close

తాజా వార్తలు

బెంగాల్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి గంగూలీయేనా?

కేంద్ర మంత్రి అమిత్‌ షా ఏమన్నారంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పశ్చిమ బెంగాల్‌ సహా దేశమంతటా ఎన్‌ఆర్సీ అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుని అధికారం చేపడతామని జోస్యం చెప్పారు. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళతామని స్పష్టం చేసిన ఆయన..మహారాష్ట్రలో భాజపా-శివసేన కూటమిదే విజయమన్నారు. అయోధ్య వివాదంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం ఇచ్చే తీర్పును ఇరు వర్గాలు అంగీకరించి తీరాలన్న అమిత్‌ షాతో ముఖాముఖి.
ప్రశ్న: కీలక రాష్ట్రమైన బిహార్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. గతంలో మీరు నితీశ్‌ కుమార్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. మరి ఈసారి?
షా : బిహార్‌లో జేడీయూ-భాజపా పొత్తు కొనసాగుతుంది. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి. బిహార్‌ విషయానికొస్తే మేం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం. జాతీయ స్థాయిలో అయితే మోదీ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఇది స్పష్టం.
రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటారా..?
షా: పొత్తు ఉన్నప్పుడు కింది స్థాయిలో కొంతమేర విభేదాలు ఉండటం సర్వసాధారణం. అలా ఉంటేనే అది నిజమైన పొత్తు అవుతుంది. ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి.
జేడీయూ-భాజపా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు?
షా: మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తుంది.
అందులో భాజపాకు ఎన్ని?
షా: అది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ, గతం కంటే భాజపా తన స్థానాల సంఖ్య పెంచుకుంటుంది.
అంటే సాధారణ మెజార్టీ వరకూ వెళ్తుందంటారా..?
షా: మెజార్టీ సీట్లు సాధించడం అసాధ్యమేమీ కాదు.
మహారాష్ట్రలో ఐదేళ్లపాటు కలిసి ఉండి కూడా భాజపా- శివసేన మధ్య అంత సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు కదా..?
షా: కూటమి విషయానికొస్తే ఇందాక చెప్పినట్లు కొన్నిసార్లు కార్యకర్తల ఒత్తిడి ఉంటుంది. అందరూ తమ పార్టీ విస్తరణ కోరుకునే వారే. అలాంటప్పుడు కాస్త మనస్పర్ధలు సహజం. వీటిని నేను తప్పుగా భావించడం లేదు. బలమైన పొత్తుకు ఇది నిదర్శనం. లోక్‌సభ, శాసన సభల్లో మా పొత్తు విజయవంతమైంది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి  విజయం సాధించాయి. శాసన సభ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాం. తప్పకుండా గెలుస్తాం.
తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నా..ముఖ్యమంత్రి పదవి కావాలని శివసేన అంటోంది కదా?
షా: ఆ నిర్ణయం ఇరు పార్టీల పొత్తుకు ప్రమాదమని నేను అనుకోవడం లేదు. భాజపా తరఫున దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని స్పష్టం చేస్తున్నా.

ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు అభిప్రాయాలు లేవంటారా?
షా: లేనే లేవు.
శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా?
షా: అప్పటి పరిస్థితులను బట్టి దేవేంద్ర ఫడణవీస్‌, మహారాష్ట్ర శాఖ, భాజపా పార్లమెంటరీ బోర్డు కలిసి నిర్ణయం తీసుకుంటాయి.
వీర్‌ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌పై మీ అభిప్రాయం ఏంటి?
షా: భారతరత్న నిబంధనల గురించి నాకు తెలియదు. వాటిని పరిశీలించాల్సి ఉంది. అయితే, సావర్కర్‌ విషయంలో నాకు చాలా స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. సావర్కర్‌ లాంటి దేశ భక్తుడు, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒకే జీవితంలో రెండు జన్మలున్న వారు దేశంలో ఎవరూ లేరు. జైల్లో ఆయన మాదిరిగా రోజుకు 150 గ్రాముల కొబ్బరి నూనె తీసిన వ్యక్తిలేరు. ఆయన తన సోదరుడితో కలిసి 12 సంవత్సరాలు జైల్లో ఉండి కూడా వాళ్లిద్దరూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. వారి ఆస్తుపాస్తులను ఆంగ్లేయులు ఆరేడు సార్లు స్వాధీనం చేసుకుకున్నారు. సావర్కర్‌పై వివాదం ద్వారా కొందరు దేశ చరిత్రతో ఆటలాడుకుంటున్నారు. ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోనియకుండా అడ్డుకుంటూ పాపం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్నికల్లో ఏం జరగబోతోంది? సీట్ల గణాంకాలపై మీ అంచనా ఏంటి?
షా: ఇప్పుడే చెబుతున్నా. అక్కడ మూడింట రెండొంతుల మెజార్టీతో మా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. లోక్‌ సభ ఎన్నికల్లో మేం 20 సీట్లు గెలుస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ, మేం 18 చోట్ల గెలుపొందాం. మూడు చోట్ల కేవలం 5 వేల ఓట్లతో వెనకబడ్డాం. ఎన్నో దాడులు, రిగ్గింగ్‌లు జరిగాక కూడా భాజపా గెలుస్తుందా లేదే అన్న సందేహం బెంగాల్‌ ప్రజల్లో ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 
అక్కడ మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు..?
షా: ఇప్పటి వరకు ఎవరూ లేరు. ఉంటారా లేదా అన్నది కూడా చెప్పలేం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించాలని బెంగాల్‌ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మేం అతి పెద్ద విపక్షంగా ఉన్నాం.
సౌరభ్‌ గంగూలీ మిమ్మల్ని కలిస్తే..ఆయనే మీ సీఎం అభ్యర్థి అనే ప్రచారం జరిగింది కదా?
షా: సౌరభ్‌తో ఎలాంటి రాజకీయ చర్చలూ జరపలేదు.
ఇక ముందు కూడా జరగవా?
షా: ఇప్పటికైతే లేదు.
ఇప్పుడైతే లేదు గానీ ఇకముందు జరగొచ్చంటారా?
షా: ముందు ఏమైనా జరగొచ్చు. ఇప్పుడైతే లేదు.
దేశమంతా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని ప్రతిచోటా, ఎన్నికల సభల్లో చెబుతున్నారు. దాని రోడ్‌ మ్యాప్‌ ఏంటి?
షా: కచ్చితంగా 2024లోపు అమలు చేస్తాం.
దేశమంతటా ఎన్‌ఆర్‌సీ అమల్లోకి వస్తుందా?
షా: కచ్చితంగా.
మీరు చెబుతున్న ఈ అక్రమ చొరబాటు దారులను ఎలా ఏరి వేస్తారు? వారిని ఎక్కడికి పంపుతారు?
షా: అందుకు ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ఉంది. ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం చేస్తాం.
అసోం తరహాలో గందరగోళం లేకుండా చేస్తారా.? ఆ ప్రక్రియలోనూ ఇబ్బందులు ఉన్నాయి కదా..?
షా: ఇప్పుడున్న ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి వాటిని సరిచేసి, కొత్త ప్రక్రియను అమల్లోకి తెస్తాం.
అసోంలో తప్పులు జరిగాయని ఒప్పుకొంటారా?
షా: నేను నమ్మడం, నమ్మక పోవడం కాదు. ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దాని గురించి ఇప్పుడు చెప్పడం సరికాదు. ఇంకా పూర్తి కాలేదు.
పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్‌ఆర్‌సీ అమలుకు కట్టుబడి ఉన్నారా..? వచ్చే ఎన్నికల్లో ప్రచారాంశంగా చేసుకుంటారా?
షా: గత ఎన్నికల్లో ప్రచారాంశంగా ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ ఉంటుంది.
ఈ అంశం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో ఏమైనా ప్రయోజనం కలిగిందా?
షా: ఎన్నో అంశాలు ఉన్నాయి. అందులో ఇదీ ఒకటి.
డిటెన్షన్ క్యాంపుల గురించి ప్రచారం జరుగుతోంది. థానే, బెంగళూరుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. వాటితో ఉపయోగం ఏంటి?
షా:ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు జరుగుతుంది. ప్రభుత్వాలు తమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ట్రైబ్యునల్‌ అనేది న్యాయ ప్రక్రియ. అది కూడా మొదలైంది.
ట్రైబ్యునల్‌ కూడా ఈ ప్రక్రియలో కూడా భాగమేనంటారా?
షా: ప్రభుత్వాలు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి కదా. కానీ, ఇప్పటికైతే న్యాయప్రక్రియ ప్రారంభమైంది.
దేశంలో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అంతా సురక్షితంగా ఉన్నారని ఓ చోట  చెప్పారు. వారిలో ముస్లింలను ఎందుకు కలపలేదు?
షా: సురక్షితం అని చెప్పలేదు. వారికి పౌరసత్వం ఇస్తామని చెప్పాం. అందుకు కారణం ఏంటంటే.. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు తమ మతాన్ని కాపాడుకునేందుకు తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని కాపాడుకునేందుకు వచ్చే వారే శరణార్థులు అవుతారు. వారు చొరబాటు దారులు కాదు. ఇక్కడి ప్రభుత్వాలను దెబ్బ తీసేందుకు వచ్చేవారే చొరబాటుదారులు అవుతారు.
ముస్లింలు చొరబాటుదారులు అయినందుకే వారి ప్రస్తావన తీసుకురాలేదంటారా? వారు ఒక అజెండాతో వస్తారు అందుకే అంటారా?
షా: ముస్లింలు చొరబాటుదారులు అని నేను అనలేదు. దానికి మతంతో సంబంధమే లేదు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో 30 శాతం హిందువులు ఉండేవారు. ఇప్పుడు 6.5శాతమే ఉన్నారు. మిగతా వారంతా ఏమయ్యారు?
మీరు వ్యాపారంలో ఉన్న వారు. స్టాక్‌ మార్కెట్ల గురించి తెలుసు. ఆర్బీఐ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ జీడీపీ శాతాన్ని తగ్గించాయి. ఆర్థిక మాంద్యం నెలకొంది. ఆటో, స్థిరాస్తి రంగాల్లో మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. వీటిని ఎలా సరిదిద్దుతారు?
షా: మీ ప్రశ్నకు సమాధానం రెండు భాగాలుగా ఇస్తాను. 1990 తర్వాత ప్రపంచీకరణ జరిగింది. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్కటిగా మారింది. మీరు చెబుతున్న మాంద్యం భారత్‌లోనే కాదు.. ప్రపంచమంతటా ఉంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం దేశంపై పడకుండా ఉండదు కదా. భారత గణాంకాలను గత సంవత్సరంతో పోల్చడం సరికాదు. ప్రపంచంలోని టాప్‌ 10 ఆర్థిక వ్యవస్థలను తీసుకోవాలి. వాటిలో ఎన్ని జీడీపీలు తగ్గాయో వాటి ఆధారంగా భారత్‌లో ఎంత తగ్గిందో చెప్పాలి. ఆ విధంగా హేతుబద్ధమైన అధ్యయనం జరగాలి. మాంద్యం ప్రభావంతో భారత్‌ పనితీరు లెక్కించాలి. అలా చేయడం సరైన పద్ధతని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే.. ఎప్పటి నుంచైతే ప్రపంచ మాంద్యం మొదలైందో అప్పటి నుంచి ఆర్థిక మంత్రి వేర్వేరు ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, సీఏలు, ఆర్థికవేత్తలతో గంటల తరబడి చర్చలు జరిపారు. ఎన్నో అంశాలను గుర్తించారు. ప్రధాని నేతృత్వంలో కేబినెట్‌, ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఆర్థిక విభాగాలు.. ఇలా ఐదు విభాగాలుగా నిర్ణయాలు తీసుకున్నాయి. అదృష్టమేంటంటే ఈ సారి ఖరీఫ్‌ పంట బాగుంది. కొత్త రక్తం ఆర్థిక వ్యవస్థకు చేరితే నిర్మలా సీతారామన్ తీసుకున్న చర్యలు క్రమక్రమంగా ప్రభావం చూపి త్వరలో పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భాజపా నేతలను ఎందుకు విచారణ చేయడం లేదనే ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం ఏంటి?
షా: యూపీఏ హయాంలోనే వారిపై చాలా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇప్పుడు మేం విచారణ జరిపిస్తున్నాం. రాజకీయ ప్రేరేపితమనే ఆరోపణల్లో నిజం లేదు. అదే అయితే, ఆరేళ్ల సమయం ఎందుకు పడుతుంది. ఏడాదిన్నరలోనే విచారణ పూర్తి చేసే వాళ్లం కదా. పారదర్శక విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయి. 12లక్షల కోట్ల కుంభకోణం జరిగితే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని మీడియాలో వచ్చింది. తాము తప్పు చేస్తే ఎందుకు పట్టుకోవడం లేదని చాలా మంది కాంగ్రెస్‌ నేతలు అన్నారు. దర్యాప్తు సంస్థలు పట్టుకునేందుకు వెళ్తే మళ్లీ వారే వేధిస్తున్నారని ఎలా అంటారు?. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు సోనియాగాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆమె బెయిల్‌ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయి. పి. చిదంబరాన్ని అరెస్టు చేసినప్పుడు ఏ ఎన్నికలున్నాయి?. కర్ణాటకలో డీకే శివకుమార్‌ను అరెస్టు చేసినప్పుడూ ఎన్నికలూ లేవు. కాగ్‌, సీవీసీ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే యూపీఏ ప్రభుత్వం వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. వాటి ఆధారంగానే విచారణ జరిగింది. ఏ దర్యాప్తు సంస్థ విచారణ అంతిమం కాదని అందరికీ చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ పద్ధతులు ఉన్నాయి. సెషన్‌ కోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంలో సవాలు చేసేందుకు అవకాశం ఉంది. వారంతా ఇప్పుడు అక్కడికి వెళుతున్నారు. కోర్టులు కూడా వారిని సమర్థించడం లేదు కదా. మరి ఇక అందులో రాజకీయ కుట్ర ఎక్కడుంది.
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలు మీ వెంటపడ్డాయి. అప్పుడు వాటిపై ఒత్తిడి ఉందంటారా?
షా: చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. సీబీఐ హోం శాఖ పరిధిలో లేదు. ఇవాళ కూడా సీబీఐ, ఈడీ హోం శాఖ పరిధిలో లేవు. అందువల్ల హోం శాఖను పక్కన పెట్టండి. ఇంకోమాటేంటంటే..నాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పుడు నేను హైకోర్టుకు వెళ్లాను.నాకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని నెలరోజుల్లోనే కోర్టు తేల్చింది. నేను తప్పించుకోలేదు. నాపై ఎలాంటి అభియోగాలు మోపలేదు. నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
రాజకీయ కుట్రలో భాగంగా దర్యాప్తు సంస్థలను వాడుకోవచ్చని మీరు నమ్ముతున్నారా? మీరు మాత్రం అలా చేయలేదంటున్నారు?
షా: అలా చేయలేదని చెబుతున్నా..చేయాలనుకుంటే ఎప్పుడో చేసే వాళ్లం. అయినా కోర్టు తలుపులు తెరిచే ఉన్నాయి.
రామ మందిరం విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందని భావిస్తున్నారు?
షా: 1950 నుంచి ఈ కేసు నడుస్తోంది. చాలా ఆలస్యమైంది. తీర్పు వాయిదా వేశారు. కొన్ని రోజుల్లో తీర్పు వస్తుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా ఇరు వర్గాలు అంగీకరించాలి.
ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే రామమందిరం నిర్మిస్తారా?
షా: ఇంకో ప్రశ్నకు అవకాశం లేదు. సీనియర్‌ న్యాయమూర్తుల బృందం  ఈ విచారణ చేపట్టింది. వారు ఏం తీర్పిచ్చినా ఇరువర్గాలు అంగీకరించాలని కోరుతున్నాను.
ఈ తీర్పు తర్వాత మధుర, కాశీ వివాదాలపై ఈ విధంగానే ముందుకు వెళతారా?
షా: నేను అలా అనుకోవడం లేదు. ఏం జరుగుతుందని ఇప్పుడే ఆలోచించలేం. ఏదేమైనా అయోధ్య సమస్యకు సమాధానం సుప్రీం కోర్టే ఇస్తుందని ఆశిస్తున్నా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.