close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. బ్యాంకు సేవలకు నేడు పాక్షిక అంతరాయం!

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు మంగళవారం పాక్షికంగా అంతరాయం కలగొచ్చు! బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(బీఈఎఫ్‌ఐ) సమ్మెకు పిలుపునివ్వడమే దీనికి కారణం. ఆర్‌బీఐ, ఎస్‌బీఐ ఉద్యోగులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉంటున్నారు.

2. హైదరాబాద్‌లో భారీ చోరీ

ఇంటి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి.. తాళం అలాగే ఉంది. కానీ ఇంటిలోపల దాచి ఉన్న ఐదున్నర కిలోల బంగారం, 7 కిలోల వెండి, రూ.18 లక్షల నగదు చోరీకి గురైంది. బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాత బోయిన్‌పల్లి మల్లికార్జున్‌నగర్‌లో వడ్డీ వ్యాపారం చేసే సరళ ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

3. ఫిబ్రవరి, మార్చిలో ‘ఉద్యోగ’ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రధాన పరీక్షల  తేదీలను కొత్తగా ప్రకటించింది. గతంలో ప్రకటించిన తేదీల స్థానంలో వీటిని వెల్లడించింది. ఆయా రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సర్కారు బడుల్లో కంప్యూటర్‌ ఆధారిత విద్య

సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయనుంది. అహ్మదాబాద్‌కు చెందిన మైండ్‌ స్పార్క్‌ అనే సంస్థ రూపొందించిన కంప్యూటర్‌ ఆధారిత విద్యను ప్రయోగాత్మకంగా 100 ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకురానుంది. గణితం, ఆంగ్లం, తెలుగు సబ్జెక్టులను విద్యార్థులు కంప్యూటర్‌పై చదువుకోవడమే కాకుండా ఆన్‌లైన్‌ పరీక్షలు రాస్తూ... తమ విద్యా సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. చేనేత @ ఆన్‌లైన్‌

చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాన్ని పెంచడంద్వారా సంబంధిత కార్మికులు ఆర్థిక పురోభివృద్ధి సాధించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ద్వారా అమ్మకాలు చేపట్టనుంది. ఇందుకోసం అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు వంటి ఈ-కామర్స్‌ దిగ్గజాలతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దఫా 25 ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా నవంబరు నుంచి విక్రయించేలా కార్యాచరణ సిద్ధమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పింఛన్‌ వయసు 60కి పెంచనున్న ఈపీఎఫ్‌వో!

పింఛన్‌ పొందడానికి వయోపరిమితిని ఇప్పుడున్న 58 ఏళ్ల నుంచి 60కి పెంచాలని ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రతిపాదిస్తోంది. పింఛన్‌ను లబ్ధిదారులు పెంచుకునేందుకు వీలుగా ఈ మేరకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. 60 ఏళ్లు వచ్చాక పింఛన్‌ తీసుకునేవారికి కొంత అదనపు బోనస్‌ ఇవ్వాలని కూడా ప్రతిపాదిస్తోంది. నవంబరులో జరిగే కేంద్ర ధర్మకర్తల మండలి (సీబీటీ) సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టనుంది. 

7. ఏవండోయ్‌.. మీ సంపద రెట్టింపైంది

ఇటీవల ఆర్థిక వృద్ధి అయిదేళ్ల కనిష్ఠానికి చేరి ఉండొచ్చు కానీ.. దేశంలో వ్యక్తుల సంపద మాత్రం 2019 ఏడాదిలో రెట్టింపు  కావడం విశేషం. స్విస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిజీ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో మొత్తం వ్యక్తుల సంపద 2018లో 5.972 లక్షల కోట్ల డాలర్లు(రూ.418 లక్షల కోట్లు)గా ఉండగా.. అది 2019లో 12.6 లక్షల కోట్ల డాలర్ల(రూ.882 లక్షల కోట్లు)కు చేరుకున్నట్లు వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. తేజస్‌ రైలు ఆలస్యానికి రూ. 1.62 లక్షల పరిహారం

ప్రతిష్ఠాత్మకమైన తేజస్‌ రైళ్లు గంట కంటే ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన రైల్వే మాట నిలబెట్టుకొంది. ఈ నెల 19న లఖ్‌నవూ-దిల్లీ-లఖ్‌నవూ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు వైపులా ఆలస్యమయింది. దీంతో ఆలస్యాన్ని బట్టి లఖ్‌నవూ-దిల్లీ రైల్లో 450 మందికి రూ.250 చొప్పున, దిల్లీ-లఖ్‌నవూ రైల్లో 500 మందికి రూ.100 చొప్పున మొత్తం రూ.1.62 లక్షలను బీమా సంస్థ ద్వారా ఐఆర్‌సీటీసీ చెల్లించనుందని రైల్వేశాఖ సోమవారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దేశంలో నేరాలు పెరిగాయ్‌

దేశంలో నేరాలు పెరిగాయి. సోమవారం విడుదలైన 2017 జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం అంతకుముందు ఏడాది కంటే 3.6% నేరాలు పెరిగినట్లు తేలింది. అపహరణ కేసులు 9% పెరిగాయి. 1,00,555 మంది కిడ్నాప్‌ కాగా వారిలో 96,650 మందిని కనుగొన్నారు. మహిళలపై భర్తలు, వారి బంధువుల క్రూరత్వానికి సంబంధించిన కేసులు 33.2%  నమోదైనట్లు పేర్కొన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. టైటిల్‌ కరవు తీరేనా!

వరుసగా విఫలమవుతున్న భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం ప్రారంభంకానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో బరిలో దిగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.