంలో అది నేర్పించేవాళ్లు ఇక్కడ లేరు. కెమెరా వర్క్‌, ఎడిటింగ్‌, డైరెక్షన్‌, మ్యూజిక్‌ డైరెక్షన్‌ అన్నీ నేర్చుకోవాలి. అక్కడ కొన్ని షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఉన్నాయని తెలిసింది. వాళ్లు అక్కడ చెప్పే విషయాలన్నీ ఇక్కడ పుస్తకాల్లోనే చదివేశా. కెమెరామెన్‌ అవ్వాలంటే ‘అమెరికన్‌ సినిమాటోగ్రాఫర్‌ మ్యాన్‌వల్‌’ అనే పుస్తకం ఉంటుంది. దాన్ని బట్టీ పట్టేశా. పుస్తకంలో చదువుకోవచ్చు కానీ, ఫీల్డ్‌ వర్క్‌ తెలియాలంటే తప్పకుండా కోర్సు చేయాల్సిందే. అందుకే అమెరికా వెళ్లా.

అక్కడ హాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించలేదా?
రవిబాబు: ఆ ఆలోచన లేదు. ఎందుకంటే మా ఇద్దరు అక్కలు అమెరికాలోనే ఉన్నారు. నాన్న ఒక్కరే ఇక్కడ ఉన్నారు. నేను కూడా అక్కడే ఉంటే మంచికాదేమోననిపించింది. అయితే, ఐదారేళ్లు కష్టపడితే హాలీవుడ్‌లోనూ అవకాశం వచ్చేదేమో. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేయలేదు. 

ఇండియా మీద ఉన్న ప్రేమతో వచ్చారా? లేక తండ్రి మీద ప్రేమతో వచ్చారా?
రవిబాబు: నో కామెంట్స్‌. (నవ్వులు) చొక్కాలు చింపేసుకునేంత దేశభక్తి ఉందని చెబితే ఎవరూ నమ్మరు. ఎవరైనా వారి వ్యక్తిగత జీవితం గురించే ఆలోచిస్తారు. మద్రాసు వచ్చి ఒక అడ్వటైజింగ్‌ సంస్థ పెట్టా. మంచి సక్సెస్‌ అయింది. ఇండియాలోని టాప్‌ బ్రాండ్స్‌కు యాడ్‌లు చేశా. దానిలో నుంచి సినిమాల్లోకి వచ్చా. నాగార్జునగారితో సినిమా చేయాలని అప్పట్లో బాగా ఉండేది. ‘అల్లరి’ చేసి వేరే రూట్‌లోకి వచ్చాశాం. మళ్లీ కుదరలేదు.

బాలకృష్ణ వచ్చి మిమ్మల్ని అడిగినా సినిమా చేయడం లేదట!
రవిబాబు: (నవ్వులు) ‘ఏమయ్యా.. నువ్వు అందరితోనూ సినిమా చేస్తావ్‌. నాతో ఎందుకు తీయవు’ అని బాలకృష్ణగారు అడుగుతుంటారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత ఒకరోజు రాత్రి ఫోన్‌చేసి ఇదే విషయాన్ని అడిగారు. ‘సర్‌ మీ చిత్రానికి దర్శకత్వం వహించడం నాకు గౌరవం’ అని నేను అంటే ‘నీ దర్శకత్వంలో చేయడం కూడా నాకు గౌరవం’అని అన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి అటాచ్‌మెంట్‌ ఉంది. నా దగ్గరున్న కథల్లో బాలకృష్ణగారు సరిపోతారా లేదోనని ఆలోచిస్తా. ఒక పెద్ద హీరో కోసం కథ రాసుకోవడం సరైన పద్ధతి కాదు. నేను రాసుకున్న కథకు ఎవరు సరిపోతారో చూసుకుని వారితో చేయడం సరైన పద్ధతి. ఒక హీరోకు అనుగుణంగా సినిమాను తీయడం నాకు ఇష్టం ఉండదు. ఆ హీరోను ఎలివేట్‌ చేస్తూ 100 షాట్‌లు తీయలేను. అవి తీయడానికి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మిగతావాళ్లు చేసేది నేను చేయలేను. నేను చేసేది మిగిలిన వాళ్లు ఎవరూ చేయలేరు. 

‘అవును’ సినిమాలో నేను చెప్పినట్టే చేయమని ఒక సీనియర్‌ ఆర్టిస్ట్‌కు వార్నింగ్‌ ఇచ్చారట!
రవిబాబు: ఇంకెవరు మా ఫాదర్‌. సినిమా విషయానికొస్తే నాకు ఎవరైనా ఒకటే. ఎందుకంటే ఒక సన్నివేశం చేయడానికి ఆరు టేక్‌లు తీసుకున్నారు. పోనీలేనని నేనే వదిలేశా. ఆ సీన్‌ అయిన తర్వాత చేయి ఎత్తి నమస్కారం చేసి,  ‘‘ఆ మహానటుడు ఎన్టీఆర్‌ వచ్చినా, ‘ఈ కుర్రాడితో మేము చేయలేము’ అని వెళ్లిపోతారు’’ అని అన్నారు. అదీ పరిస్థితి(నవ్వులు)

‘అవును’ చేస్తుండగా పూర్ణతో గొడవైందట!
రవిబాబు: అవును. నేను ప్రతి విషయంలో చాలా స్పష్టంగా ఉంటా. తను బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారని ఫీల్‌ కలిగేలా సన్నివేశాలు ఉంటాయి. ఆమె కోసం ప్రత్యేకంగా షవర్‌ ఏర్పాటు చేశాం. డబుల్ కర్టెన్‌ వేశాం. చూసేవాళ్లకు ఇబ్బందికరంగా ఆ సీన్లు ఉండకూడదనుకున్నాం. డమ్మీ షాట్‌ రికార్డు చేసి తనకి చూపించా. ‘నువ్వు ఇలా కనపడతావు. ఒకేనా’ అని అడిగితే ‘సరే’ అంది. అసలు షాట్‌కు వెళ్లాం.. షాట్‌ మధ్యలో ఉండగా ‘నాకు ఈ సీన్‌ ఇష్టం లేదు’ అని బయటకు వచ్చేసింది. నేను షాక్‌. అంతే నాకు పట్టరాని కోపం వచ్చింది. కిందకు వెళ్లిపోయి, ప్రొడక్షన్‌ మేనేజర్‌ను పిలిచి ‘ఆ హీరోయిన్‌కు, ఆమె తల్లికి విమానం టికెట్లు బుక్‌ చేయండి. వాళ్లను వెళ్లిపోమనండి. మనం షార్ట్‌లిస్ట్‌ చేసిన వాళ్లలో తర్వాతి అమ్మాయిని రేపు షూటింగ్‌కు రమ్మనండి. ఈ 12రోజుల షూటింగ్‌ మళ్లీ రీషూట్‌ చేద్దాం’ అని చెప్పా. అది విన్న పూర్ణ, వాళ్లమ్మ వచ్చి నాకు సారీ చెప్పారు. ఆ తర్వాత ఆమెతో మూడు సినిమాలు చేశా. అయితే, ఒకసారి ఒక్క రోజు షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంటే, నెలరోజులు వెయిట్‌ చేయించింది. ఆ తర్వాత వస్తే నేను మాట్లాడలేదు. కోపంతోనే మిగిలిన సీన్లు చేశా. ఇక ఆ మరుసటి రోజు ప్రమోషన్స్‌ కోసం ఫొటో షూట్‌. ‘అవును’ పోస్టర్‌లో ఒక ఏనుగు అమ్మాయిని ఎత్తుకుని ఉండేలా డిజైన్‌ చేశాం. ఫైట్‌మాస్టర్‌ని పిలిచి తాళ్లు కట్టి గంటపాటు పైకిలేపి వివిధ రకాలు స్టిల్స్‌ తీశాం. అది పూర్తయిన తర్వాత కిందకు దింపి, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ను పిలిచి ఫొటోలు చూపించమన్నా. తీరా చూస్తే, కెమెరాలో చిప్‌లేకుండా అప్పటివరకూ ఫొటోలు తీశాడట. అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది. ‘వీడు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు’ అనుకుంటుంది కదా! అది నావల్ల జరిగిన తప్పు కాదని ఆమెకు వివరించా. 

మీ సినిమా ప్రివ్యూ షో వేయాలంటే భయపడతారట! టాక్‌ బయటకు వెళ్లిపోతుందని భావిస్తారా?
రవిబాబు: అదేం కాదు. ప్రివ్యూ వేస్తే, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్లను పిలుస్తాం. చచ్చిన శవాల్లా.. కూర్చొని చూస్తారు. నవ్వు వచ్చినా నవ్వరు. ఏడుపు వచ్చినా ఏడవరు. బయటకు వచ్చిన తర్వాత మన ముఖం చూస్తారు. చిన్న స్మైల్‌ ఇస్తారు. సినిమా బాగుందో బాగోలేదో చెప్పరు. మళ్లీ ఇంటర్వెల్‌లో కాఫీలు, టీలు, కేకులు ఇవన్నీ అదనపు ఖర్చు. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో ఇదంతా వేస్ట్‌ ప్రాసెస్‌ అనిపించింది. ఇటీవల మరో కొత్త జాడ్యం పట్టింది. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆ సెల్‌ ఆన్‌ చేసి ఏదో ఒకటి టైప్‌ చేస్తుంటారు. వెనక నుంచి చూస్తుంటే, ఎంతమంది సెల్‌ఫోన్‌ ఆన్‌ చేసి చూస్తున్నారో అర్థమవుతుంది. సినిమాను ఆస్వాదిస్తూ చూడరు.

టెక్నాలజీ పెరగడం మంచిదా? చెడ్డదా?
రవిబాబు: సినిమాలు తీసే విషయంలో టెక్నాలజీ పెరగడం నిజంగా మంచిది. అదే సమయంలో సోషల్‌మీడియా విషయంలో చాలా చెడ్డది. మన జీవితాల్ని అది ఆక్రమించింది. అందుకే నాకు ఎలాంటి సోషల్‌మీడియా ఖాతాలు లేవు. కేవలం ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే ఖాతా ఉంది. 

మీ తండ్రిగారి విషయంలో ఒక వివాదం జరిగితే, ‘ఈయన నా తండ్రా.. చంపేయండి’ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారట!
రవిబాబు: నాకు అసలు సోషల్‌మీడియా అకౌంట్లే లేవు. ఏ విషయం గురించీ మాట్లాడను. అవన్నీ ఫేక్‌ అకౌంట్లు. ఫేక్‌ పోస్టింగ్‌. ఇంకో విషయం చెబుతా. 15రోజుల కిందట నా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఒకరు ఫోన్‌చేసి ‘సర్‌ మీరు ఎవరో అమ్మాయిని శారీరకంగా హింసించారని రెండు వెబ్‌సైట్స్‌తో మాట్లాడింది’ అని లింక్‌ పంపాడు. ఆ వీడియోలో నేను ఫేస్‌బుక్‌లో ఆమెతో అసభ్యంగా చాట్‌ చేసినట్లు చూపించారు. ఎవడో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి తనతో చాట్‌ చేయడం మొదలు పెట్టాడు. అవన్నీ అందులో చూపించారు. ఈ ఘటన 2012లో జరిగిందట. తను ‘నువ్విలా’ చిత్రంలో చిన్న పాత్ర చేసిందట. ఆ తర్వాత ఆ జర్నలిస్ట్‌కి ఫోన్‌ చేసి ‘అది నా ఫేస్‌బుక్‌ అకౌంటో కాదో తెలియకుండా ఎలా మాట్లాడతారు’ అని అడిగా. సాధారణంగా అయితే, వాళ్లపై చర్యలు తీసుకోవాలి. నేను వదిలేశా. మా తండ్రిగారి విషయంలోనూ అదే జరిగింది. ఏదో ఆడియో ఫంక్షన్‌లో నోరుజారారు. అది వైరల్‌ అయి, పెద్ద గొడవైంది. దీనిపై నేను మాట్లాడలేదు. అయితే, నా పేరు చెప్పి ఏవేవో పోస్ట్‌లు పెట్టారు. 

పెద్ద హీరోలతో కమర్షియల్‌ సినిమా తీయాలని ఎందుకు అనిపించలేదు?
రవిబాబు: ‘అవును’ అనే సినిమాను ఏ పెద్ద హీరోతో నేను చేయగలను. అలాగే ‘ఆవిరి’లో కూడా ఐదారు పాత్రలే ఉంటాయి. నా సినిమాలో పోస్టర్‌కు సినిమాకు సంబంధం ఉండదు. సినిమాలోని ఎమోషన్‌ను పోస్టర్‌ రూపంలో చూపిస్తా. ఆవిరి అనేది ఎమోషనల్‌ హీట్‌. దాన్ని ఎలా డీల్‌ చేస్తామనేది ఈ కథ. 

సిల్వెస్టర్‌ స్టాలోన్‌ అంటే ఇష్టం కదా!
రవిబాబు: అవును! అమెరికాలో ఆయన చేసే జిమ్‌కు నిన్ను(ఆలీ) కూడా తీసుకెళ్లా కదా! ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ కూడా అక్కడే కసరత్తులు చేసేవారు. ప్రతిరోజూ ఆయనే నాకు స్ఫూర్తినిస్తుంటారు.

నటుడిగా వెండితెరకు పరిచయం అయి, సడెన్‌గా ఎందుకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది?
రవిబాబు: నేను నటుడిని కావాలని అనుకోలేదు. అనుకోకుండా అయ్యాను. ఒకరోజు రామానాయుడుగారు నన్ను చూసి, ఎవరికో ఫోన్‌చేసి ‘మన సినిమాలో ఆ వేషం ఇతనికి ఇవ్వండి’ అన్నారు. ‘శివయ్య’, ‘మావిడాకులు’ ఒకేసారి విడుదలయ్యాయి. సాంకేతికంగా అవే నా మొదటి చిత్రాలు. ఐదారు సినిమాలు చేసిన తర్వాత ఎందుకో నాకు నచ్చలేదు. ఆ తర్వాత మళ్లీ అమెరికా వెళ్లిపోయా. తిరిగి వచ్చి, డైరెక్షన్‌ మొదలు పెట్టా. 

మీకు ఎంతమంది పిల్లలు?
రవిబాబు: ఇద్దరు. అమ్మాయి ప్రొడక్ట్‌ డిజైన్‌ చదువుతోంది. అబ్బాయి 12వ తరగతి చదువుతున్నాడు.

చిరంజీవి మీ కథను ఒకే చేస్తే ఏం టైటిల్‌ పెడతారు?
రవిబాబు: టెర్మినేటర్‌

అదే బాలకృష్ణతో అయితే ఏ పేరు పెడతారు?
రవిబాబు: ఐరన్‌మ్యాన్‌

సెన్సార్‌బోర్డులో కొత్త రూల్‌ పెట్టమంటే ఏం పెడతారు?
రవిబాబు: సెన్సార్‌ అధికారులు అందరూ కళ్లు, చెవులు మూసుకుని సినిమా చూడాలని చెబుతా. 

ఎలాంటి విషయాల్లో టెంప్ట్‌ అవుతారు?
రవిబాబు: నాది చాలా సాధారణ జీవితం. రాత్రి 9గంటలకల్లా నిద్రపోతా. ఉదయాన్నే 4.00గంటలకు నిద్రలేస్తా. ఈ మధ్యనే నాకు కాఫీ తాగడం అలవాటైంది. అది తప్ప ఏ అలవాట్లూ లేవు. ఇటీవల సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన ‘లాస్ట్‌ బ్లడ్‌’ రిలీజ్‌ అయింది. ఆ సినిమా మొదటిరోజు, మొదటి షో చూడాలని అనుకుని వెళ్లి చూశా.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.