close

తాజా వార్తలు

తెదేపాకు, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేయడమే కాక రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

‘‘మీ నేతృత్వంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శాసనసభ్యుడిగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అయితే, నా అనుచరులు, మద్దతుదారులు.. స్థానిక వైకాపా నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. అయితే, వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చా. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుదామని నిర్ణయించుకున్నా. అనవసర శత్రుత్వం వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’

-చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ.

వైకాపా గూటికి వెళతారా?
తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే వంశీ.. చంద్రబాబుకు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల నుంచి తన అనుచరులను కాపాడుకునేందుకు రాజకీయాల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు వంశీ ప్రకటించడం రాజకీయ చర్చకు దారితీసింది. ఇటీవల రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వంశీ తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్‌ను కలిశారు. దీంతో.. వంశీ  వైకాపాలో చేరుతున్నారని ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. వైకాపా శ్రేణులు చెప్పినట్టుగానే వంశీ ..తెదేపాకు రాజీనామా చేశారు కానీ.. వైకాపా నేతలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కొత్త చర్చకు తెరలేపింది. వంశీకి వైకాపాలో చేరే ఉద్దేశం ఉంటే వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎందుకు ఆరోపణలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వంశీ .. జగన్‌తో సమావేశమైన రోజు ఉదయం భాజపా ఎంపీ సుజనాచౌదరితోనూ భేటీ అయ్యారు. గుంటూరులో సుజనాను కలిసిన వంశీ ఒంగోలు వరకూ ఆయనతో పాటు ఒకే కారులోవెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. దీనికి తోడు వంశీ వైకాపాలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైకాపా శ్రేణులు కూడా వంశీ రాకపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వంశీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? లేక వైకాపాలోనే చేరుతారా? కమలంవైపు చూస్తారా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. తన రాజకీయ భవితవ్యంపై వంశీ స్పష్టమైన ప్రకటన చేస్తేనే ఈ గందరగోళానికి తెరపడే అవకాశముంది. 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.