close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఈ ఫలితాలు మా పాలనకు గీటురాయి: మోదీ

మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ఫలితాలతో దీపావళికి ముందుగానే ప్రజలు తమను ఆశీర్వదించారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో విజయం అక్కడి ముఖ్యమంత్రుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. భాజపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో మోదీ మాట్లాడారు.  నేటి కాలంలో వరుసగా రెండోసారి గెలవడం చాలా కష్టమని.. ఫలితాలు తమ పాలనకు గీటురాయి అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఏపీలో ఆర్టీసీ విలీనంపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు

ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆర్థిక, సాధారణ పరిపాలన, రవాణా, న్యాయశాఖల ఉన్నతాధికారులను ఈ గ్రూప్‌లో సభ్యులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజారవాణా శాఖ, పోస్టుల డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్‌ గ్రూప్‌ దృష్టిసారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కేసీఆర్‌ మాటలకు భయపడొద్దు: అశ్వత్థామ

ఆర్టీసీ ఉద్యోగులను తీసేసే అధికారం ఎవరికీ లేదని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎవరి జాగీరూ కాదని వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్‌లో కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ...సీఎం కేసీఆర్‌ మాటలకు కార్మికులు ఎవరూ భయపడొద్దన్నారు. ఇష్టం ఉన్నట్లు చేస్తామంటే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. గ్రూప్‌-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్‌-2 తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ గురువారం విడుదల చేసింది. మొత్తం 1032 పోస్టులకు గాను 1027 పోస్టులను భర్తీ చేశారు. ఎంపిక చేసిన అభ్యర్థుల్లో డిప్యూటీ తహసీల్దార్లుగా 259 మందిని, ఎక్సైజ్‌ ఎస్సైలుగా 284 మందిని, వాణిజ్య పన్నుల అధికారులుగా 156 మందిని నియమించనున్నారు. మిగతా వారిని మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులుగా నియమిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. హరియాణాలో హోరాహోరీ

హరియాణాలో కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసింది. మొత్తం 90 స్థానాలున్న హరియాణాలో భాజపా, కాంగ్రెస్‌ హోరాహోరిగా పోటీపడ్డాయి. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌ 46 స్థానాలను ఏ పార్టీ అందుకోలేక పోవడంతో అక్కడ హంగ్‌ ఏర్పడింది. భాజపా 40 స్థానాల్లో, కాంగ్రెస్‌ 31 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశాయి. జేజేపీ 10, ఐఎన్‌ఎల్‌డీ 1, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు. 

6. మోదీ సౌదీ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 28 నుంచి రెండు రోజుల పాటు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సౌదీ యువరాజుతో సమావేశమవుతారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. ఈసందర్భంగా సౌదీలో రూపే కార్డును కూడా మోదీ విడుదల చేయనున్నారు. ఇది భారత హజ్‌ యాత్రికులకు ఉపయోగపడనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. బండ్ల గణేష్‌కు బెయిల్‌ మంజూరు

చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఊరట లభించింది. బాధితులతో బండ్ల గణేష్‌ తరఫు న్యాయవాది చేసినరాజీ ప్రయత్నాలు ఫలించాయి. బాకీ సొమ్ములో ప్రస్తుతం బండ్ల గణేష్‌ రూ.4లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల 14న చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. ఈనేపథ్యంలో గణేష్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కడప మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ బెయిల్‌  మంజూరు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఓట్ల రాజకీయంకోసమే వైకాపా పథకాలు:సుజనా

అద్దె, సొంత ఇంటికి నిర్మాణాలకు ఒకే టెండరు పిలిచినట్లుగా పోలవరం టెండర్లు పిలిచారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అసంతృప్తితో ఉందని చెప్పారు. విజయవాడలో సుజనా మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై ఇంకా దృష్టి సారించలేదని.. ఓట్ల రాజకీయం కోసమే అన్నట్లుగా పథకాలు ఉంటున్నాయని సుజనా ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. దాదాతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా: కోహ్లీ

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో అత్యున్నత, వృత్తిపరమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. సమావేశం జరిగినప్పుడు తామిద్దరం భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడం పై చర్చిస్తామని వెల్లడించారు. కోహ్లీ పనులు తేలిక చేయడానికే తాను ఉన్నానని అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే దాదా పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బంగ్లా పోరుకు సంజూకు పిలుపు: విరాట్‌కు రెస్ట్‌

బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ముందుగా అనుకున్నట్టే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. విజయ్ హజారే ట్రోఫీలో 212* పరుగులతో దుమ్మురేపిన కేరళ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌కు జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.