
తాజా వార్తలు
1. ‘కేసీఆర్ ప్రతిమాటలో అహం ప్రతిధ్వనించింది’
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కార్మికులను పిలిచి మాట్లాడేందుకు కేసీఆర్‌కు మనసొప్పడం లేదని విమర్శించారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. గురువారం కేసీఆర్ మాట్లాడిన ప్రతిమాటలో అహంకారం ప్రతిధ్వనించిందని ఆక్షేపించారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలపై ఒక్కసారైనా స్పందించారా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. సీఎం జగన్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యే వంశీ
కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన వంశీ దాదాపు అరగంట పాటు జగన్‌తో సమావేశమయ్యారు. సీఎంతో వంశీ భేటీ కావడంతో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ మారే విషయంలోనే ముఖ్యమంత్రిని కలిశారా? లేక గన్నవరం నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కూకట్పల్లి డిపో డ్రైవర్ కోరేటి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 341, 506 సహా సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల మరణాలకు అశ్వత్థామరెడ్డే కారణమని రాజు తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పేరుతో కార్మికుల్లో ఆయన విషం నింపుతున్నారని ఆరోపించారు. విలీన డిమాండ్ కార్మికులది కాదని.. అది అశ్వత్థామరెడ్డి వ్యక్తిగత కోరికని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. షైన్ ఆస్పత్రి ఘటనలో ముగ్గురి అరెస్ట్
ఎల్బీనగర్ సమీపంలోని షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రమాదానికి ఆస్పత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్, వైద్యుడు హరికృష్ణతో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ఆస్పత్రి ఐసీయూలోని రిఫ్రిజిరేటర్ పేలి మంటలు వ్యాపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. షైన్ ఆస్పత్రికి అగ్నిమాపక శాఖ అనుమతులు లేనట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. త్వరలో పురపాలక ఎన్నికలు: ఎస్ఈసీ
పదవీకాలం ముగిసిన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈనేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని సూచించింది. 2019 జనవరి 1నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. జులై 16న మున్సిపల్ కమిషనర్లు ఫొటో ఓటరు జాబితాలను ప్రకటించినట్లు పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ tsec.gov.Inలో అందరూ తమ ఓటు హక్కు వివరాలు సరిచూసుకోవాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. భాజపాకు శివసేన నేత పరోక్ష వార్నింగ్!
మహారాష్ట్రలో మొదటి నుంచీ భాజపా-శివసేన పేరుకే మిత్రపక్షాలైనా.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలో ప్రతిపక్షాల కంటే ముందుంటాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఒక్క రోజు కూడా గడవక ముందే శివసేన పార్టీ భాజపాకు ఝలక్‌లు ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పోస్ట్ చేసిన ఓ కార్టూన్ తాజాగా చర్చకు దారితీసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ఉగ్రవాదుల నియంత్రణలో పీవోకే: ఆర్మీ చీఫ్
పాక్ ఆక్రమిత కశ్మీర్ వాస్తవానికి పాకిస్థాన్ నియంత్రణలో లేదని, అది ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్మీ కమాండర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. పీవోకే అనేది ఉగ్రవాదులు నియంత్రిస్తున్న ఓ భూభాగం మాత్రమేనని రావత్ నొక్కి చెప్పారు. ‘గిల్గిట్ బాల్టిస్థాన్, పీవోకే మొత్తం కలిపి జమ్మూకశ్మీర్ రాష్ట్రం. కానీ, ఆ రెండు ప్రాంతాలను పొరుగు దేశం ఆక్రమించుకుంది. అందులో పీవోకే ప్రస్తుతం ఉగ్రవాదుల నియంత్రణలో ఉంది’ అని రావత్ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సీఐసీ పదవీకాలం ఇక మూడేళ్లే
సమాచార హక్కు చట్టం కింద నియమితులయ్యే సమాచార కమిషనర్ల పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేస్తూ గురువారం రాత్రి కొత్త ఆర్టీఐ నిబంధనలను నోటిఫై చేసింది. దీనిపై ఆర్టీఐ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్లతో సమానంగా సమాచార చీఫ్ కమిషనర్, కమిషనర్లు హోదా, వేతనాలు అనుభవిస్తున్న నేపథ్యంలో ఆర్టీఐ చట్టం-2005ని కేంద్రం ఈ ఏడాది జులైలో సవరించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. అవి నకిలీపత్రికలు.. ఇక్కడ నిషేధించండి: ట్రంప్
అమెరికాలో దిగ్గజ వార్తా పత్రికలైన వాషింగ్టన్ పోస్ట్, ద న్యూయార్క్ టైమ్స్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఆ పత్రికల చందాను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఆ పత్రికలు ‘నకిలీ’ అని, అన్ని ప్రభుత్వ సంస్థలు వాటి చందాను రద్దు చేసుకోవాలని అన్నారు. ద న్యూయార్క్ టైమ్స్ ఒక ‘ఫేక్ న్యూస్ పేపర్’ అని మండిపడ్డారని, ఇకపై ఆ పత్రిక వైట్ హౌజ్‌లో ఉండేందుకు వీలులేదని ట్రంప్ ఆదేశించినట్లు ద న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న పాక్ ఆటగాళ్లు
వచ్చే నెలలో అబుదాబిలో జరగనున్న టీ10 లీగ్‌కు పాక్ ఆటగాళ్లు దూరమవ్వడంతో భారీ ఆదాయాన్ని కోల్పోనున్నారు. టీ10 క్రికెట్‌కు తొలుత పాక్ ఆటగాళ్లకు పీసీబీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, పనిభారం వారికి అధికమవుతుందనే ఉద్దేశంతో అనుమతిని పీసీబీ ఉపసంహరించుకుంది. దీంతో షోయబ్ మాలిక్, అమిర్ వంటి టాప్ పాక్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా కోటి రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోనున్నారు. అంతేకాకుండా ఫ్రాంఛైజీలకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి