close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1 PM

1. రాష్ట్ర బంద్‌: పలువురు విపక్ష నేతల అరెస్టు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది. బంద్‌కు మద్దతుగా రోడ్లపైకి వస్తున్న విపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహా మోత్కుపల్లి నర్సింహులని అరెస్టు చేసి లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ గృహనిర్బంధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాచరికానికి పరాకాష్ఠగా కేసీఆర్‌ పాలన:రేవంత్‌

తెలంగాణలో కేసీఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందని అన్నారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బోటు వెలికితీతకు మళ్లీ అంతరాయం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులకు మళ్లీ అంతరాయం కలిగింది. యాంకర్‌కు దొరికినట్టే దొరికి బోటు పట్టు వదిలేసింది. బోటులోనే మృతదేహాలు ఉంటాయని ఈతగాళ్లు బోటు దగ్గరికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే గజ ఈతగాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారితో మాట్లాడేందుకు ధర్మాడి సత్యం విశాఖ వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలంగాణలో ఆర్టీసీ డిపోలకే పరిమితమైన బస్సులు

5. చట్టం ముందు అందరూ సమానులే: యనమల

ప్రజాధనం వృథా అవుతోందన్న వంకతో కోర్టు వాయిదాల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ తప్పించుకోవాలని చూస్తున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కోర్టుకు హాజరైతే రూ.60 ఖర్చవుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అధికారంతో కేసులను ప్రభావితం చేసే ప్రమాదం గతం కన్నా ఇప్పుడు రెట్టింపు అయ్యిందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, శిబుసోరెన్‌ సీఎంగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరయ్యారని ఆయన గుర్తు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. సాగర్‌ కాల్వలో కారు ఆచూకీ లభ్యం

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి సాగర్‌ ఎడమ కాల్వలో గల్లంతైన కారును ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గుర్తించారు. ప్రమాద స్థలికి 250 మీటర్ల దూరంలో కారును గుర్తించి బయటకు తీసే చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఆరుగురు యువకులు తమ స్నేహితుడి వివాహానికి హాజరై తిరుగు పయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎన్నికల ప్రచార సభలో డ్యాన్స్ చేసిన అసదుద్దీన్

8. ఆ నిర్ణయాన్ని స్వాగతించిన ఐఎంఎఫ్‌

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) స్వాగతించింది. ఇది పెట్టుబడులను ఆకర్షించే సానుకూల చర్యగా ఐఎంఎఫ్‌ ఆసియా-పసిఫిక్‌ విభాగం డైరెక్టర్‌ చాంగ్‌యోగ్‌ రీ అభివర్ణించారు. అయినా నిరంతర ఆర్థిక భద్రత, స్థిరత్వం కోసం భారత్‌ ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ‘భారత్‌తో రక్షణ వాణిజ్యం 18బిలియన్ డాలర్లు’

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఈ ఏడాది చివరి నాటికి 18బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్‌ శనివారం ప్రకటించింది. వచ్చే వారం ‘భారత్‌-అమెరికా రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య కార్యక్రమం’(డీటీటీఐ) తొమ్మిదో సమావేశం దిల్లీలో జరగనున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. రాంచి టెస్ట్‌: రోహిత్‌ అర్ధశతకం

రాంచి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ(50) అర్ధశతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం ధైర్యంగా ఆడుతున్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె(40) అతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. భోజన విరామానికి 23 ఓవర్లకు 71/3తో ఉన్న టీమిండియా 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులకు చేరింది. వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.