close

తాజా వార్తలు

శవాల కంటైనర్‌ వెనుక చైనా కథ..!

 39 మంది మరణం వెనుక చీకటి కోణం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: చైనా.. 21వ శతాబ్దంలో ఓ ఆర్థిక అద్భుతం. కేవలం మూడు దశాబ్ధాల్లోనే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే పలు దేశాలకు వేలకోట్లను ఉదారంగా అప్పులు ఇచ్చేసి.. ఆయా దేశాలను రుణఊబిలో కూరుకుపోయేలా చేస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. మరి ఆర్థిక శక్తి అని చెప్పుకొనే చైనా నుంచి 39 మంది అక్రమంగా లండన్‌కు ఎందుకు వలసపోయినట్లు..? అదీ ప్రాణాలను పణంగా పెట్టి..! తాజాగా బ్రిటన్‌లో ఒక ట్రక్కులో 39 మంది శవాలను కనుగొనడం సంచలనం సృష్టించింది. వీరిలో చాలా మంది చైనీయులనే వార్తలు బయటకు రావడంతో.. అక్కడి నుంచి ప్రజలు ఎందుకు వలసపోతున్నారని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.. వీరు స్వచ్ఛందంగా పారిపోయి వచ్చారా..? లేక బలవంతంగా ఎవరైనా తరలించారా..? తెలియాల్సి ఉంది. కానీ, చైనా నుంచి మాత్రం భారీగా అక్రమ వలసలు జరుగుతున్నాయి. ఇది మాత్రం పచ్చినిజం..!
ఏటా కోటి మంది..

మైగ్రేషన్‌ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌(ఎంపీఐ) లెక్కల ప్రకారం ఏటా 25.8 కోట్ల మంది ప్రజలు తమ సొంత దేశాలను వదిలి వెళ్లిపోతున్నారు. వీరిలో దాదాపు కోటి మంది చైనా వాసులేనట. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వలసపోతున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంది.  ఆ దేశాన్ని వదిలిపోయే వారిలో 25 లక్షల మంది అమెరికా, 7.12లక్షల మంది కెనడా, 4.7లక్షల మంది ఆస్ట్రేలియాకు వెళుతున్నారు.  ఇక 2018లో యూకే 29లక్షల వీసాలు జారీ చేసింది. వీటిల్లో దాదాపు 7.3లక్షల మంది చైనీయులకే వీసాలు మంజూరు చేశారు.  అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11శాతం ఎక్కువ. 
చైనా కేసు విభిన్నమైంది..
సాధారణంగా స్వదేశంలో హింసను భరించలేక చాలా మంది వలసపోతుంటారు. వీరిలో అత్యధికంగా తక్కువ నైపుణ్యం ఉన్న వారు ఉంటారు. వీరంతా విదేశాలకు వెళ్లి చిన్నాచితకా పనులు చేసుకొని పొట్టపోసుకుంటారు. కానీ, చైనా వలసదారుల్లో మాత్రం తక్కువ నైపుణ్యం, మధ్యశ్రేణి నైపుణ్యం, అత్యధిక నైపుణ్యం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారని ఎంపీఐ అసోసియేట్‌ డైరెక్టర్‌ నటాలియా తెలిపారు. వీరంతా కటిక పేదలేమీ కాదని తెలిపారు. వీరంతా సౌకర్యాలు ఎక్కువగా ఉండే యూరప్‌, అమెరికాకు ఎక్కువగా వలసపోతుంటారని ఆమె పేర్కొన్నారు.
పైపై మెరుగులు..
రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద ఎగుమతిదారు ఇవన్నీ చైనా పైకి గర్వంగా చెప్పుకొనే మాటలే. అక్కడి ప్రజలు పేదరికం నుంచి వేగంగా బయటపడ్డా కొన్ని వర్గాలు మాత్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 
* అక్కడ అవకాశాలు అందరికీ సమానంగా అందడంలేదని ఎంపీఐ సిబ్బంది చెబుతున్నారు. ఇది నైపుణ్యవంతులను దేశం దాటేందుకు కారణమవుతోందని విశ్లేషించారు. 
* చాలా ఏళ్లుగా అక్కడి ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ లేకపోవడం. రాజకీయ అణచివేతకు గురి కావడం కూడా ఒక కారణం.
* ఏకసంతాన విధానం బలవంతంగా అమలు చేయడం.( అయితే కొంతకాలం క్రితం ఇద్దరు పిల్లలకు పరిమితం చేశారు.)
*  విదేశాల్లో చదువుకోవాలని కోరిక. 

* మతస్వేచ్ఛను అణచివేయడం.

* చైనాలో నైపుణ్యం ఉన్న వారు తమ కంటే తక్కువ వారితో సమానంగా జీవించడానికి ఇష్టపడకపోవడమే దీనికి ప్రధాన కారణం.  

అక్రమ వలసకు భారీగా వసూలు..
అధికారిక మార్గాల్లో వలస వెళుతుంటే పాస్‌పోర్టులు, వీసా ఫీజులు చెల్లించాలి. కానీ, అనధికారిక మార్గంలో మానవ అక్రమ రవాణాదారుల సాయంతో వలసపోతే అంతకంటే ఎక్కువే ఖర్చవుతుంది. అక్కడ అవకాశాలను, అవసరాలను తీర్చేందుకు వీరికి బలమైన నెట్‌వర్క్‌ ఉంటుంది. అందుకే అదనపు డబ్బు గుంజుతుంటారు. చదువుకోని వారిని ఇళ్లల్లో పనులకు నియమిస్తుంటారు. బాగా చదువుకుని ఉంటే అమెరికాకు తరలిస్తారు.. నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉంటే ఆఫ్రికా, తూర్పు ఐరోపా దేశాలకు వెళుతుంటారు. 
ఇక యూకేలో చైనాకు చెందిన దాదాపు లక్ష మంది విద్యార్థులు టైర్‌ 4 స్టడీ వీసాలపై చదువుతున్నారు. వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన వారని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ మైగ్రేషన్‌ ఆర్థిక వేత్త క్రిస్టియన్‌ డస్ట్‌మన్‌ తెలిపారు. వారంతా భారీగా ఖర్చు పెడుతూ లండన్‌ వంటి నగరాల్లో నివసిస్తున్నారని వెల్లడించారు.  
యూకే వెట్టిచాకిరీలో బాధితులుగా..

వెట్టిచాకిరీలో బాధితులుగా చైనీయులు మిగులుతున్నారు. యూకేలో వెట్టిచాకిరీ నుంచి బయపడ్డవారిలో చైనీయులు నాలుగో స్థానంలో ఉన్నారు. యూకే(స్థానికులు), అల్బేనియా, వియత్నాం వాసులు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇటువంటి కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా 2017లో 293 మంది చైనీయులను అధికారులు రక్షించారు. ఐరోపాలోని అన్ని దేశాల్లో చైనీయుల అక్రమ వలసలు కనిపిస్తాయి. ఇటలీలోని టెక్స్‌టైల్‌ పరిశ్రమకు వీరే ఆధారం. ఎందుకంటే వీరు తక్కువ వేతనంతో పనిచేయడానికి ఒప్పుకొంటారు. 2018లో అమెరికా బోర్డర్‌ పెట్రోల్‌ బృందాలు 1,077 మంది చైనా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొన్నాయి. ఇక 2016లో ఈ సంఖ్య 2,439 వరకు ఉంది. 
మానవ అక్రమ రవాణ మార్గం ఇదీ..
చైనా నుంచి లండన్‌కు మనుషుల అక్రమ రవాణాకు 5,000 మైళ్ల అక్రమ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఈ మార్గం చైనా, ఐరోపాలోని ప్రధాన భూభాగాల మీదుగా లండన్‌కు చేరుతుంది. నెలరోజుల సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. బేరాన్ని బట్టి అక్రమ రవాణాదారులు 50,000 పౌండ్ల వరకు వసూలు చేస్తున్నారు. చెల్లించలేని వారి కుటుంబ సభ్యులను బందీలుగా చేసి వాయిదాల రూపంలో కూడా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇక వియత్నాం నుంచి వచ్చేవారిని రష్యా, పోలాండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ మీదుగా లండన్‌కు చేరుస్తున్నారు. ఈ ప్రయాణాల్లో వలసదారులు తినడానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి సమయం, మజిలీలు పరిమితంగానే ఉంటాయి. వీరు ఒక సారి కంటైనర్‌ ఎక్కాక మరో మజిలీ వచ్చేవరకు దిగడం సాధ్యంకాదు. రవాణకు రిఫ్రిజిరేటర్‌ కంటైర్లు వంటి ప్రమాదకరమైన వాహనాలను వాడుతుంటారు. నిదానంగా ఉండే వలసదారులను చంపడానికి కూడా స్మగ్లర్లు వెనుకాడరు. చాలా మంది ఇలా ప్రాణాలు కోల్పోతుంటారు. వలసక్రమంలో వీరిని అడవులు, కొండలను దాటిస్తుంటారు. అక్కడ ఏర్పాటు చేసే క్యాంపుల్లో మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కూడా ఉండవు. తక్కువ భద్రతా ఏర్పాట్లు ఉన్న పోర్టులను మనుషల అక్రమరవాణకు ఎంచుకొంటారు. జూన్‌లో ఒక మహిళను వ్యాన్‌ ఇంజిన్లో కుక్కి తరలిస్తుండగా అధికారులు పట్టుకొన్నారు. దీనిని బట్టి అక్రమరవాణ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  అక్రమరవాణ ఇంత ప్రమాదకరమని తెలిసి కూడా ఒక్కసారి చైనా ఉక్కుపిడికిలి నుంచి బయటపడితే చాలు మిగిలిన జీవితం మొత్తం బాగుంటుందనే  ఆశతో చాలా మంది ప్రాణాలకు తెగిస్తున్నారు..!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.