close

తాజా వార్తలు

MSD కథకు MSK ముగింపేంటి?

గంగూలీ రాకతో క్లైమాక్స్‌కు చేరుతున్న కథ
 గౌరవంగా వెళ్లిపోవాలని గతంలోనే చెప్పిన గావస్కర్‌

అసలేం జరగనుంది?

‘ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పాను. మేం ఎంఎస్‌ ధోనీని దాటేసి ముందుకు వెళ్తున్నాం. యువకులకు అవకాశాలిస్తున్నాం’ బంగ్లాదేశ్‌ సిరీస్‌కు జట్టును ప్రకటించాక ఎమ్మెస్కే మాటిది.

‘విజేతలు అంత త్వరగా ముగించరు. తన కెరీర్‌ గురించి ధోనీ ఏం ఆలోచిస్తున్నాడో నాకు తెలీదు. కానీ మేం దానిపై ఆలోచిస్తాం’ బీసీసీఐ అధ్యక్షుడిగా బ్యాధ్యతలు స్వీకరించిన వెంటనే గంగూలీ చేసిన వ్యాఖ్యలివి.

‘ఎమ్మెస్కే ప్రసాద్‌ను తొలగించండి. ధోనీ కెరీర్‌ను సమీక్షించేందుకు ఆయనెవరు? గంగూలీ.. ఆయనను తొలగించండి. సెలక్షన్‌ కమిటీలో అనుభవజ్ఞులైన క్రికెటర్లు అవసరం’ ధోనీపై ఎమ్మెస్కే అభిప్రాయంపై ఫైర్‌ అయిన అభిమానులు. అందుకే ప్రస్తుతం మహేంద్రుడి పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు!!


కళ తెలిసేదెలా?

ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుంది. అది సుఖాంతమైనా కావొచ్చు. మరొకటైనా అవ్వొచ్చు. అలాగే ప్రతి ఆటగాడి కెరీర్‌కూ కచ్చితంగా ముగింపు ఉంటుంది. కొందరికి కోరుకున్న వీడ్కోలు లభిస్తే మరికొందరికి అలాంటిదేమీ దక్కదు. సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ తమను ప్రేమించే అభిమానుల నడుమ ఘనంగా కెరీర్‌కు శుభం పలికారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ దేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన క్రికెటర్లే. కానీ జయజయధ్వానాల నడుమ మైదానం వీడలేకపోయారు. ఏది ఏమైనా ఈ తరం ఆటగాళ్లకు సన్నీలా ‘వీడ్కోలు కళ’ తెలియడం లేదన్నది మాజీల మాట. పరిస్థితులూ అదే నిజమంటున్నాయి! ఏదేమైనప్పటికీ ‘అప్పుడే వదిలేశాడే. ఇంకా కొన్నాళ్లుంటే బాగుండు’, ‘అబ్బబ్బబ్బ.. ఇంకా వదలడం లేదేంట్రా బాబూ’ అనే ఈ రెండు మాటల్లో దేనిని ఎంచుకోవాలన్నది పూర్తిగా క్రీడాకారుడి ఇష్టం. ఆటగాడిని ప్రేమించే అభిమానులు మొదటిది ఎంచుకుంటే ఆటను ప్రేమించేవారు దేనిని ఎంచుకుంటారో మీకు తెలుసు! 


అహో.. మహీ

ఎంఎస్‌ ధోనీ. భారతదేశంలో కోట్లాదిమందిని ఉర్రూతలూగించిన పేరు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్‌. ఆటగాడిగా నాయకుడిగా అతడు సాధించనివి లేవు.  ఐసీసీ నిర్వహించే మూడు టోర్నీల్లో జట్టును విజేతగా నిలిపాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలబెట్టాడు. టీ20, వన్డే, ఛాంపియన్స్‌ ట్రోఫీలను అందించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌  కింగ్స్‌కు సారథ్యం వహించి 3 సార్లు విజేతగా విజయకేతనం ఎగరేశాడు. వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి దాటేశాడు. 90 టెస్టుల్లో 38.09 సగటుతో 4,876 పరుగులు చేశాడు. 350 వన్డేల్లో 50.57 సగటుతో ఏకంగా 10,773 పరుగులు చేశాడు. 10 శతకాలు బాదేశాడు. 98 టీ20ల్లో 37.60 సగటుతో 1617 పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గానూ తిరుగులేని రికార్డులు సృష్టించాడు. గణాంకాల పుస్తకాలను సవరించాడు. టెస్టుల్లో 256 క్యాచ్‌లు అందుకొని 38 స్టంప్స్‌ చేశాడు. వన్డేల్లో ఏకంగా 321 క్యాచ్‌లు అందుకొని 123 మందిని స్టంపౌట్‌ చేశాడు. టీ20ల్లో ఇవి 57, 34గా ఉన్నాయి. ధోనీ వీడ్కోలు గురించి ఏ మాజీ క్రికెటర్‌ను అడిగినా చెప్పేదొకటే! క్రికెట్లో అతడు సాధించనవి ఏవైనా ఉన్నాయా అని! ప్రపంచకప్‌ జట్టులో కనీసం చోటు దొరికితే చాలు, ఒక్కసారి ప్రపంచకప్‌ను ముద్దాడితే చాలని ఎంతో మంది ఆటగాళ్లు భావిస్తారు. మరి ధోనీ కెప్టెన్‌గా అన్నీ కోరికలను నెరవేర్చుకున్నాడు. ఇంకా తీర్చుకోవడానికి ఏముందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.


ఎన్నాళ్లీ దూరం?

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించాక మహీ భవితవ్యం ఏంటో? జట్టులో అతడి పాత్రేంటో? తేలిపోతుందనే అందరూ అనుకుంటున్నారు. ప్రపంచకప్‌ జరిగిన తర్వాత స్వయంగా అతడే జట్టుకు దూరమయ్యాడు. సైన్యంలో సేవ చేస్తానని వెస్టిండీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతో విదేశాల్లో విహారం కోసం దక్షిణాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో లేడు. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్‌కూ అదే పరిస్థితి. జనవరి వరకు అతడు మైదానంలో అడుగుపెట్టే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాదే ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. ఇప్పటికే వన్డే ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియా పొట్టి కప్పునైనా పట్టేయాలని దృఢసంకల్పంతో ఉంది. ఇప్పటికే ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శనపై దాదా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పొట్టి క్రికెట్‌ వచ్చిన మొదట్లో ‘మేమంతా దేశ సేవ చేస్తున్నాం’ అంటూ సీనియర్లను ఈ ఫార్మాట్‌కు దూరం చేసింది పరోక్షంగా ధోనీయే. ఇప్పడతను అదే పరిస్థితికి చేరుకున్నాడు. అందుకే సెలక్షన్‌ కమిటీ కుర్రాళ్లకు పెద్దపీట వేస్తోంది. అదే మాటను ఎమ్మెస్కే చెబుతుంటే ధోనీ అభిమానులు పరుషమైన పదాలతో ఆయనపై విమర్శలను ఎక్కుపెడుతుండటం గమనార్హం.


నిజం ఏంటి?

ప్రస్తుతం ధోనీ వయసు 38 దాటేసింది. టీమిండియాకు ఎంపికవ్వడం కష్టమే. ‘ప్రపంచకప్‌ తర్వాత నేను స్పష్టంగా చెప్పాను. ఎంఎస్‌ ధోనీని దాటేసి ముందుకు సాగుతున్నాం. జట్టులో కుదురుకునేందుకు యువకులకు అవకాశాలిస్తాం. రిషభ్‌పంత్‌ ప్రస్తుతం అంచనాలు అందుకోలేకపోతున్నా సమయం ఇస్తాం. ప్రత్యామ్నాయంగా సంజు శాంసన్‌కు అవకాశమిచ్చాం’ అని ఎమ్మెస్కే చెబుతున్నాడు. జట్టులో తన స్థానం, భవితవ్యంపై మహీతో మాట్లాడతానని దాదా అంటున్నాడు. తన హయాంలో ప్రతి క్రికెటర్‌కు గౌరవం దక్కుతుందని చెబుతున్నాడు. ‘ధోనీ సమయం ముగిసింది. గౌరవంగా అతడు తప్పుకోవాలి. భారత్‌ అతడిని దాటేసి ఆలోచించాలి. ధోనీపైనున్న అత్యంత గౌరవంతో పంపించకముందే అతడు నిష్ర్కమించాలి’ అని గావస్కర్‌ ప్రపంచకప్‌ ముగియగానే అన్నారు. మహీ వీడ్కోలు ప్రకటిస్తే అతడి ఇంటిముందు ధర్నా చేస్తానన్నదీ ఒకప్పుడు ఆయనే. నిక్కచ్చిగా వ్యవహరించే దాదా నేతృత్వంలో పరిస్థితులన్నీ ‘శుభం’ వైపునకు దారితీస్తుంటే ఝార్ఖండ్‌ అండర్‌-23 ఆటగాళ్లతో కలిసి ధోనీ సాధన చేస్తాడనే వార్తల వెనక దాగున్న అసలు నిజం ఏంటి???

- ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.