close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేడే ఎన్నికల ఫలితాలు

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానం కూడా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్ర,  హరియాణాల్లో భాజపాకే విజయావకాశాలున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నవంబరు మూడో వారంలో పురపోరు!

తెలంగాణలో పురపాలక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను తాజాగా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో నవంబరు 21లోపు ఎన్నికలు పూర్తి చేసే దిశగా పురపాలక శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. నవంబరు మొదటి వారంలో ఎన్నికల ప్రకటన వెలువడుతుందని.. మూడో వారంలో ఎన్నికలు జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వాగులు.. వంకల్లో ఇసుక తవ్వకాలు

రాష్ట్రంలో ప్రధాన నదుల్లో వరదలు కొనసాగుతుండటంతో ప్రజల ఇసుక అవసరాలు తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇసుక కొరతపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 3 నెలల పాటు గ్రామాల్లోని వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇసుకను తవ్వి, తరలించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేడు ప్రభుత్వానికి ఆర్టీసీ నివేదిక!

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ విస్తృత స్థాయిలో మేధోమథనం జరుపుతోంది. సాధ్యమైనంత వరకు గురువారమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొన్న 21 డిమాండ్లను ఒక్కొక్కటిగా కమిటీ సమీక్షించింది. అధిక శాతం డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రూ.2,460 కోట్లు విడుదల చేయండి

నరేగా పనులకు కేంద్రం ఇచ్చిన రూ.1,845 కోట్లు, రాష్ట్రం వాటా రూ.615 కోట్లు కలిపి మొత్తం రూ.2,460 కోట్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు  డిమాండ్‌ చేశారు. ఉపాధి నిధులను రాష్ట్రమంతా నిలిపేసి పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలకే విడుదల చేశారంటూ విమర్శించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమావేశమై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘రాయల్‌ వశిష్ఠ’ బోటులో ఎముకలు

ఎట్టకేలకు గట్టుకు చేరిన రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటులో మనుషుల శరీరంలోని ఎముకలు, చరవాణి లభ్యమయ్యాయి. బుధవారం ఉదయం దేవీపట్నం పోలీసుల పర్యవేక్షణలో అయిదుగురు పారిశుద్ధ్య కార్మికులు బోటులో ఉన్న బురద మట్టితో పాటు ఇసుకను పూర్తిగా బయటకు తొలగించారు. బోటు నడిపే సరంగి ఉండే వెనుక భాగంలో ఎముకలు, ఫ్యాంటు, పర్సు, పాస్‌ఫొటో ఒకటి లభ్యమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. సూపర్‌ డూపర్‌ క్వాంటమ్‌ చిప్‌

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో గూగుల్‌ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్‌ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక ‘సికమోర్‌’ చిప్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్‌ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్‌ ప్రకటించింది. తాజా ఆవిష్కరణను ‘క్వాంటమ్‌ సుప్రిమసీ’గా అభివర్ణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. చంద్రుడిపై విస్తృత పరిశోధనలకు ఊతం

జాబిల్లి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ లోతైన పరిశోధనలు ప్రారంభించింది. అక్కడి ఉపరితలంపై ఉన్న బిలాలు, ఉల్కల తాకిడికి సంబంధించిన గుర్తులతోపాటు వీటి ప్రభావంతో ఏర్పడే గోతుల ఫొటోలను ఆర్బిటర్‌లోని డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌(డీఎఫ్‌-సార్‌) అందించింది. చంద్రుడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అవి ఉపకరిస్తాయని ఇస్రో బుధవారం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆరు రోజుల్లోనే ‘టోఫెల్‌’ స్కోరు

ఇకనుంచీ ‘టోఫెల్‌’ (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యాజ్‌ ఎ ఫారిన్‌ లాంగ్వేజ్‌) రాసే విద్యార్థులు  6 రోజుల్లోనే తమ స్కోరును తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా స్కోర్లను తెలుసుకోవడానికి కనీసం పదిరోజుల వ్యవధి పట్టేది. ఇప్పుడు ఈ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అధికారికంగా ‘టోఫెల్‌’ యాప్‌ సైతం అందుబాటులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. వుషూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

వుషూ క్రీడాకారుడు ప్రవీణ్‌ కుమార్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అతను ఆ ఘనత సాధించిన తొలి భారత పురుష క్రీడాకారుడిగా నిలిచాడు. బుధవారం సాండా (48 కేజీలు) విభాగం ఫైనల్లో ప్రవీణ్‌ 2-1 తేడాతో రసెల్‌ డియాజ్‌ (ఫిలిప్పీన్స్‌)పై విజయం సాధించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.