close

తాజా వార్తలు

కపిల్‌దేవ్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం..

మాజీ ఛాంపియన్‌కు సంబంధించి మీ ఫేవరెట్‌ ఏమిటీ?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: టీమిండియా మాజీ ఛాంపియన్‌ కపిల్‌దేవ్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆయన టెస్టు అరంగేట్రం చేసి నేటికి 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఐసీసీ ట్వీట్‌ చేసింది. 1978 అక్టోబర్‌ 16న పాకిస్థాన్‌పై ఫైసలాబాద్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన కపిల్‌.. ఆ పర్యటనలో బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడు ఆడిన మూడో టెస్టులోనే భారత్‌ తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగవంతమైన అర్ధశతకం నమోదుచేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అనంతరం అంచెలంచెలుగా ఎదుగుతూ మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్‌గా 1983లో భారత్‌ను తొలిసారి విశ్వవిజేతగా నిలిపి తన ప్రత్యేకత చాటుకున్నాడు. 

మొత్తం 131 టెస్టులాడిన కపిల్‌ 5,248 పరుగులు చేసి, 434 వికెట్లు పడగొట్టాడు. 1994లో న్యూజిలాండ్‌పై ఆఖరి టెస్టు ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఇటీవలే బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీకి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా మాజీ ఛాంపియన్‌కు సంబంధించి ‘మీ మధురజ్ఞాపకం ఏమిటీ..?’ అని ఐసీసీ ట్విటర్‌లో అభిమానులను కోరింది. దీనికి స్పందించిన అభిమానులు ‘1983 ప్రపంచకప్‌’ అని కొందరు, ఆ టోర్నీలో ‘జింబాబ్వేపై బాదిన 175 పరుగులు’ అని మరికొందరు గుర్తు చేసుకుంటున్నారు.  

సఫారీ జట్టులో అతడో ప్రత్యేకం:

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దక్షిణాఫ్రికా సూపర్‌ స్టార్‌, మాజీ ఆటగాడు జాక్వెస్‌ కల్లీస్‌. సఫారీల జట్టులో ఎంతమంది స్టార్‌ ఆటగాళ్లున్నా అతడో ప్రత్యేకమైన ఆటగాడు. 1995లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన కలీస్‌ అద్వితీయమైన ఆటతో దిగ్గజ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 19 ఏళ్ల కెరీర్‌లో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న అరుదైన క్రికెటర్‌. కాగా, 2014 జులైలో శ్రీలంకపై చివరి మ్యాచ్‌(వన్డే) ఆడిన ఆల్‌టైమ్‌ ఆల్‌రౌండర్‌.. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 25,534 పరుగులు చేయడంతో పాటు 577 వికెట్లు పడగొట్టాడు. అలాగే 338 క్యాచ్‌లు అందుకొని క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆల్‌రౌండర్‌కీ సాధ్యంకాని గణంకాలను తన పేరిట నమోదు చేసుకున్నాడు. నేడు కల్లీస్‌ 44వ జన్మదినం సందర్భంగా ఐసీసీ అతడికి శుభాకాంక్షలు తెలిపింది.

వేదా కృష్ణమూర్తి ప్రత్యేకం తెలుసా?

భారత మహిళా క్రికెట్‌లో వేదా కృష్ణమూర్తి ఓ ప్రత్యేకమైన క్రీడాకారిణి. 2011లో ఆస్ట్రేలియాపై టీ20ల్లో అరంగేట్రం చేసిన ఆమె అదే నెలలో ఇంగ్లాండ్‌పై వన్డేల్లో అడుగుపెట్టింది. మొత్తం 111 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వేదా టీమిండియా తరఫున మహిళా వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించింది. ఈ ఫార్మాట్‌లో మూడు వేగవంతమైన అర్ధశతకాల్లో.. రెండు ఆమె చేసినవే కావడం విశేషం. మొత్తం 48 వన్డేల్లో 829 పరుగులు చేసిన కర్ణాటక క్రికెటర్‌ 63 టీ20 మ్యాచ్‌ల్లో 727 పరుగులు సాధించింది. నేడు ఆమె 27వ జన్మదినం సందర్భంగా ఐసీసీ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.