close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం

ఏపీ రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశమవుతోంది. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ భరోసా కింద రైతులకు ఉచితంగా బోరు బావులను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రిమండలి నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా మిల్లెట్‌బోర్డు ఏర్పాటు, వైఎస్సార్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్‌ అధికారులు, పింఛనర్ల ఐకాస ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి విన్నవిస్తామని వెల్లడించింది. ఆర్టీసీ ఐకాస నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు మంగళవారం టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ ఐకాస నేతలతో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పుర, నగరపాలక సిబ్బందికీ బీమా

గ్రామ పంచాయతీలతో పాటు తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలలోని సిబ్బందికి సైతం బీమా పథకాన్ని అమలుచేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి యూనిఫాంతో పాటు రక్షణ సామగ్రిని సమకూరుస్తామన్నారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలను కల్పించేందుకు ఏజెన్సీలను ఆదేశిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 73 పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలో అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మించిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల పరిధిలోని లేఅవుట్లను కూడా క్రమబద్ధీకరించనుంది. వీటిని హెచ్‌ఎండీయే క్రమబద్ధీకరిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధివిధానాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. త్వరలోనే మెరుపు సమ్మె

డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, ఈ నెల 23 తరవాత ఏ రోజైనా మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్ల ఫ్రంట్‌ (టీ టఫ్‌) తెలిపింది. మంగళవారం విద్యుత్‌ సౌధలº టీ టఫ్‌ నేతలతో ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్‌ సంస్థల సంచాలకులు సమావేశమై చర్చించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. జనవరిలోనే ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ విడుదల!

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ జారీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ క్రమంలో ఉద్యోగ ఖాళీల వివరాలను వచ్చే నెలాఖరునాటికి పంపాలని ఆయా శాఖల అధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదేశించారు. వాటిపై మరోసారి సీఎస్‌ స్థాయిలో సమీక్ష జరుగుతుంది. అనంతరం ఆర్థికశాఖ నుంచి లభించే ఆమోదానికి అనుగుణంగా జనవరి తొలి వారంలోగా ‘క్యాలెండర్‌’ ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

ఓటర్ల జాబితా సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. వచ్చే ఏడాది జాబితా కోసం నూతన ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు చేపట్టింది. పేర్లు, చిరునామాలో దోషాల సవరణకు వచ్చే నెల 18వరకు గడువు ఇచ్చింది. 

8. ఇక మరింతగా ప్రైవేటు కూత..

మునుపెన్నడూ లేనిరీతిలో కొన్ని రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తున్న రైల్వేశాఖ ఇప్పుడు మరిన్ని విభాగాలను బయటివారికి అప్పగించాలని కసరత్తు చేస్తోంది. రైలు పెట్టెలు/ ఇంజిన్ల తయారీ, రైలు మార్గాల నిర్మాణం, వాటి విద్యుదీకరణ, సిగ్నలింగ్‌ వ్యవస్థ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల సంబంధిత పనులకే రైల్వేశాఖ పరిమితం కానుంది. ప్రయాణికుల రైళ్లను నడపడం, వాటిలో సేవలందించడం వంటివన్నీ క్రమేపీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘అయోధ్య’ విచారణ నేడు పరిసమాప్తం!

కీలకమైన అయోధ్య భూ వివాదం కేసులో వాదనలను బుధవారం మధ్యాహ్న భోజన విరామానికి కంటే ముందే ముగించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం సూచనప్రాయంగా చెప్పింది. హిందూ, ముస్లిం పక్షాలు ఎదుటి పక్షం వాదనలపై తమతమ తుది అభిప్రాయాలను సమర్పించడానికి సాయంత్రం అయిదుగంటల వరకు సమయమిచ్చే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మాస్టర్‌ ఆట మళ్లీ..

సచిన్‌ తెందుల్కర్‌ బ్యాటింగ్‌ చూసేందుకు ఎదురుచూడని క్రికెట్‌ అభిమాని ఉండడేమో..! ఆటకు వీడ్కోలు పలికిన ఈ క్రికెట్‌ దిగ్గజం మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. ఓ టీ20 లీగ్‌లో ఆడనున్నాడు. అందుకు వేదిక భారతే. సచిన్‌తో పాటు బ్రయాన్‌ లారా, వీరేంద్ర సెహ్వాగ్‌, ముత్తయ్య మురళీధరన్‌లతో పాటు అనేక మంది మాజీ క్రికెట్‌ స్టార్లను ఈ కొత్త లీగ్‌లో చూడొచ్చు. రహదారి భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఆరంభం కాబోతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో వీళ్లు ఆడనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.